కలవరిపాటు | - | Sakshi
Sakshi News home page

కలవరిపాటు

Jul 18 2026 3:29 AM | Updated on Jul 18 2026 3:29 AM

జాగ్రత్తలు తప్పనిసరి

జిల్లాలో ఎన్నడూలేని విధంగా వరి రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులతో మెరక ప్రాంతాలకేగాక డెల్టా ప్రాంతంలో కూడా రైతులు సాగునీటి కష్టాలను చవిచూస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం పోడూరు మండలంలోనే వరి నారుమడులకు నీరందక ట్యాంకర్ల ద్వారా నీరు తెచ్చుకుని నారును కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారంటే జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

భీమవరం: జిల్లాలో 20 మండలాల పరిధిలో 2.25 లక్షల ఎకరాల్లో సార్వా వరినాట్లు వేయాల్సి ఉండగా రైతులంతా దాదాపు నారుమడులు పూర్తి చేశారు. తాడేపల్లిగూడెం, తణుకు, పెంటపాడు, గణపవరం తదితర మండలాల్లో ముమ్మరంగా నాట్లు వేస్తుండగా జిల్లావ్యాప్తంగా సుమారు 55 వేల ఎకరాల్లో నాట్లు పూర్తి చేశారు.

నారుమడి.. రైతులు తడబడి

రైతులు సార్వా వరి పంటపై గంపెడు ఆశతో నాట్లువేయడానికి సన్నద్ధమై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి భూమిను చదును చేయడం, మెట్టదుక్కులు, నారుమడులు వేసుకున్నారు. జూలై పూర్తికావస్తున్నా వరుణుడి జాడ లేకపోవడంతో కేవలం కాలువల నీటిపైనే ఆధారపడ్డారు. అయితే కొన్ని ప్రాంతాల్లోని కాలువ శివారు భూములకు నీరందకపోవడంతో నారుమడులకు సైతం నీరులేక బీటలు వారుతుంటే నాట్లు వేసుకునేందుకు దుక్కు చేయడానికి నీరందని దుస్థితి ఏర్పడింది. దీంతో కొందరు రైతులు ఆయిల్‌ ఇంజిన్ల సాయంతో నారుమడులకు నీరు పెట్టుకోవడం, మరికొన్నిచోట్ల ట్యాంకర్లతో నీరు తెచ్చుకుని నారుమడులు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాలువ శివారు భూములకు నీరంకపోవడంతో పంట దమ్ముచేసుకునే అవకాశం లేకుండా పోయిందని దీంతో వరినారు ముదిరిపోయే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నాట్లు వేసినా మూన తిరగని పరిస్థితి

సాగునీటికి ఇబ్బందులేని ప్రాంతాల్లో 15 రోజుల క్రితమే వరినాట్లు పూర్తిచేసినా నేటికి నాట్లు మూనతిరగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత, వడగాల్పులు కారణంగా వరినాట్లు ఎండిపోతున్నాయని దీంతో తిరిగి మనేదలు వేయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఇప్పటికే పొలం దుక్కు, నారుమడులు, నాట్లు వేయడానిక పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టామని, నాట్లు ఎండిపోవడం వల్ల తిరిగి వేయాలంటే మరింత ఖర్చు తప్పదంటున్నారు. సాగునీరు ఉన్నా వర్షం లేకపోతే పైరు ఏపుగా పెరిగే అవకాశం లేదని దాని వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి చేపడితే సక్రమంగా వర్షాలు కురవనే భయం అందరిలోనే ఉన్నా మరీ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడినందున వరి రైతులు సార్వా సాగులో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. నాట్లు వేసిన పొలాల్లో నీరు లేకుంటే కలుపు ఎక్కువగా వచ్చే అవకాశముంది. తప్పనిసరిగా కలుపు నివారణా చర్యలు చేపట్టాలి. కేవలం కాలువ నీటిపైనే ఆధారపడటం వల్ల చేలల్లో నీరు త్వరితగతిన ఇంకిపోయే ప్రమాదముంది. తరచూ నీరు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఎరువులు వేసుకునే సమయంలో తప్పనిసరిగా భూమి చెమ్మగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

– జెడ్‌.వెంకటేశ్వరరావు,

జిల్లా వ్యవసాయశాఖ అఽధికారి, భీమవరం

వాన.. హైరానా

వర్షాభావంతో రైతుల ఆందోళన

ఎండిపోతున్న నారుమడులు

నీరందక ముందుకు సాగని దుక్కులు

జిల్లాలో 2.25 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఇప్పటివరకు 55 వేల ఎకరాల్లోనే నాట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement