కై కలూరు: కొల్లేరు ప్రజలకు అమలుకాని హామీలిచ్చి కూటమి నాయకులు మరోసారి మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆరోపించారు. కై కలూరు మండలం కొల్లేరు గ్రామాల్లో జడ్పీటీసీ అభ్యర్థి జయమంగళ కాసులు, ఎంపీటీసీ అభ్యర్థుల విజయం కోరుతూ పెంచికలమర్రు, గుమ్మళ్ళపాడు, కొట్టాడ, వడ్లకూటితిప్ప, శృంగవరప్పాడు, గోకర్ణపురం, లక్ష్మీపురం, కొల్లేటికోట గ్రామాల్లో శనివారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో డీఎన్నార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సర్కారు కాలువపై సిమెంటు వంతెన మూలనపడిందని, గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలోనే పాత బకాయిలు చెల్లించి ఆ వంతెనను పూర్తి చేశామన్నారు. అలాగే కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద అతిపెద్ద అనివేటి మండపాన్ని దాతల సహకారంతో నిర్మించి భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. కొల్లేరు ప్రాంత అభివృద్ధికి తమ ప్రభుత్వం అనేక రోడ్లు, రింగురోడ్లు నిర్మించిందని గుర్తుచేశారు. కొల్లేరు గ్రామానికి చెందిన బిడ్డ, జడ్పీటీసీ అభ్యర్థి జయమంగళ కాసులును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
రూ.6 కోట్ల అవకతవకలపై విచారణ:
పందిరిపల్లిగూడెంలో గ్రామ అభివృద్ధి నిధులకు సంబంధించి రూ. 6 కోట్లు దుర్వినియోగం అయ్యాయని, చెరువుల మీద వచ్చే డబ్బులకు లెక్కలు చెప్పకుండా కొంతమంది కాపాడుతున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన డీఎన్నార్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దీనిపై ప్రత్యేక విచారణ కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎంపీటీసీ అభ్యర్థులు సింహద్రి గురుమూర్తులు, చిన్నం స్రవంతి, పడమటి శేషావాతరం, ముంగర పెద్దింట్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్


