
మద్దిలో హనుమద్ హోమం
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్దర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ఈవో ఆర్‌వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో హోమం ప్రతి ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాలను జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షిస్తున్నట్లు ఈవో తెలిపారు.
కై కలూరు: అమ్మా.. కొల్లేటి పెద్దింట్లమ్మా.. మొక్కులు తీర్చుకుంటున్నాం.. మా కోర్కెలు తీర్చమ్మా.. అంటూ భక్తులు అమ్మను ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున విచ్చేశారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి వేడి నైవేద్యాలు, పొంగళ్లను సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రసాదాలు అందించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు ఆలయానికి రూ.76,651 ఆదాయం వచ్చిందని చెప్పారు.
పోలవరం రూరల్: సత్యసాయి మంచినీటి పథకం కార్మికులు గత మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను ఆదివారం రాత్రి విరమించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీని ఆదివారం కలిసి వర్కర్ల సమస్యలను తెలిపారు. జెడ్పీ సీఈవో శ్రీహరి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాథ్‌ల సమక్షంలో యూనియన్ సభ్యులకు హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో జిల్లా పరిషత్ నిధుల నుంచి ఒక నెల జీతం చెల్లిస్తామని, మిగిలిన పెండింగ్ జీతాలు 15 రోజుల్లో చెల్లించేందుకు కృషిచేస్తామన్నారు. వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు జి.శివసత్యనారాయణ, కార్యదర్శి ఆచంట సత్యనారాయణలు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.

మద్దిలో హనుమద్ హోమం