కై కలూరు: మనవడిని స్కూటీపై పాఠశాలకు తీసుకెళ్తున్న తాత లారీ చక్రాల కింద పడి మృతి చెందిన దారుణ ఘటన కై కలూరులోని నిమ్మగడ్డ నాగభూషణం ఉన్నత పాఠశాల సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం ఏలూరు రూరల్ మండలం కోమటిలంకకు చెందిన ముంగర దుర్గాప్రసాద్ (60) కై కలూరు మండలం ఆటపాకలో స్థిరపడ్డారు. ఆయన కుమార్తె కుమారుడైన నాలుగేళ్ల మోక్షిత్ పవన్‌ను పాఠశాలలో దింపేందుకు దుర్గాప్రసాద్ స్కూటీపై బయలుదేరారు. పాఠశాల సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో స్కూటీ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో మనవడు ఒకవైపు పడిపోగా, రోడ్డుపై పడిన దుర్గాప్రసాద్ తలపై నుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం అనంతరం డ్రైవర్ లారీని వదిలి పరారయ్యాడు. చిన్నారి మోక్షిత్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కై కలూరు టౌన్ సీఐ ఏవీఎస్ రామకృష్ణ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.
దేవరపల్లి: నల్లజర్ల మండలంలోని దూబచర్ల వద్ద కూలీలతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకు చెందిన శీలం వీర్రాజు, శీలం వెంకటేశ్వరరావు, శీలం ప్రసాద్ శుక్రవారం పనుల నిమిత్తం దూబచర్లకు వచ్చారు. సాయంత్రం తిరిగి వ్యాన్‌పై స్వగ్రామం వెళ్తుండగా, మార్గమధ్యంలో వ్యాన్ టైర్ ఫంక్చర్ కావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికీ తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..


