పోలింగ్ జరిగిందిలా..
● అంచనాలకు భిన్నంగా ఓటింగ్
● క్రాస్ ఓటింగ్‌పై చర్చ
● నాలుగు మండలాల్లో 69.92 శాతం పోలింగ్ నమోదు
బుట్టాయగూడెం: గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల సంక్షేమం, సుభిక్ష పాలన.. రెండున్నరేళ్లుగా కూట మి ప్రభుత్వ దగా పాలన చూసిన మన్యం ఓటర్లు కూటమికి సైలెంట్ షాక్ ఇచ్చినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు మండలాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తరలివచ్చారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధిక సంఖ్యలో, మధ్యాహ్నం నుంచి మందకొడిగా ఓటర్లు కనిపించారు. నాలుగు మండలాల పరిధిలో నాలుగు జెడ్పీటీసీ, 40 ఎంపీటీసీ స్థానాలకు 140 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 1,18,177 మంది ఓటర్లకు 82,634 మంది (40,147 మంది పురుషులు, 42,484 మంది మహిళలు, 3 ఇతరులు) ఓటు హక్కును వినియోగించుకోగా 69.92 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ బహిష్కరణ
తమకు ప్రత్యేక పంచాయతీ కోరుతూ బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాలకు చెందిన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు పోలింగ్‌ను బహిష్కరించారు. జీలుగుమిల్లి మండలం కొత్తూరు నిర్వాసితులను అసిస్టెంట్ కలెక్టర్ శ్రావణ్‌కుమార్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవీ రమణ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా నిర్వాసితులు భీష్మించుకున్నారు. బుట్టాయగూడెం మండలం దొరమామిడిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, మాజీ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
● బుట్టాయగూడెంలో.. బుట్టాయగూడెం మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలకు 49 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మొత్తం 42,962 మంది ఓటర్లకు 30,045 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 14,433 మంది, మహిళలు 15,611 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. 69.93 శాతం పోలింగ్ నమోదైంది.
● జీలుగుమిల్లిలో.. జీలుగుమిల్లి మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలకు 32 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 18,352 ఓట్లు పోలవ్వగా.. పురుషులు 8,974 మంది, మహిళలు 9,377 మంది, ఒక థర్డ్ జండర్ ఉన్నారు. 71.37 శాతం పోలింగ్ నమోదైంది.
● పోలవరంలో..
పోలవరం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలకు 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 20,458 ఓట్లు నమోదు కాగా వీరిలో 9,973 మంది పురుషులు, 10485 మంది మహిళలు ఉన్నారు. 64.11 శాతం పోలింగ్ నమోదైంది.
● వేలేరుపాడులో..
వేలేరుపాడు మండలంలో 5 ఎంపీటీసీ స్థానాలకు 22 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 13,779 ఓట్లు పోలవ్వగా.. వీరిలో పురుషులు 6,767 మంది, మహిళలు 7,011 మంది ఉన్నారు. అత్యధికంగా 78.33 శాతం పోలింగ్ నమోదైంది.
మండలాలు 4
ఎంపీటీసీ స్థానాలు 40
జెడ్పీటీసీ స్థానాలు 4
పోలింగ్ కేంద్రాలు 140
మొత్తం ఓటర్లు 1,18,177
ఓటేసిన వారు 82,634
పోలింగ్ శాతం 69.92


