తాడేపల్లిగూడెం రూరల్: యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్ అనేది భారతీయ ఆరోగ్య రంగానికి పెను సవాలుగా మారిందని జాతీయ ఫార్మసీ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ మెంతు కుమార్ ఎం.పాటిల్ అన్నారు. శుక్రవారం మండలంలోని పెదతాడేపల్లి వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవం, జాతీయ ఫార్మసీ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య రంగంలో వైద్యులతో పాటు ఫార్మాసిస్ట్‌ల పాత్ర కూడా అత్యంత కీలకమైనదన్నారు. ప్రజలు వ్యాధుల నివారణకు అవగాహన లేకుండా అనవసరంగా మందులు వాడుతున్నారని, వారిలో చైతన్యం నింపి యాంటీబయోటిక్ వాడకాన్ని తగ్గించేలా చూడాల్సిన బాధ్యత ఫార్మాసిస్ట్‌లపై ఉందన్నారు. ప్రతి ఫార్మసీ విద్యా సంస్థ కనీసం 10 పరిశ్రమలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకునేలా చేయడం ఫార్మసీ కౌన్సిల్ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఫార్మసీ కౌన్సిల్ ఐసీటీ అధ్యక్షుడు డాక్టర్ పి. సత్యమూర్తి, పిసిఐ సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ ఎస్.ఎల్.ఎన్. ప్రసాద్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడు డి. శ్రీహరిరావు, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి. రత్నం ప్రసంగించారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించగా, వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గ్రంధి సత్యనారాయణ, కార్యదర్శి చలంచర్ల సుబ్బారావు, టెక్నికల్ డైరెక్టర్ చక్కా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


