పెదపాడు: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్కాగా నిర్వహించేలా సిబ్బందికి శిక్షణ అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక సీఆర్‌ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం కౌంటింగ్ సూపర్‌వైజర్లు, సి బ్బందికి అవగాహన కల్పించారు. ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ సీల్ తీయడం, ఓట్ల లెక్కింపు, ఓట్ల చెల్లుబాటు పరిశీలన తదితర అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బంది అందరూ మాస్టర్ ట్రైనర్లు అందించే శిక్షణను క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఎక్కడా చిన్న పొరపాటుకు తావివ్వకుండా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ప్రతి అంశాన్ని కౌంటింగ్ ఏజెంట్లు పరిశీలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లు, తర్వాత బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు లెక్కిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్ భద్రత, కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల విషయంలో లోపాలు ఉండకూడదన్నారు. కౌంటింగ్ హాల్స్ టేబుల్స్ ఏర్పాటు తదితర ఏర్పాట్లను ఆమె పరిశీలించారు.
భీమడోలు: తుపాను ప్రభావంతో జిల్లాలో 40 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయాధికారి డాక్టర్ హబీబ్ బాషా అన్నారు. సూరప్పగూడెంలో దెబ్బతిన్న పంటను శుక్రవారం ఏఓ ఎస్‌పీవీ ఉషారాణితో కలిసి ఆయన పరిశీలించారు. జిల్లాలో వ్యవసాయశాఖ సిబ్బంది పంట నష్టం అంచనాలను రూపొందించే పనిలో ఉందన్నారు. రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. పాలు పోసుకునే దశలో ఉన్న పొలాలకు పొడ తెగులు సోకే అవకాశం ఉందని, ప్రోపికోనజోల్ మందును ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేయాలని సూచించారు. అలాగే ఐదు శాతం ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయాలన్నారు. భీమడోలు మండలంలో 12,850 ఎకరాల్లో వరి సాగు చేయగా సుమారు 2 వేల ఎకరాల్లో పంట తీవ్రంగా నష్టపోయిందన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాస్థాయి రోల్‌ప్లే, ఫోక్ డ్యాన్స్ పోటీలు దూబచర్ల డైట్ కాలేజీలో శుక్రవారం నిర్వహించినట్టు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి ఏలూరులో విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రోల్‌ప్లే పోటీల్లో భీమడోలు జెడ్పీ హైస్కూల్, నాగిరెడ్డిగూడెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్, పెదనిండ్రకొలను జెడ్పీ హైస్కూల్ మొదటి మూడు స్థానాల్లో దెందులూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. ఫోక్ డాన్స్ పోటీల్లో పంగిడిగూడెం జెడ్పీ హైస్కూల్, భీమడోలు జెడ్పీ హైస్కూల్, లక్కవరం జెడ్పీ హైస్కూల్ మొదటి మూడు స్థానాల్లో, ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. వీరంతా వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. జిల్లా నోడల్ అధికారి కేఎస్‌వీకే రాజకుమార్ పర్యవేక్షించారు.
ద్వారకాతిరుమల: స్థానిక చెరువు వీధిలో టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరఫున శుక్రవారం సాయంత్రం ఓట్లు అడిగేందుకు వెళ్లిన కూటమి నేతలకు చేదు అనుభవం ఎదురైంది. నెలల తరబడి డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నామని గంగాధరరావు అనే యువకుడు నాయకులను నిలదీశాడు. చెరువు వద్ద మలుపులో రోడ్డు దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రజా సమస్యలను పట్టించుకోని నాయకులు ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఎలా వస్తారని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న నేతలు.. సమస్యల పరిష్కార బాధ్యతను పంచాయతీ కార్యదర్శిపై నెట్టేసి, గంగాధరరావును బుజ్జగించి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.


