దీపావళి వెలుగులు.. భద్రతతోనే సంతోషాలు | - | Sakshi
Sakshi News home page

దీపావళి వెలుగులు.. భద్రతతోనే సంతోషాలు

Nov 7 2026 1:00 AM | Updated on Nov 7 2026 1:00 AM

దీపావళి వెలుగులు.. భద్రతతోనే సంతోషాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

● బాణసంచా దుకాణాల వద్ద నిబంధనలు పాటించాల్సిందే

● అగ్నిమాపకశాఖాధికారుల ఆదేశం

భీమవరం: దీపావళి పండుగ వేళ బాణసంచా విక్రయాలకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ధరలు పెరిగినప్పటికీ పండుగ ఉత్సాహంలో బాణసంచా కాల్చేందుకు యువత, పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట తదితర ప్రాంతాల్లో తాత్కాలిక బాణసంచా దుకాణాల ఏర్పాటుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యంగా భీమవరం పట్టణంలోని బైపాస్‌ రోడ్డులో ఉన్న జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణంలో దాదాపు 30 దుకాణాల వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఒకే చోట పెద్ద సంఖ్యలో షాపులు వెలుస్తుండటంతో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

పాటించాల్సిన నిబంధనలివే

● దుకాణాలను గుడారాలు లేదా మండే స్వభావం కలిగిన వస్తువులతో నిర్మించకూడదు. ఒక దుకాణానికి మరొక దుకాణానికి మధ్య కనీసం 3 మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి.

● షాపుల్లో నూనె దీపాలు, గ్యాస్‌ దీపాలు ఉపయోగించకూడదు. కొనుగోలుదారుల కోసం దుకాణాల వద్ద బాణసంచాను కాల్చి పరీక్షించే (టెస్టింగ్‌) ప్రయోగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనివ్వకూడదు.

● తక్కువ పేలుడు స్వభావం కలిగిన ప్రమాణీకృత బాణసంచాను మాత్రమే విక్రయించాలి. స్థానికంగా తయారు చేసిన తారాజువ్వలు, చిచ్చుబుడ్లు, తాటాకు టపాకాయలు, నార బాంబులతో పాటు గన్‌ పౌడర్‌, నైట్రేట్‌, క్లోరేట్‌, అల్యూమినియం మిశ్రమంతో కూడిన ప్రమాదకర మందుగుండు అమ్మకాలను పూర్తిగా నిషేధించారు.

● ప్రమాదం సంభవిస్తే అగ్నిమాపక వాహనం సులువుగా వచ్చి వెళ్లేలా రవాణా సదుపాయం ఉండాలి. ప్రతి దుకాణం వద్ద 9 లీటర్ల సామర్థ్యం కలిగిన నాలుగు ఫైర్‌ బకెట్లను ఏర్పాటు చేసి, రెండింటిలో పొడి ఇసుకను, రెండింటిలో నీటిని సిద్ధంగా ఉంచుకోవాలి.

● దుకాణాల సమీపంలో పొగతాగడాన్ని పూర్తిగా నిషేధించాలి. స్థానిక ఫైర్‌ స్టేషన్‌ ఫోన్‌ నంబర్‌తో పాటు అగ్నిమాపక శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 101, పోలీసు శాఖ టోల్‌ ఫ్రీ నంబర్‌ 100 లతో కూడిన ప్రదర్శన బోర్డులను అందరికీ కనిపించేలా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.

బాణసంచా విక్రయదారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. వ్యాపారులకు బాణసంచా తయారీకి ఎలాంటి అనుమతులు లేవు. కాబట్టి అనుమతి పొందిన సంస్థల నుంచి తెచ్చిన బాణసంచాను మాత్రమే అమ్మాలి. 18 ఏళ్లలోపు పిల్లలకు విక్రయించకూడదు. నిబంధనలను అతిక్రమించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.

– కె. శ్రీనివాసరావు, జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపకాధికారి, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement