వణికిస్తున్న వెంకయ్య వయ్యేరు | - | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న వెంకయ్య వయ్యేరు

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

వణికిస్తున్న వెంకయ్య వయ్యేరు

తణుకు అర్బన్‌ : ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో వస్తున్న భారీ వరద నీటి తాకిడికి తణుకు మండలం దువ్వ వయ్యేరు తీవ్రంగా వణికిపోతోంది. దువ్వతోపాటు కోనాల, ముద్దాపురం గ్రామాల్లో వరద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా దువ్వ రెగ్యులేటర్‌ పరిస్థితి ప్రమాదకరంగా మారింది. రెగ్యులేటర్‌ సామర్థ్య ఎత్తు 15 అడుగులు కాగా, ఇప్పటికే ఆ నీటిమట్టం దాటిపోవడంతో ఉన్న నాలుగు గేట్లను ఎత్తివేశారు. 16,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న ఈ రెగ్యులేటర్‌ గుండా ప్రస్తుతం 22,600 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో బ్రిటిస్‌ కాలంలో నిర్మించిన ఈ రెగ్యులేటర్‌ ఏమవుతుందోనని గ్రామస్తులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. గతంలో 23 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పటికీ, నాటితో పోలిస్తే ఇప్పుడు రెగ్యులేటర్‌లో నాణ్యత దెబ్బతిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ధ్వంసమైతే దువ్వతోపాటు పలు గ్రామాల్లోని ఇళ్లు జలమయమయ్యే ప్రమాదం పొంచి ఉంది.

ముంపు బారిన గ్రామాలు.. రోడ్డున పడ్డ కుటుంబాలు

ఎర్రకాలువ ఉధృతికి పలుచోట్ల గండ్లు పడటంతో తాడేపల్లిగూడెం మండలంలోని నందమూరు, మారంపల్లి, ఆరుళ్లు.. తణుకు మండలం దువ్వ, కోనాల, ముద్దాపురం గ్రామాల్లోకి వరద నీరు చేరి పంట పొలాలు మునిగిపోయాయి. దువ్వ వయ్యేరును ఆనుకుని గుడిసెలు వేసుకుని నివసించే 50కి పైగా నిరుపేద కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గుడిసెల్లోకి నీరు చేరడంతో వారంతా రోడ్డు పక్కనే గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. ఎగువన కొంగువారిగూడెం జలాశయం నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. అయితే శనివారం సాయంత్రం నాటికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టవచ్చని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

భీమవరానికి పొంచి ఉన్న ముంపు ముప్పు

భీమవరం : పట్టణ మధ్య నుంచి ప్రవహిస్తున్న యనమదుర్రు కాలువ ప్రవాహం ఉధృతి పెరగడంతో పట్టణ వాసుల్లో ముంపు భయం పట్టుకుంది. గత పది రోజులుగా అర్నబ్‌, మురసు తుపాన్ల కారణంగా కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బట్లు పడ్డారు. ప్రస్తుతం వర్షాలు తగ్గినప్పటికీ యనమదుర్రు కాలువలో నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పల్లపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దుర్గాపురం, మెంటేవారితోటలో తీవ్ర ఇబ్బందులు

కాలువలో నీటి ప్రవాహం తీవ్రం కావడంతో మెంటేవారితోట, దుర్గాపురం ప్రాంతాల్లో నీరు ఎగదన్ని ఇళ్లలోకి చేరింది. మెంటేవారితోటలోని మిరామియా కోడు మురుగునీరు యనమదుర్రు కాలువలో కలవాల్సి ఉండగా, కాలువ ఉధృతి కారణంగా గట్టుపై నుంచి మురుగునీరు ప్రవహిస్తోంది. దీంతో కోడు ఇరువైపులా ఉన్న రోడ్లు జలమయమై ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. దుర్గాపురంలోనూ డ్రెయినేజీలు ఎగదన్ని ఇళ్ల మధ్య నీరు నిలిచిపోయింది. పలుచోట్ల ఆయిల్‌ ఇంజిన్ల ద్వారా నీటిని కాలువలోకి తోడుతున్నప్పటికీ మురుగు సమస్య పూర్తిగా తొలగలేదు.

గండ్లు పడే ప్రమాదంపై ఆందోళన

ప్రస్తుత నీటి ఉధృతికి యనమదుర్రు కాలువ గట్లు అంచుల వరకు నీరు ప్రవహిస్తోంది. ప్రవాహం మరింత పెరిగితే గట్లు తెగిపోయే ప్రమాదముందని, దీనివల్ల పట్టణానికి పెనుముప్పు వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దువ్వలో ప్రమాదకరంగా నీటి ప్రవాహంతో వయ్యేరు

వరద నీటికి రోడ్డు, పంట పొలాలు ఏకమైన దృశ్యం

ఉధృతంగా ప్రవహిస్తున్న యనమదుర్రు కాలువ

మిరామియా కోడు పొంగుతుండంతో రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు

ఎర్రకాలువ ప్రవాహ తీవ్రతకు సమీప గ్రామాల్లో గుబులు

ప్రమాదకర స్థాయిలో దువ్వ రెగ్యులేటర్‌

సామర్థ్యానికి మించి వరద నీటి ప్రవాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement