కన్నతల్లినే కడతేర్చాడు | - | Sakshi
Sakshi News home page

కన్నతల్లినే కడతేర్చాడు

Oct 27 2026 1:02 AM | Updated on Oct 27 2026 1:02 AM

ఏలూరు టౌన్‌: నవమాసాలు మోసి, కని, పెంచి పెద్దచేసిన తల్లిని డబ్బులు ఇవ్వలేదనే కక్షతో కొడుకు హతమార్చాడు. కన్నతల్లిని కర్కశంగా హత్య చేసిన కేసును కేవలం ఒక్కరోజులోనే ఛేదించిన ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు... సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏలూరు శాంతినగర్‌ 14వ రోడ్డుకు చెందిన కొమ్ము సత్యవతి భర్త మరణించడంతో ఒంటరిగా జీవిస్తోంది. స్థానికంగా పలు ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈమె కుమారుడు సురేష్‌ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. తాను చేసిన అప్పులు తీర్చాలంటూ పలుమార్లు తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. అయితే, సత్యవతి కష్టపడి సంపాదిస్తున్న డబ్బును కుమార్తెకి ఇస్తోందని, తనకు ఇవ్వడంలేదనే కక్ష పెంచుకున్నాడు. తాను చేసిన అప్పులు తీర్చాల్సిందేనంటూ తల్లిని నిత్యం వేధిస్తున్న సురేష్‌... ఆదివారం ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా ఉన్న తల్లి వద్దకు వెళ్లి ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చినా ఆమె ఇవ్వకపోవడంతో కోపంతో రగిలిపోయిన సురేష్‌... తల్లి పీకనులిమి, తన వెంట తెచ్చుకున్న టవల్‌తో మెడకు గట్టిగా బిగించి అత్యంత కర్కశంగా హతమార్చాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. సోమవారం సత్యవతి రోజులాగే పనులకు రాకపోవడంతో, ఆమెతోపాటు పనిచేసే సహచర యువకుడు ఇంటికి వెళ్లి చూశాడు. అప్పటికే సత్యవతి ఇంట్లో విగతజీవిగా పడి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఏలూరు త్రీటౌన్‌ సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై రాంబాబు దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నిందితుడిని అరెస్ట్‌ చేసిన త్రీటౌన్‌ పోలీస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement