సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు అభయారణ్య రక్షణ విషయంలో కేంద్ర సాధికారిత కమిటీ (సీఈసీ) ఘాటైన వ్యాఖ్యలను సంధించింది. అటవీశాఖ అధికారులతో జిల్లా యంత్రాంగం సమన్వయం చేసుకుని అక్రమ చెరువులను తొలగించాలని స్పష్టం చేసింది. ప్రధానంగా కొల్లేరు అభయారణ్యంలో చేపల, రొయ్యల చెరువుల సాగు నిషేధం జీఓ 120 ఉన్నా ఎలా వాటికి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశారనే అంశాన్ని నిగ్గు తేల్చాలంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి గాంచిన ఏలూరు జిల్లా ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు ఎందుకు నీరులేక ఏటా ఎండుతోందని ప్రశ్నించింది. పక్షుల ఆవాసం కోసం నీరు నింపడానికి వచ్చే అడ్డుంకులపై ఆరా తీసింది. దీంతో కొల్లేరు అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
మరోసారి ఫిర్యాదు
కొల్లేరు సరస్సులో ఆక్రమణలు, కర్మాగారాల వ్యర్థాల విడుదల, పర్యావరణ విఘాతంపై కాకినాడకు చెందిన రిటైర్డ్ బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి మృత్యుంజయరావు తాజాగా కొల్లేరులో జరుగుతున్న పరిణామాలపై మరోసారి ఫిర్యాదు చేశారు. అక్రమ చెరువుల సాగుపై సాక్ష్యాలతో వివరించారు. దీంతో కమిటీకి ఆ నివేదిక అందించాలని ఆదేశాలు వచ్చాయి. ఈనెల 15న మంగళగిరిలో జరిగిన సమావేశంలో రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు 10 రోజుల్లో పూర్తి నివేదికలను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) డాక్టర్ పీవీ చలపతిరావు, వైల్డ్ లైఫ్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) డాక్టర్ కె.నాగేశ్వరరావు ఆదేశించారు. గతనెల 29న కొల్లేరు అంశంపై తీర్పు వాయిదా పడిన నేపథ్యంలో పూర్తి నివేదికను త్వరగా సీఈసీకి అందించాలని రెవెన్యూ, ఫారెస్టు అధికారులను పీసీసీఎఫ్ ఆదేశించారు.
కూటమి నేతల మాట చెల్లుబాటవునా..?
ఎన్నికల ముందు కొల్లేరులో పేదలందరికీ భూములు పంపిణీ చేస్తామని నాయకులు వాగ్దానాలు చేశారు. కొల్లేరు కాంటూరు కుదింపు అంశం కుదరదని కేంద్రం తేల్చాడంతో కొల్లేరులో జిరాయితీ, డీ–ఫాం భూములను మినహాయించి పంపిణీ చేస్తామన్నారు. జీఓ 120 ప్రకారం కొల్లేరులో 77,138 ఎకరాలను గుర్తించారు. కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు, ఉండి నియోజకవర్గాల్లో విస్తరించిన కొల్లేరు అభయారణ్యంలో పట్టా భూములు 14,932 ఎకరాలు, డీ ఫాం భూములు 5,510 మొత్తం 20,442 ఎకరాలు ఉన్నాయి. వీటిని మినహాయించాలని ప్రభుత్వం కోరింది. ఇటీవల ఆయా రైతుల నుంచి వివరాలను సైతం సేకరించింది. ఇదంతా ఇలా ఉంటే కొల్లేరు సరస్సులో కాలుష్యం పేరుకుపోతుంటే ఏం చర్యలు తీసుకున్నారని సీఈసీ అడుగుతోంది. ఈ నేపథ్యంలో కొల్లేరు ప్రజలకు తీర్పు అనుకులంగా వస్తుందా? అనే మీమాంసలో కొల్లేరు ప్రజలు ఉన్నారు.
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
అనధికార చెరువులకు విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు?
కొల్లేరులో వ్యర్థాల నియంత్రణకుఏం చర్యలు తీసుకున్నారు?
ఆటపాక పక్షుల కేంద్రం ఎందుకు ఎండిపోతోంది
కేంద్ర సాధికారత కమిటీ (సీఈసీ) ప్రశ్నలు


