ఏలూరు టౌన్: ఏలూరు నగర ప్రజలు ప్రశాంతమైన జీవనాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని, పరిపూర్ణ ప్రజాభద్రతను కోరుకుంటున్నారని, ఇవే ప్రధాన ఎజెండాగా తాము ఎన్నికల బరిలోకి దిగామని ఏలూరు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు (జీఎంఆర్) స్పష్టం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు, గుంతలు లేని రహదారులు, అవినీతి రహిత పాలన లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల మద్దతుతో నగరపాలక సంస్థపై వైఎస్సార్‌సీపీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో నగర ప్రజల ముందుకు మీరు తీసుకెళ్లిన ప్రధాన అంశాలేమిటి?
జవాబు: ప్రశాంత ఏలూరు నగర నిర్మాణమే మా ముఖ్య ఉద్దేశం. నిరంతరం స్వచ్ఛమైన తాగునీరు అందించడం, గుంతలు లేని రహదారులు నిర్మించడం, ప్రజలు సేదతీరేలా ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించడమే ప్రధాన ఎజెండాగా గడపగడపకూ తిరిగాం. నగర ప్రజల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుత కూటమి పాలనలో రెండున్నరేళ్లలో ఏ ఒక్కరికీ మేలు జరగకపోగా, ప్రజల ఇబ్బందులు మరింత పెరిగాయి.
ప్రశ్న: నగరంలో ప్రజాభద్రత, అసాంఘిక శక్తుల అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
జవాబు: మేము ప్రజాభద్రత, మెరుగైన ప్రజా రవాణాకు తొలి ప్రాధాన్యమిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా గంజాయి సంస్కృతి పెరిగిపోతోంది. నగరంలో దౌర్జన్యాలు, అసాంఘిక శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చర్యలు చేపడతాం. నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రత్యేక మానిటరింగ్ కంట్రోల్ రూమ్‌ను క్రియేట్ చేస్తాం. సమస్యలను వెంటనే గుర్తించి పోలీసులతో పాటు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నిఘా పెంచుతాం.
ప్రశ్న: కార్పొరేషన్‌లో అవినీతి నిర్మూలనకు మీ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటి?
జవాబు: పౌర సేవల కోసం ప్రభుత్వం నిర్దేశించిన అధికారిక రుసుము మాత్రమే తీసుకునేలా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్ విభాగాలను కొందరు అవినీతి కేంద్రాలుగా మార్చి ప్రజలను పీడిస్తున్నారు. ఈ పరిస్థితిని శాశ్వతంగా నిర్మూలిస్తాం. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే తక్షణమే ఫిర్యాదు చేసి తీవ్రమైన చర్యలు తీసుకునేలా పటిష్టమైన ప్రజా ఫిర్యాదుల యంత్రాంగాన్ని సృష్టిస్తాం.
ప్రశ్న: నగరంలో నిరుపయోగంగా ఉన్న కృష్ణా కాలువ ఆధునికీకరణపై మీ ఆలోచన ఏమిటి?
జవాబు: నగరంలో 4 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కృష్ణా కాలువ ప్రస్తుతం మురుగు కాలువలా మారింది. అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో పూడిక తొలగించి ఆధునికీకరిస్తాం. కాలువకు ఇరువైపులా 4 కిలోమీటర్ల మేర ఆహ్లాదకరమైన వాకింగ్ ట్రాక్‌లతో కూడిన పార్కులను నిర్మిస్తాం. నగరంలో ప్రజలు సమయం గడిపేందుకు తగిన కేంద్రాలు లేవు, అందుకే పరిమిత నిధులతోనే నూతన పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తాం.
ప్రశ్న: ప్రజలకు చేరువయ్యేందుకు, యువతను భాగస్వాములను చేసేందుకు ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు?
జవాబు: ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ‘మార్నింగ్ వాక్ విత్ మేయర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తా. స్వయంగా కాలనీల్లో పర్యటించి, ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేస్తా. శ్రీజెన్–జీశ్రీ యువత ఆలోచనలకు పెద్దపీట వేస్తూ నగర అభివృద్ధిలో వారికి క్రియాశీలక భాగస్వామ్యం కల్పిస్తాం.
ప్రశ్న: కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మీ పోరాటం ఎలా ఉండబోతోంది?
జవాబు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, గ్యాస్ బండ సబ్సిడీ వంటి దేనినీ నెరవేర్చలేదు. పెరిగిన నిత్యావసరాల ధరలతో సామాన్యుడు అల్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత ప్రజలతో కలిసి, ఈ హామీలను తక్షణమే అమలు చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్‌సీపీ తరఫున ప్రజాపోరాటాలు నిర్వహిస్తాం.
అవినీతి రహిత పాలనే లక్ష్యం
యంగ్ జనరేషన్ ఆలోచనలకు ప్రాధాన్యం
‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు


