ఆ హరిహరసుతుడిని దర్శించుకునేందుకు శబరిమలకు మూడు మార్గాల్లో వెళ్తుంటారు భక్తులు. అందులో పులిమేడు మార్గం అత్యంత కఠినమైన దారి. థ్రిల్లింగ్, ట్రెక్కింగ్ అనుభవం కోరుకునేవారికి ఈ రూట్ సరైనది. అటు అడవి అందాలను, ప్రకృతి రమ్యతను తనివితీరా అనుభవించాలనుకునేవారు ఇష్టపడే రూట్ ఇది. అయితే ఈ పులిమేడు మార్గంలో అడుగడుగునా ఎన్నో విశేషాలతోపాటు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంది. అవేమిటో సవివరంగా తెలుసుకుందామా..!.
స్వామియే.. శరణం అయ్యప్పా..! శబరిమల మండల, మకర విళక్కు సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభం కానుంది. ఆ హరిహరపుత్రుడు అయ్యప్పను చేరుకునేందుకు ఉన్న మూడు మార్గాల్లో.. పులిమేడు అత్యంత పురాతన సంప్రదాయ మార్గం, చారిత్రత్మక విశిష్టతలు కలిగిన ప్రదేశం. సాధారణంగా ఈ శబరిమల యాత్రలో చిన్నపాదం.. అంటే పంపాబేస్ నుంచి నీలిమల, శరణ్‌గుత్తి మీదుగా శబరిమలకు చేరడం అందరికీ తెలిసిందే..!.
మకర విళక్కు సీజన్‌లో పెద్దపాదం.. అంటే.. ఎరుమేలి నుంచి దట్టమైన కీకారణ్యంలో అలుదా నది, కరిమల కొండ మీదుగా పంపాబేస్‌కు చేరి, అక్కడి నుంచి శబరిమలకు వెళ్తుంటారు. కానీ.. అత్యంత క్లిష్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా ఉండే పులిమేడు రూట్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. మరి ఆ పులిమేడు మార్గం విశేషాలు గురించి సవివరంగా తెలుసుకుందాం.
పులిమేడు రూట్ మిగతా రెండు మార్గాలకు భిన్నం. ఎందుకంటే.. పంపా నుంచి నీలిమల కొండ ఎక్కితే శబరిమలలోని అయ్యప్ప సన్నిధిని చేరుకోవచ్చు. కానీ, పులిమేడు విషయంలో అలా కాదు. పులిమేడు ఎక్కి, కిందకు దిగితే.. శబరిమల సన్నిధానాన్ని చేరుకుంటాం. మార్గమధ్యంలో పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో రుద్రక్షను పోలిన భద్రాక్ష చెట్ల మధ్య నుంచి పులిమేడు మార్గం ఉంటుంది.

పులిమేడు మార్గం మీదుగా శబరిని చేరాలనుకునే భక్తులు ముందుగా ఇడుక్కి జిల్లాలోని వండి పెరియార్‌కు రావాల్సి ఉంటుంది. 2011 వరకు పులిమేడు కొండ పైవరకు కేఎస్ఆర్టీసీ బస్సులు, ప్రవైటు వాహనాలు వెళ్లేవి. అప్పట్లో మకరజ్యోతి సందర్భంగా బస్సు ప్రమాదం జరగడంతో.. అధికారులు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.
అలాగే కాలినడకన వెళ్లేవారిని కూడా ఆ మార్గంలో అనుమతించడం లేదు. అయితే.. పులిమేడు ఫారెస్ట్ చెక్‌పోస్టు నుంచి కుడివైపున ఉన్న కఠినమైన మార్గంలో ‘సత్రం’ అనే పేరుతో పిలిచే సుబ్రమణ్య స్వామి ఆలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది.
పులిమేడులోని వాటర్ పాయింట్లకు ఉదయం 6 గంటల వరకు అడవి ఏనుగుల మందలు నీళ్లు తాగడానికి వస్తాయి. అందుకే ఫారెస్ట్ అధికారులు ఉదయం 7 గంటల తర్వాతే భక్తులను సత్రం ఆలయం వైపు వెళ్లనిస్తారు. సత్రం వద్ద పోలీసులు పులిమేడు మార్గం మీదుగా వెళ్లే భక్తుల పేర్లను నమోదు చేసుకుని, అడవి మార్గంలోకి అనుమతిస్తారు.
సత్రం నుంచి పులిమేడు కొండను అధిరోహించాల్సి ఉంటుంది. ఆ తర్వాత చిన్నచిన్న వాగులు ఉంటాయి. ఇక్కడ భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వాగుల్లో ఉండే జలగలతో భక్తులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కఠినమైన మార్గం కావడంతో.. తాగునీరు కూడా దొరకని పరిస్థితి. అందుకే.. వాటర్ బాటిల్, తినుబండారాలను వెంట తీసుకెళ్లాలి.
(చదవండి: Chithira Thirunal Balarama Varma: 'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!)
పులిమేడు కొండ నుంచి కిందకు దిగే మార్గం లోయలతో ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాలు పడినప్పుడు ఇరుకైన ఈ మార్గంలో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఇరుకు మార్గాలను దాటాక.. శ్రీరామపాదం వస్తుంది. భక్తులు శరణుఘోషల్లో ‘శ్రీరామ పాదమె శరణంపొన్నయ్యప్పా’ అంటూ ఆలపించడం తెలిసిందే..! ఈ ప్రాంతాన్ని శ్రీరాముడు నడయాడిన నేలగా పిలుస్తారు. ఇక్కడి జలపాతం వద్ద భక్తులు స్నానాలు ఆచరించి, శ్రీరాముడు పాదం మోపిన గుంటగా చెప్పుకొనే గుండంలో మునుగుతారు.
ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు కిందకు దిగితే.. శబరిమల సన్నిధానంలో పదునెట్టాంబడి క్యూలైన్ వద్దకు చేరుకుంటారు. ఇదండి ఈ పులిమేడు మార్గం విశిష్టత. ఈసారి సరదాగా ఈ మార్గంలో ట్రై చేద్దాం అనుకునే భక్తులు ముందుగా ఈ జాగ్రత్తలు గురించి సవిరవరంగా తెలుసుకుని అనుసరించడం ఉత్తమం.
(చదవండి: అరుణాచల క్షేత్రం: పర్వతమే పరమేశ్వరుడు..!)


