గ్రామ సభలు నిర్వహించాలి
ప్రభుత్వం సర్వేను వెంటనే నిలిపివేయాలి
కుక్కునూరు: మండలంలోని అరవపల్లి రెవెన్యూ పరిధిలో నిర్వాసితుల కోసం సేకరించే భూముల సర్వేను స్థానిక గిరిజన రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. వివరాల ప్రకారం పోలవరం జిల్లా, ముంపు మండలాల్లో ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిధిలో ముంపునకు గురవుతున్న గిరిజన నిర్వాసితులకు భూమికి భూమి పరిహారం అందించేందుకు మండలంలోని అర్వపల్లి రెవెన్యూ పరిధిలో భూములను సేకరించే దిశగా అధికారులు శుక్రవారం సర్వే చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక గిరిజన రైతులు సర్వే జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి తమకు తెలియకుండా ఎలా సర్వే నిర్వహిస్తారు? అని అడ్డుకున్నారు.
తహసీల్దార్‌కు వినతి
సర్వే అడ్డుకున్న అనంతరం కుకునూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌కు సర్వే నిలిపేయాలని కోరుతూ మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక దాచారం, గొమ్ముగూడెం గిరిజన రైతులు మాట్లాడుతూ, తాత ముత్తాతల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది గిరిజనేతరులు గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాదారులుగా వారి పేర్లను మార్పు చేసుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించి పరిహారాన్ని పొందాలని గిరినేతర్లు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఆధీనంలో ఉన్న భూములను కనీస సమాచారం తెలియపరచకుండా పిసా గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్వహిస్తున్న ఈ సర్వేను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దీనిపై గిరిజనులంతా ఏకమై పోరాటం చేస్తామని హెచ్చరించారు.
అధికారులను సర్వే నిలిపేయాలని అడ్డుకుంటున్న గిరిజన రైతులు తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేస్తున్న గిరిజన రైతులు
భూముల సర్వేకు వచ్చిన అధికారులు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయని అందుకే సర్వే చేస్తున్నామని చెబున్నారు. తాత ముత్తాతల తరాల నుండి సాగు చేసుకుంటున్న గిరిజన భూములకు పిసా గ్రామ సభలు నిర్వహించకుండా ప్రభుత్వం సర్వే చేయమని ఎలా ఆర్డర్స్ ఇస్తుంది. ఈ భూములను గిరిజన రైతుల పేర్లపై మార్చాలని మేము గతంలో ఉన్నతాధికారులు కలిసి దరఖాస్తు కూడా అందించాం.
–సోడే వెంకటేష్, పిసా కమిటీ అధ్యక్షుడు, అరవపల్లి, కుక్కునూరు
గిరిజన ఆధీనంలో ఉన్న భూములను గిరిజనులకు తెలియజేయకుండా ప్రభుత్వం గిరినేతర్లకు కట్టబెట్టాలని చూస్తుంది. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సర్వేను నిలిపివేయాలి. గిరిజన రైతులకు న్యాయం చేయాలి. లేకపోతే పెద్దస్థాయిలో ఉద్యమిస్తాం.
– సోడే చంద్రయ్య, గిరిజన రైతు, అరవపల్లి, కుక్కునూరు మండలం


