చింతలపూడి: మురసు తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఎగువన ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో శివపురం – చిన్నంపేట గ్రామాల మధ్య ఉన్న ప్రధాన వంతెన కోతకు గురైంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు అలుగు పారి దాదాపు 18 వేల క్యూసెక్కుల మేర వరద నీరు ఉధతంగా ప్రవహించడంతో ఈ వంతెన వద్ద ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. వరద పోటెత్తిన సమయంలో అప్రమత్తమైన అధికారులు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా రెండు రోజుల పాటు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు, వంతెన సమీప భాగం తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ మార్గంలో రాకపోకలు స్తంభించడంతో గత మూడు రోజులుగా రెండు జిల్లాల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, అత్యవసర వైద్య సేవల కోసం కిలోమీటర్ల మేర ప్రత్యామ్నాయ మార్గాల్లో చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వస్తోంది. అధికారులు వెంటనే స్పందించి యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు పూర్తి చేసి, రాకపోకలను త్వరితగతిన పునరుద్ధరించాలని స్థానికులు, ప్రయాణికులు కోరుతున్నారు.


