టీడీపీ ఏజెంట్లుగా రిటర్నింగ్‌ అధికారులు | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఏజెంట్లుగా రిటర్నింగ్‌ అధికారులు

Nov 1 2026 4:37 AM | Updated on Nov 1 2026 4:37 AM

టీడీపీ ఏజెంట్లుగా రిటర్నింగ్‌ అధికారులు

వేలేరుపాడు: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిటర్నింగ్‌ అధికారులు (ఆర్‌ఓలు) అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్‌, వైఎస్సార్‌సీపీ మండల నాయకులు కవులూరి సత్తిరాజు, మాస్‌ లైన్‌ జిల్లా నాయకులు సిరికొండ రామారావు విమర్శించారు. శనివారం వేలేరుపాడు మండలంలోని మేడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎంపీటీసీ అభ్యర్థిని చిచ్చడి జ్యోతితో కలిసి వారు మాట్లాడారు. నవంబరు 5న జరగనున్న వేలేరుపాడు మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించి మేడేపల్లి, రామవరం, నార్లవరం ఎంపీటీసీ స్థానాలకు సీపీఐ(ఎంఎల్‌) మాస్‌ లైన్‌ అభ్యర్థులుగా చిచ్చడి జ్యోతి, కారం కావ్య, కరటం రత్తమ్మ అక్టోబరు 21, 22 తేదీలలో నామినేషన్లు వేశారని తెలిపారు. అక్టోబరు 24, 25, 26 తేదీల్లో జరిగిన స్క్రూటినీలో ఎటువంటి అభ్యంతరాలు రాలేదని, ఎవరూ అప్పీలు కూడా చేయలేదని వెల్లడించారు. అక్టోబరు 27న రిటర్నింగ్‌ అధికారి తమ అభ్యర్థులకు ‘కత్తెర’ గుర్తు కేటాయించి, ఎంపీడీఓ కార్యాలయ నోటీస్‌ బోర్డులో ఫామ్‌–9 విడుదల చేశారన్నారు. ప్రచారానికి మైక్‌ పర్మిషన్‌ కూడా ఇవ్వడంతో అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే అభ్యర్థులు దాఖలు చేసిన రెండు సెట్ల నామినేషన్లలో ఒక సెట్‌ను విత్‌డ్రా చేసుకోమని ఆర్‌ఓ చెప్పడంతో ఒక్కో సెట్‌ వెనక్కి తీసుకున్నట్లు వివరించారు.

అధికార పార్టీ ఒత్తిళ్లతో తొలగింపు

ఈ క్రమంలో అక్టోబరు 29న జిల్లా కలెక్టర్‌కు సీపీఐ పార్టీ జిల్లా కమిటీ ఇచ్చిన వినతిపత్రాన్ని నెపంగా చూపి, అధికార టీడీపీ నేతల రాజకీయ ఒత్తిళ్లతో వేలేరుపాడు ఆర్‌ఓ శేఖర్‌ దొర తమ అభ్యర్థులను పోటీ నుంచి అక్రమంగా తొలగించారని మండిపడ్డారు. 30న ఫామ్‌–10 ద్వారా సీపీఐ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ప్రకటించి, నోటీస్‌ బోర్డులోని తమ అభ్యర్థుల పేర్లు, గుర్తులను తొలగించడం అధికారుల అక్రమాలకు అద్దం పడుతోందన్నారు. నిబంధనల ప్రకారం ఒక్కసారి గుర్తులు కేటాయించాక అభ్యర్థులను రద్దు చేసే అధికారం ఆర్‌ఓకు లేదన్నారు. అక్రమాలకు ఒడిగట్టిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అవకాశవాద రాజకీయాలను ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఈ సమావేశంలో గడ్డాల ముత్యాలరావు, మాజీ సర్పంచ్‌ కట్టం రాంబాబు, వైఎస్సార్‌సీపీ నాయకులు కుంజ శ్రీరాములు, మహేశ్వరరావు, రామకృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement