టీఎంసీ అంతర్విస్ఫోటనం! | Trinamool rebellion: 20 party MPs plan to form a separate bloc and support NDA | Sakshi
Sakshi News home page

టీఎంసీ అంతర్విస్ఫోటనం!

Jun 9 2026 1:04 AM | Updated on Jun 9 2026 1:04 AM

Trinamool rebellion: 20 party MPs plan to form a separate bloc and support NDA

ఎన్నికల ఫలితాలు వెలువడి పట్టుమని పాతిక రోజులు కాకుండానే తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)కి వీధుల్లో హింసతో మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా ఆగలేదు. తాజాగా ఇండియా కూటమి సమావేశానికి ఆ పార్టీ అధినేత మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చిన సోమవారం నాడే ఆ పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు తిరుగుబాటు జెండా ఎగరేసి, తమదే అసలైన టీఎంసీ అనీ, ఎన్డీయేలో ఉంటామనీ స్పీకర్‌కు లేఖ రాశారు.

వారి సంఖ్య 13 మాత్రమేనని పార్టీ చెబుతోంది. ఇప్పటికే టీఎంసీ శాసనసభా పక్షం చీలి, 58 మంది ఎమ్మెల్యేలు రితబ్రత బెనర్జీ నాయకత్వంలో వేరు కుంపటి పెట్టారు. తమనే ప్రధాన ప్రతి పక్షంగా గుర్తించమని స్పీకర్‌కు లేఖ రాశారు. స్థానిక సంస్థల్లో రాజీనామాలకూ, గోడ దూకుళ్లకూ కొదవే లేదు. ‘స్ట్రీట్‌ ఫైటర్‌’గా పేరున్న మమత ఈ అరాచకాన్ని ఆపడానికి ప్రయత్నించకపోలేదు. కానీ అదేమీ ఫలితమివ్వలేదని తాజా పరిణామాలు చెబు తున్నాయి. 

ఫిరాయింపులనగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ‘వైస్రాయ్‌ ఎపిసోడ్‌’ అందరికీ గుర్తొస్తుంది. కానీ ఆ జాడ్యం ‘వైస్రాయ్‌’ కన్నా చాలా పాతది. 1967లో హరియాణాలో గయాలాల్‌ అనే స్వతంత్ర శాసనసభ్యుడు వారం రోజుల వ్యవధిలో మూడు పార్టీలు మారినప్పుడు ‘ఆయా రాం... గయారాం’ అనే నానుడి మొదలైంది. ఫిరాయింపులకు ఆయన ఆద్యుడు కాకపోవచ్చుగానీ, వాటితో ఆయన పేరు శాశ్వతంగా ముడిపడి పోయింది.

కానీ గత రెండు దశాబ్దాలనుంచి గుంపుగా వెళ్లి అవతలి పార్టీతో అంటకాగే ఉదంతాలు లేదా సొంత పార్టీ పెట్టుకోవడం వంటివి చోటుచేసుకున్నప్పుడల్లా... ప్రభుత్వాలు కుప్ప కూలినప్పుడల్లా ఆ పాత నానుడి పోయి, ‘వైస్రాయ్‌ ఎపిసోడ్‌’ గుర్తుకురావటం మొదలైంది. 1995లో జరిగిన ఆ ఉదంతం వెన్నుపోటుకూ, విద్రోహా నికీ, నయవంచనకూ బండగుర్తుగా మారిపోయింది.

తన మామ స్వర్గీయ ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా జిల్లా పర్యటనలో ఉండగా, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పటి రెవెన్యూ మంత్రి చంద్రబాబు తన విధేయులైన అరడజను మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్‌ హోటల్‌లో పోగేసి, టీడీపీ చీలిపోయిందంటూ బ్రహ్మాండం బద్దలయిన స్థాయిలో అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకుని, ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, బ్లాక్‌మెయిల్‌ చేసి ఆ సంఖ్యను పెంచుకుంటూ పోయారు.

ఆయన మిత్రుడు, నాటి స్పీకర్‌ యనమల రామకృష్ణుడు సరేసరి... సకల వ్యవస్థలూ చంద్రబాబుకు సాగిలపడటంతో ఎన్టీఆర్‌ అధికారాన్ని కోల్పోయారు. కొన్ని నెలల వ్యవధిలోనే మనోవ్యధతో కన్ను మూశారు. ఇప్పటి ‘రెడ్‌బుక్‌’లా ఆ ఉదంతానికి బాబు పేరెట్టినట్టు లేరుగానీ... ఈనాటికీ సకల రాష్ట్రాల ఫిరాయింపుదార్లకూ అదే శిరోధార్యం. 2014లో 23 మంది ఎమ్మెల్యేలను ఖరీదు చేయటం సంగతలా ఉంచి... 2024లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారం నుంచి వైదొలగాక కొందరు ఎంపీలతో పార్టీకీ, పదవికీ రాజీనామాలు చేయించటంద్వారా మళ్లీ ఆయనే ‘నైతికత’ ముసుగులో కొత్త రకం చీడకు గేట్లు తెరిచారు. 

మహారాష్ట్రలో 2022లో ఫిరాయింపులతో శివసేన, ఎన్సీపీలు చతికిలబడి అప్పటి మహావికాస్‌ అఘాదీ(ఎంవీఏ) ప్రభుత్వం కుప్పకూలింది. ఇప్పుడు విపక్షంలో ఉన్నా టీఎంసీకి అదే దుఃస్థితి ఎదురైంది. ఇదంతా మమత స్వీయ తప్పిదాల ఫలితమా... బీజేపీ చూపే ఆకర్షణల వల్లనా అని చర్చించటం వృథా. రెండూ నిజమే కావొచ్చు. కానీ మమత తప్పిదాలుంటే అవి ఇప్పుడే గుర్తుకురావటం, బీజేపీ ఆకర్షణలు చూపితే పార్టీ అధికారం కోల్పోయాకే ఎగబడటం వింత.

గత నెల 4న వెలువడ్డ ఫలితాల్లో 45.92 శాతం ఓట్లతో, 208 సీట్లతో బీజేపీ అధికారంలోకి రాగా... 40.68 శాతం ఓట్లు, 80 సీట్లతో తృణమూల్‌ అధికారం కోల్పోయింది. అంటే ఓట్లపరంగా పెద్ద వ్యత్యాసం లేదు. కానీ టీఎంసీ ఎమ్మె ల్యేలూ, ఎంపీల్లో ఎంత అభద్రతాభావం! ఈ బాపతు ఫిరాయింపుల్ని అలా గోడదూకే వారిలో లోపించిన నైతికతగా మాత్రమే చూడటం సరికాదు. ఈ వికృత ధోరణుల్ని నిలదీసే కాలంపోయి... ఘనకార్యాలుగా, ‘అపర చాణక్యం’గా అభివర్ణించే మీడియా వచ్చింది. ఇతర వ్యవస్థలూ తమకేమీ తెలియనట్టు నటిస్తున్నాయి. అందుకే ఈ గోడ దూకుళ్లు నిర్లజ్జగా సాగిపోతున్నాయి. కనుక పార్టీలు చీలిపోతే... ప్రభుత్వాలు పడిపోతే ‘యూ టూ బ్రూటస్‌’ అనుకుని ఆశ్చర్యపోవటం తప్ప ఎవరూ చేయగలిగింది లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement