ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలి రేపు ఉమెన్స్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌కు ఎంపికలు గురుకుల ప్రవేశ పరీక్ష హాల్‌ టికెట్స్‌ విడుదల విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి కూరగాయల రైతును ఢీకొట్టిన వ్యాన్‌

వీరవాసరం: పైలేరియా వ్యాధిగ్రస్తులు డాక్టర్ల సూచనలు, సలహాలను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపాలని డీఎంహెచ్‌ఓ గీతాబాయి తెలిపారు. అండలూరులో శుక్రవారం నిర్వహించిన ఫైలేరియా నివారణ వారోత్సవాల్లో ఆమె పాల్గొని, వ్యాధిపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఫైలేరియాకు సంబంధించిన ఎంఎండీటీ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి వి.క్రాంతి కుమార్‌, కొణితివాడ పీహెచ్‌సీ వైద్యులు యు.నవనీత్‌, ఎంపీహెచ్‌ఓ పి.ప్రభాకర్‌ రావు, ఫైలేరియా యూనిట్‌ ఆఫీసర్‌ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): చిత్తూరులో నిర్వహించనున్న ఉమెన్స్‌ జూనియర్‌ హాకి టోర్నమెంట్‌కు జిల్లా తరపున మహిళా జట్టు ఎంపికలను ఆదివారం నిర్వహించనున్నామని జిల్లా హాకి అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కె.వి.ఎస్‌ భరత్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 16 నుంచి 19 వరకూ రాష్ట్ర హాకీ టోర్నమెంట్‌ ఉంటుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌కు క్రీడాకారిణుల ఎంపిక కోసం పోటీలను భీమవరం సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేశామని వివరించారు. 2007 జనవరి 1 తర్వాత జన్మించిన వారే అర్హులని, ఆసక్తి గల క్రీడాకారిణిలు ఆధార్‌ కార్డు, బర్త్‌ సర్టిఫికెట్‌తో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 90301 06037 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించారు.

దెందులూరు: మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి 5 వ తరగతి ప్రవేశానికి ఈ నెల 12న పరీక్ష నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్స్‌ https://mjpapbcwreis.apcfss.in వెబ్‌సైటులో ఉంచారని సమన్వయకర్త, ఏలూరు బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.భాగ్యలక్ష్మి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షకు హాజరుకావాలని కోరారు.

తణుకు అర్బన్‌ : విద్యుత్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక సజ్జాపురానికి చెందిన సింహం భవానిశంకర్‌ (36) టైల్స్‌ అతికించే వృత్తిలో ఉపాధి పొందుతున్నారు. గురువారం సాయంత్రం ఇరగవరం రోడ్డు కాలనీలోని ఒక భవనంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌ తగిలింది. ఫోకస్‌ లైటుకు సంబంధించిన కనెక్షన్‌ తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ విద్యుత్‌ షాక్‌ తగలడంతో అక్కడే కుప్పకూలాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువచ్చినా అప్పటికే భవాని శంకర్‌ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. భవానిశంకర్‌కు ఇంకా వివాహం కావాల్సి ఉండగా తల్లితో కలిసి సజ్జాపురంలో నివాసం ఉంటున్నారు. సోదరి మాదాసు కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భీమడోలు: జాతీయ రహదారి పొలసానిపల్లి రహదారిపై ఓ కూరగాయల రైతును ఐషర్‌ వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో గుణ్ణంపల్లికి చెందిన రైతు ఎం.రత్తయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్లితే.. ఎం.రత్తయ్య కూరగాయలను ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం జరిగే సంతలో వేసేందుకు తన బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో భీమడోలు నుంచి పొలసానిపల్లి మధ్య రహదారిపైకి వచ్చేసరికి ఎం.రత్తయ్యను వెనుక నుంచి ఐషర్‌ వ్యాన్‌ అతివేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న భీమడోలు 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడు రత్తయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement