జంగారెడ్డిగూడెం (బుట్టాయగూడెం) : జపాన్‌లో జరిగిన ఆసియా పారా గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో మూడు పతకాలు సాధించిన జంగారెడ్డిగూడెం వాసి, ఇంటర్నేషనల్ స్విమ్మర్ రవికార్తీక్ బుడిగినకు అరుదైన గౌరవం లభించింది. సీనియర్ న్యాయవాది బుడిగిన నాగేంద్రకుమార్ తనయుడైన కార్తీక్.. దేశ ప్రధాని నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకొని ఢిల్లీలో మోదీని అధికారికంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో ముచ్చటించి, విజయాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో జరిగే ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్ వంటి అంతర్జాతీయ పోటీల్లోనూ ఇలాగే రాణించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షూస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
భీమవరం: పట్టణంలోని ఓ ఇంట్లో హల్‌చల్ చేస్తున్న రెండు పునుగుపిల్లులను శుక్రవారం అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. స్థానిక పోలీసు బొమ్మ సెంటర్‌లోని ఎన్.సర్వారాయుడు నివాసంలో కొంతకాలంగా ఇవి సంచరిస్తున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం.. శుక్రవారం ఆ రెండు పిల్లులను పట్టుకుని బోనులో బంధించింది. వాటిని సురక్షితంగా అడవిలో వదులుతామని అధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెం(బుట్టాయగూడెం): జంగారెడ్డిగూడెం మండలం వేగవరం సమీపంలోని జల్లేరు ఎర్రకాలువలో మత్స్యకారుల వలకు సుమారు 20 కిలోల బరువైన భారీ చేప చిక్కింది. అసాధారణ పరిమాణంలో ఉన్న ఈ చేప స్థానికంగా అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. వేగవరం గ్రామానికి చెందిన కొబ్బరికాయల వ్యాపారి, రైతు గంటికూటి చిన్న దీనిని రూ. 7 వేలకు కొనుగోలు చేశారు. ఎర్రకాలువలో ఇంతటి భారీ సైజులో చేప లభించడంపై స్థానికులు, మత్స్యకారులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
అత్తిలి: దివ్యాంగుల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2వ వార్షిక సర్వసభ్య సమావేశం శుక్రవారం అత్తిలిలో అసోసియేషన్ కార్యదర్శి యడ్లపల్లి సూర్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర, జిల్లా స్థాయి సంఘాల రిజిస్ట్రేషన్, క్రీడాకారుల వివరాల అప్‌డేట్, గత ఏడాది క్రీడా కార్యక్రమాల సమీక్ష, రాబోయే వార్షిక క్రీడా క్యాలెండర్ రూపకల్పన, సౌత్ జోన్ టోర్నమెంట్ల నిర్వహణ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే, ప్రతి ఏటా రెండుసార్లు ప్రతిభ గుర్తింపు/ఎంపిక ట్రయల్స్ నిర్వహించడం, అండర్–19 క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించడం, బాలికా క్రీడాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం, మే నెలలో వేసవి శిక్షణ శిబిరాలు (సమ్మర్ క్యాంప్స్) నిర్వహించడం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో 2026–27 సంవత్సరానికి వివిధ కమిటీలు బాధ్యతలను నియమించారు. గేమ్ డెవలప్‌మెంట్ ఆపరేషనన్స్ డైరెక్టర్‌గా సుగాలి మధుసూదన్‌నాయక్, టోర్నమెంట్ ప్రోగ్రామింగ్, సీఎస్‌ఆర్ యాక్టివిటీస్ డైరెక్టర్‌గా గాధంశెట్టి తేజ, సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా జి.కై లాష్, లాజిస్టిక్స్ కమిటీ చైర్మన్‌గా కన్నూరి సురేష్, అంపైరింగ్ కమిటీ చైర్మన్‌గా రాజపుట్ నాగేంద్రసింగ్, స్కోరర్ కమిటీ చైర్మన్‌గా దాసం దుర్గారావు ఎన్నికయ్యారు. జోనల్ కోఆర్డినేటర్లుగా సౌత్ జోన్‌కు రామాంజుల నాయక్, సెంట్రల్ జోన్‌కు సుబ్బయ్య, నార్త్ జోన్‌కు బి.రామృష్ణ, సలహాదారులుగా యడ్లపల్లి అయ్యప్పస్వామి, శరకణం పద్మారావు, మైపాల శ్రీనివాసు, అసోసియేషన్ మీడియా ఇన్‌చార్జిగా సిరిపురపు శ్రీహరి, అంబుడ్స్‌మన్ ఎథిక్స్ ఆఫీసర్‌గా అనుకుల రమేష్ ఎన్నికయ్యారు.


