ఏలూరు (టూటౌన్): పారాలీగల్ వలంటీర్లు స్వచ్ఛందంగా ప్రజాసేవ చేయడానికి ఎంచుకున్న మార్గం ఉత్తమమైందని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి అన్నారు. శుక్రవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో పారాలీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్లు ప్రతిఫలాపేక్ష లేకుండా సేవామార్గాన్ని ఎంచుకోవడం అభినందనీయమన్నారు. న్యాయ సహాయం కోసం వచ్చే కక్షిదారులకు న్యాయసేవాధికార సంస్థలు ద్వారా న్యాయ సహాయాన్ని అందించాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, శాశ్వత లోక్ అదాలత్ చైర్పర్సన్ ఎ.మేరీగ్రేస్ కుమారి, రీసోర్స్ పర్సన్ బి.శ్రీలక్ష్మి, కునా కృష్ణారావు, కోనె సీతారాం, కె.శివప్రసాద్, డీసీపీఓ సీహెచ్ సూర్యచక్రవేణి తదితరులు పాల్గొన్నారు.


