
వేలంపాట తరహాలో అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు సుంకాలు పెంచుకుంటూ పోయిన వైనంతో బెంబేలెత్తిన ప్రపంచ మార్కెట్లూ, ఆర్థిక వ్యవస్థలూ నేల చూపులు చూస్తున్న వేళ జెనీవా నుంచి సోమవారం ఒక చల్లని కబురు వినబడింది. ఆర్థికంగా ప్రపంచంలోనే ఒకటి, రెండు స్థానాల్లో ఉన్న ఇరు దేశాలూ ప్రస్తుతానికి వెనక్కి తగ్గాలని నిర్ణయించుకున్నాయన్నదే దాని సారాంశం. ఇది బుధవారం నుంచి అమల్లోకొచ్చి తొంభై రోజులపాటు... అంటే మూణ్ణెల్లపాటు అమల్లో వుంటుందనీ, రెండు దేశాల ప్రతినిధులతో ఏర్పడిన సలహా యంత్రాంగం ద్వైపాక్షిక ఆర్థిక, వాణిజ్య సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుందనీ ఉమ్మడి ప్రకటన వివరిస్తోంది.
ఈ సలహా యంత్రాంగంలో చైనా తరఫున ఆ దేశ ఉపప్రధాని హో లిఫాంగ్ , అమెరికా తరఫున ఆర్థికమంత్రి స్కాట్ బిసెంట్, వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీయర్‌లుంటారు. మూర్ఖత్వంలో ఎవరికెవరూ తీసిపోని ఈ రెండు పక్షాలూ చివరికేం చేస్తాయన్నది ఇంకా చూడాల్సేవున్నా ఇప్పటికైతే ఒక ముప్పు తాత్కాలికంగానైనా ఉపశమించిందని సంతోషించక తప్పదు. మొన్న జనవరిలో అమెరికాలో అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ ప్రపంచాన్ని హడలెత్తిస్తూ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న వరస నిర్ణయాల్లో ఈ సుంకాల పెంపు వ్యవహారం అతి పెద్దది.
గత నెల 2 నుంచి అమల్లోకొచ్చిన ఈ పెంపు చైనా మినహా వేరే దేశాలపై తాత్కాలికంగా ఆపేస్తున్నట్టు ట్రంప్ ఆ వెంటనే ప్రకటించారు. కానీ కోడెల పోట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్టు అమెరికా–చైనా సుంకాల యుద్ధంతో ప్రపంచమంతటికీ సమస్యలు తలెత్తాయి. తాజా ఒప్పందం పర్యవసానంగా అమెరికా విధించిన 145 శాతం సుంకాలు కాస్తా 30 శాతానికి తగ్గుతాయి.
అలాగే అమెరికా దిగుమతులపై చైనా విధించిన 125 శాతం సుంకాలు 10 శాతానికి దిగొస్తాయి. ఈ వారం ఆఖరులోగా తాను చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో చర్చిస్తానని ట్రంప్ చెప్పటం కూడా సంతోషించదగ్గది. చైనాతో సుంకాల విషయమై చర్చలు సాగుతున్నాయని ఆ మధ్య ట్రంప్ పదే పదే ప్రకటించగా చైనా ఖండించింది. చివరకు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో చర్చలు సాకారమయ్యాయి.
చైనాను దెబ్బతీసే ఉద్దేశం తమకు మొదణ్ణించీ లేదని ట్రంప్ ప్రకటించారు. ఇది స్వాగతించ దగ్గదే అయినా బడాయి మాటనే చెప్పాలి. ఎందుకంటే ఆ దేశాన్ని దెబ్బతీయటం సంగతలా వుంచి అమెరికాలోని తయారీరంగ పరిశ్రమలు ముడిసరుకులు దొరక్క ఇబ్బందులుపడుతూ దివాలా దశకు చేరాయి. ఉద్యోగాలకు కోతబెట్టాయి.
వినియోగదారులు సైతం ఉత్పత్తులు అందుబాటులో లేకపోవటంతో పాటు, లభ్యమైన సరుకు ధర ఆకాశాన్నంటడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయి సతమతమవుతుంటే సరుకును రెట్టింపు, అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి రావటం వారిని కుంగదీసింది. చైనాలోనూ పరిస్థితి ఏమంత సజావుగా లేదు. అనేక కంపెనీలు మూతబడ్డాయి. కొన్ని సంస్థలు ఆగ్నేయాసియా దేశాలకు ఎగుమతులపై దృష్టి సారించాయి.
