అభీష్ట... ఐశ్వర్య ప్రదాయిని కోట సత్తెమ్మ: సంతాన వృక్షానికి ఆదరణ | Aishwarya Pradayini Kota Sattemma Temple at Nidadavole in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

అభీష్ట... ఐశ్వర్య ప్రదాయిని కోట సత్తెమ్మ: సంతాన వృక్షానికి ఆదరణ

Aug 21 2025 9:59 AM | Updated on Aug 21 2025 10:47 AM

Aishwarya Pradayini Kota Sattemma Temple at Nidadavole in Andhra Pradesh

శంఖ చక్రగద అభయ హస్తయజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలిసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి  క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు  వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్ధం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ  మెక్కుబడులు తీర్చుకుంటారు. 

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు΄ాలెం గ్రామంలో వేంచేసిన   శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో భక్తుల పాలిట కొంగు బంగారం కోట సత్తెమ్మ అమ్మవారు విరజిల్లుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది. శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి దేవస్ధానానికి పురాతన  చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కనుమరుగై, 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి  చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి  పొలంలో వ్యవసాయ పనుల కోసం  పొలం దున్నుతుండగా అమ్మవారి విగ్రహం బయటపడింది. భూమి యజమాని రామమూర్తి శాస్త్రికి వచ్చిన కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆనాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచారు. ఈ ఆలయానికి ఎక్కువగా ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతో పాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతోపాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్ధానం ఆధ్వర్యంలో మహిళలలకు ఉచితంగా పసు పు, కుంకుమ, గాజులు, తమల΄ాకులు, లడ్డూ ప్రసాదాన్ని  పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

సంతాన లక్ష్మీ చెట్టుకు ఊయలు కడుతున్న మహిళా భక్తులు 

సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడి
శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతుంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సాంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, రెండు పూర్తిగా పండిన అరటి పండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును ఎర్రవస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అంటూ వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధికి తీసుకువచ్చి పేరుపెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు నగదు, నాణేల రూపంలో, పటిక బెల్లం కాని తూకం సమర్పించుకుని, మొక్కుబడి తీర్చుకుంటారు.

చురుగ్గా సాగుతున్న 9 అంతస్ధుల రాజగోపురం నిర్మాణం  

ఇదీ చదవండి: ఇండియన్‌ వయాగ్రా రైస్‌ తెలుసా? దేశీ వరి ఔషధ గుణాలు

ఆలయానికి వచ్చే మార్గం...
అమ్మవారి ఆలయానికి నిడదవోలు రైల్వేస్టేషన్‌ నుండి బస్టాండ్‌ మీదుగా గణపతిసెంటర్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో చేరుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలో మీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు. దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ముందుగా నిడదవోలు పట్టణం చేరుకోవాలి. అక్కడ నుండి మూడు కిలోమీటర్ల దూరంలో అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చును. 

ఇదీ చదవండి: ప్రాజెక్టులు తగ్గినా, క్వాలిటీ తగ్గలేదు : గ్రాజియా కవర్‌పేజీపై మెరిసిన సమంత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement