కామవరపుకోట: గ్యాస్ సిలిండర్ పేలి రేకుల ఇల్లు ధ్వంసమైన ఘటన వీరిశెట్టిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం రేకుల ఇంటిలో పిల్లి లక్ష్మి అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడాన్ని గమనించి వెంటనే అప్రమత్తమై ప్రాణభయంతో బయటకు పరుగులు తీసింది. కొద్ది సేపటికే గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయి ఇల్లు పూర్తిగా ధ్వంసమై, ఇంట్లోని సామగ్రి అగ్నికి ఆహుతైంది. వృద్ధురాలు సమయస్ఫూర్తితో బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితురాలికి వీరిశెట్టిగూడెం వైఎస్సార్ సీపీ నాయకులు అండగా నిలిచారు. వృద్ధురాలికి నిత్యావసర సరుకులతోపాటు రూ.3 వేలు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో వీరిశెట్టిగూడెం వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ అభ్యర్థి భారతాల సుజాత కిషోర్, గుర్రాల రవికుమార్, పెనుమాల సంజీవరావు, గుర్రాల జీవన్ కుమార్, పెనుమాల వేణుబాబు, భారతాల ప్రసాద్ పాల్గొన్నారు.


