
జీతాలు మహాప్రభో..!
ట్రిపుల్ ఐటీ కాంట్రాక్టు సిబ్బందికి నేటికీ అందని వైనం
నూజివీడు: అధికారంలోకి వస్తే ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తాం.. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఈ నెలలో 19వ తేదీ గడిచినా జీతాలు రాక రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే అరకొర వేతనాలను ఇన్ని రోజులు ఇవ్వకుండా ఉంటే జీవనం ఎలాగని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు బోధనా సిబ్బందికి ఇంతవరకు వేతనాలు లేవు. గతంలో వేతనాలు ఆలస్యమైతే సిబ్బందికి వారి జీతంలో 50 శాతం సొమ్మును అడ్వాన్సుగా చెల్లించేవారు. అలా తీసుకున్న సొమ్మును జీతాలు ఇచ్చేటప్పుడు మినహాయించేవారు. ఇప్పుడు అడ్వాన్సులు కూడా ఇవ్వకపోవడంతో కుటుంబ ఖర్చులకు, ఇతర అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈఎంఐలు చెల్లించేందుకు అప్పులు
కాంట్రాక్టు అధ్యాపకులందరూ ఆర్ధిక వెసులు బాటును బట్టి గృహావసరాల కోసం రుణాలు తీసుకున్నారు. బ్యాంకుల్లో చేసిన అప్పులకు, క్రెడిట్ కార్డులపై తీసుకున్న వాటికి బ్యాంకు ఖాతాలో తప్పనిసరిగా డబ్బులు సిద్ధంగా ఉంచాలి. దీంతో అప్పులు చేసి ఖాతాలో ఉంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈఎంఐలకు సరిపడా నగదు లేకపోతే సిబిల్ స్కోర్ తగ్గిపోతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు కుటుంబం గడవడానికి, పిల్లల ఫీజులు చెల్లించడానికి అనేక అవసరాలకు డబ్బులు అవసరం కాగా అప్పు చేయాల్సి వస్తోంది. సకాలంలో జీతాలు ఇస్తే ఈ తలనొప్పి ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు.
700 మంది కాంట్రాక్టు సిబ్బంది
నాలుగు ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్టు పద్ధతిలో మెంటార్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలు, ల్యాబ్ అసిస్టెంట్‌లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఐటీ మెంటార్లు పనిచేస్తున్నారు. వీరందరూ కలిపి 700కు పైగానే ఉంటారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు యూనివర్శిటీనే నెల ప్రారంభంలోనే వేతనాలను చెల్లించింది. నాలుగు ట్రిపుల్ ఐటీల్లోని కాంట్రాక్టు సిబ్బందికి నెలకు రూ.3 కోట్లు జీతాల కింద చెల్లించాలి. ఇంతవరకు వారికి వేతనాలు చెల్లించలేదు. ఇకనుంచైనా సకాలంలో వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.