ట్రంప్ అధికారంలోకొస్తూనే దేశంలో యువత ప్రాణాలు తీస్తున్న మత్తు పదార్థం ఫెంటానిల్ విచ్చలవిడిగా దొరకటంలో చైనా పాత్రవుందని ఆరోపిస్తూ ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై 20 శాతం అదనంగా సుంకాలు పెంచారు. గత నెల 2 నుంచి దానికి మరో 34 శాతం జోడించారు. ఇలా తమ నుంచి వెళ్లిన సరుకులపై 54 శాతం సుంకాలు విధించటాన్ని జీర్ణించుకోలేని చైనా దానికి ప్రతీ కారంగా అమెరికా దిగుమతులపై 34 శాతం మేర అదనపు సుంకాలు విధించింది.
ఇక అక్కడి నుంచి ఇద్దరిమధ్యా ‘చంపుడు పందెం’ మొదలైంది. నిజానికి ట్రంప్‌కు ముందు ఫెంటానిల్‌తో చైనాకు లంకె పెట్టినవారెవరూ లేరు. అధ్యక్ష ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలను ఆశించి ఆయన దాన్ని ఎక్కువచేసి చూపారు. మొత్తానికి అమెరికా 145 శాతం, చైనా 125 శాతం సుంకాల దగ్గర ఆగాయి.
ఇప్పుడు కుదిరిన ఒప్పందం పర్యవసానంగా గంపగుత్తగా అన్ని రకాల సరుకులపైనా సుంకాలు తగ్గిపోవు. చైనా సరుకులపై అమెరికా విధించిన 30 శాతం సుంకాలు కొనసాగుతాయి. అలాగే విద్యుత్ వాహనాలు, ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ఇంతకన్నా ఎక్కువగానే సుంకాలున్నాయి. అవన్నీ గత కొన్ని సంవత్సరాల్లో విధించినవి కనుక ఈ ఒప్పందం వాటి జోలికిపోదు.
అవతలిపక్షం నుంచి ఎలాంటి రాయితీలూ పొందకుండా, తమకనుకూలమైన ముగింపు వైపుగా చర్యలేమీ కనబడకుండా ఒప్పందానికి రావటం బలహీనతను సూచిస్తుంది తప్ప బలాన్ని కాదు. ప్రస్తుత ఒప్పందం వ్యూహాత్మకమైనదని చెప్పుకున్నా, మున్ముందు దేశానికేదో ఒరుగుతుందని అంటున్నా... అధిక సుంకాల మోత నుంచి వెనక్కి తగ్గమని ట్రంప్‌పై దేశంలో అన్నివైపుల నుంచీ ఒత్తిళ్లు వచ్చాయన్నది వాస్తవం.
నిరుటి గణాంకాలు గమనిస్తే రెండు దేశాలూ వాణిజ్య పరంగా పరస్పరం ఆధారపడినవేనని తెలుస్తుంది. చైనా ఎగుమతుల్లో అమెరికా వాటా 12.9 శాతం. అలాగే అమెరికా మొత్తం ఎగుమతుల్లో చైనా వాటా 14.8 శాతం. కెనడా, మెక్సికోల తర్వాత స్థానం చైనాదే. అధిక సుంకాల యుద్ధం చివరకు ప్రపంచ ఆర్థికాభివృద్ధిని మందగింపజేస్తుందని, ఉత్పత్తుల కొరతను సృష్టించి ద్రవ్యోల్బణానికి దారితీస్తుందని... ఇదంతా చిట్టచివరకు అమెరికాను మాంద్యం ఊబిలోకి నెడుతుందని నిపుణులు మొదణ్ణించీ హెచ్చరిస్తూనే ఉన్నారు.
సర్వజ్ఞుణ్ణని భావించేవారికి చెప్పటానికి ప్రయత్నించటం వృథా ప్రయాస. ఏదైనా అనుభవంలోకొస్తే తప్ప తత్వం బోధపడదు. మొత్తానికి ఈ చర్చల వల్ల ఇప్పటికైతే అర్థవంతమైన పరిష్కారం లభించలేదు. మున్ముందు ఏమవుతుందన్నది రెండు దేశాల విజ్ఞతకూ పరీక్ష.