భీమవరం అర్బన్: మండలంలోని తోకతిప్ప పంట కాలువలోకి కొంతమంది ఆక్వా రైతులు యనమదుర్రు డ్రైయిన్‌లోని మురుగునీరు మోటార్లతో తోడేయడంతో కలుషితమవుతుంది. ఈ పంటకాలువ గొల్లవానితిప్ప, గూట్లపాడు రేవు, తోకతిప్ప, బరువానిపేట గ్రామాలకు సాగు, తాగు నీరు అందుతుంది. ఈ నెల 15 పంట కాలువలకు నీరు నిలుపుదల చేయనున్న నేపథ్యంలో ముందస్తుగా తోకతిప్ప గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువుకు తాగునీటిని నింపాల్సి ఉంది. అంతేకాకుండా ప్రతి ఏటా చేపలు, రొయ్యల చెరువులకు వంతుల వారీ విధానం ద్వారా నీటిని నింపుకుంటున్నారు. తోకతిప్ప– బరువానిపేట గ్రామాల మధ్యలో కొంతమంది రైతులు యనమదుర్రు డ్రెయిన్‌లోని కలుషిత మురుగునీటిని పంట కాలువల్లోకి తోడుకుని అక్కడి నుంచి తమ చెరువుల్లోకి నీటిని మోటార్లతో నింపుకోవడంపై పలువురు గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ చర్యలను అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా పంటకాలువల్లోకి యనమదుర్రు డ్రెయిన్‌లోని మురుగునీటి తోడుతున్నా పట్టించుకోవడం లేదని దీంతో తోకతిప్ప, గూట్లపాడు రేవు వరకు పంట కాలువలోని జలాలు కలుషితమవుతున్నాయని రైతులు వాపోతు న్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల్లోని మురుగునీటిని తోడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


