బుట్టాయగూడెం : ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం దంచికొట్టింది. ఇటీవల మురసు తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు నేలంతా ఇప్పటికే తడిసి ముద్దవ్వడంతో, శుక్రవారం కురిసిన వర్షానికి వాగులు, పిల్ల కాలువలు పొంగిపొర్లాయి. కొండ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి గుబ్బలమంగమ్మతల్లి జల్లేరు జలాశయంలోకి నిరంతరం వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం పెరుగుతుండటంతో ఇరిగేషన్ అధికారులు రెండు గేట్లు ఎత్తి, స్లూయిజ్ ద్వారా 300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈ సురేష్ తెలిపారు. ఈ జలాశయం పూర్తి సామర్థ్యం 217.80 మీటర్లు కాగా, ప్రస్తుతం 216.95 మీటర్ల నీటిమట్టం నమోదైంది. ప్రాజెక్టులోకి 208 క్యూసెక్కుల ఇన్–ఫ్లో వస్తుండగా, ఔట్–ఫ్లో 300 క్యూసెక్కులుగా ఉందన్నారు. మరోవైపు పొగొండ రిజర్వాయర్‌కు కూడా భారీగా వరద రావడం వల్ల స్పిల్‌వే ద్వారా నీరు వెలుపలకు ప్రవహిస్తోంది. అలాగే జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని కేకేఎం ఎర్రకాలువ జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 82.90 మీటర్లకు చేరినట్లు ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.
జలాశయాల్లోకి భారీగా చేరిన వరద నీరు


