ఉదయాన్నే ఉపాధ్యాయులకు షాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఉదయాన్నే ఉపాధ్యాయులకు షాక్‌

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను, ఉపాధ్యాయులను తీవ్ర వేధింపులకు గురిచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే నిరంతర బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులను స్థానిక సంస్థల ఎన్నికల విధులలోనూ దారుణంగా అవమానించడమే కాకుండా, తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారు. ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాలిటీల్లో నిర్వహించే స్థానిక ఎన్నికల విధులకు సంబంధించి ఉపాధ్యాయులకు నగరంలోని సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాలలో ఇటీవల శిక్షణ పూర్తిచేశారు. ఆ తర్వాత స్థానిక స్థాయిల్లోనూ శిక్షణ ఇచ్చారు. అయితే ఈ విధుల కేటాయింపులో తీవ్ర వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. సర్వీసులో సీనియర్లయిన స్కూల్‌ అసిస్టెంట్లకు అదర్‌ పోలింగ్‌ ఆఫీసర్లు (ఓపీఓ)గా సాధారణ పనులు కేటాయించి.. వారి కంటే జూనియర్లయిన సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు (ఎస్జీటీ) పోలింగ్‌ ఆఫీసర్‌ (పీఓ), అసిస్టెంట్‌ పోలింగ్‌ ఆఫీసర్‌ (ఏపీఓ) బాధ్యతలు అప్పగించారు. జూనియర్ల పర్యవేక్షణలో తమను పనిచేయమనడం తమను తీవ్రంగా అవమానించడమేనని సీనియర్‌ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చివరి నిమిషంలో డ్యూటీ మార్పుల ప్రకంపనలు

నిబంధనల ప్రకారం సొంత ఓటు ఉన్న ప్రాంతాల్లో కాకుండా ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల మధ్య ఉపాధ్యాయులను మార్చి విధులు కేటాయించారు. అయితే ర్యాండమైజేషన్‌ లోపాలు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో, శనివారం ఉదయం 7 గంటల కల్లా నిర్ణీత స్థానాల్లో రిపోర్ట్‌ చేయాల్సిన సమయానికి జిల్లా విద్యాశాఖాధికారి వాట్సాప్‌ గ్రూపుల్లో నూతన మార్పుల జాబితాను పోస్ట్‌ చేశారు. అప్పటికే దూర ప్రాంతాల నుంచి వచ్చి లాడ్జీలు, బంధువుల ఇళ్లలో బస చేసిన వారు, ఉదయాన్నే ప్రయాణమైన వారు రిపోర్టింగ్‌ సమయానికి ఈ జాబితా చూసి తీవ్ర గందరగోళానికి గురయ్యారు. ఉదయాన్నే మరో ప్రాంతానికి అప్పటికప్పుడు చేరుకోవడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.

పాఠశాలల నుంచి మళ్లీ పిలుపు

మరోవైపు శిక్షణ పొందాక విధులు లేవని శుక్రవారమే చెప్పడంతో పాఠశాలలకు వెళ్లిన ఉపాధ్యాయులకు సైతం శనివారం ఉదయం అధికారులు అత్యవసరంగా ఫోన్లు చేశారు. తరగతి గదుల్లో బోధనలో ఉన్న ఉపాధ్యాయులు బోధనను మధ్యలోనే నిలిపివేసి విధులకు పరుగులు తీయాల్సి వచ్చింది. గతంలో తాము అనేక ఎన్నికల్లో విధులు నిర్వహించామని, కానీ అధికారుల పర్యవేక్షణా రాహిత్యం కారణంగా ఇలాంటి దుస్థితిని ఎప్పుడూ చూడలేదని ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

డ్యూటీలు మారిపోయాయి త్వరగా వచ్చేయండని మెసేజ్‌

(ఏఐ సృష్టించిన చిత్రం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement