● బాణసంచా ధరలు భారీగా పెరుగుదల
● చిన్నపాటి టపాసుల నుంచి భారీ చిచ్చు బుడ్ల వరకు ధరలకు రెక్కలు
● జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన విక్రయాలు
ద్వారకాతిరుమల: దీపావళి పండుగ అంటేనే వెలుగులు, ఆనందాలు.. చిన్నారుల కేరింతలు.. టపాసుల మోతలు. అయితే ఈసారి పండుగ సంబరాల కంటే బాణసంచా ధరలే సామాన్యులకు ఎక్కువ మోత మోగిస్తున్నాయి. ఆదివారం దీపావళికి టపాసులు కొందామంటే ధరలు ఆశాన్నంటాయి. జిల్లావ్యాప్తంగా శుక్రవారం బాణసంచా దుకాణాలను వ్యాపారులు ఏర్పాటుచేశారు. దీంతో కొనుగోలుదారులు టపాసుల ధరలను ఆరా తీస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ధరలు గణనీయంగా పెరిగాయని, సామాన్య కుటుంబాలు టపాసులు కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు చెబుతున్నారు.
వామ్మో ధరలు : ప్రస్తుతం మార్కెట్‌లో బాణసంచా ధరలు రకాన్ని బట్టి పలుకుతున్నాయి. 50 బిజిలీ టపాసుల ప్యాకెట్ ధర సుమారు రూ.30 నుంచి రూ. 60 వరకు ఉండగా, ఐదు లక్ష్మీ టపాసుల ప్యాకెట్ రూ.25 నుంచి రూ.60 వరకు, తళుకుల చిచ్చుబుడ్లు రూ.50 నుంచి రూ.120 వరకు, పది చిన్న పూలకుండీల ప్యాకెట్ రూ.100 నుంచి రూ.200 వరకు, పెద్ద పూలకుండీల ప్యాకెట్ రూ.200 నుంచి రూ.350 వరకు ధర పలుకుతోంది. పది గ్రౌండ్ చక్రాల ప్యాకెట్ రూ.80 నుంచి రూ.200 వరకు, పది రాకెట్ల ప్యాకెట్ రూ.150 నుంచి రూ.450 వరకు విక్రయిస్తున్నారు. ఇక కలర్ కోటి ప్యాకెట్లు రూ.200 నుంచి రూ.400 వరకు ఉండగా, భారీ ఫ్యాన్సీ షాట్స్ ధరలు రూ.500 నుంచి ప్రారంభమవుతున్నాయి. బ్రాండ్, నాణ్యత, ప్యాకెట్‌లోని టపాసుల సంఖ్యను బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటోంది.
జేబుకు చిల్లు : టపాసుల ధరలు పెరగడంతో కొనుగోలుదారులు తమ బడ్జెట్‌కు అనుగుణంగా కొనుగోళ్లు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. గతంలో వందల రూపాయలతో సంచి నిండా టపాసులు కొనుగోలు చేసేవారమని, ప్రస్తుతం అదే మొత్తంతో కొద్దిపాటి సామగ్రి మాత్రమే వస్తోందని పలువురు వాపోతున్నారు. చిన్నారుల కోసం టపాసులు కొనాలన్నా అదనపు ఖర్చు తప్పడం లేదంటున్నారు.


