దైవంతో జూదమా? | Sakshi Editorial On TTD Tirumala Laddu Issue Andhra Pradesh | Sakshi
Sakshi News home page

దైవంతో జూదమా?

Sep 22 2024 12:07 AM | Updated on Sep 22 2024 12:07 AM

Sakshi Editorial On TTD Tirumala Laddu Issue Andhra Pradesh

జనతంత్రం

శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్ని
అన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. 

కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.

కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. 

తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.

రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్‌ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.

లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. 

మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్‌ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.

తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్‌ జగన్‌ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్‌ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.

ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్‌–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచి ఎల్‌–వన్‌గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. 

టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న ప్లాంట్‌ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్‌కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్‌కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.

టెండర్‌ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్‌ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్‌లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్‌ కృష్ణమూర్తి కూడా ఈ సబ్‌ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.

నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ప్రతి ట్యాంక ర్‌తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్‌ఏబీఎల్‌ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్‌ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్‌ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్‌ తిరుమలకు చేరుకుంటుంది. 

లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్‌ డెయిరీ వారి కంటెయినర్‌ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.

తిరస్కరించిన ఈ ట్యాంకర్‌లోని శాంపిల్‌ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్‌ను జూలై 17న గుజరాత్‌లోని నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23న ఆ ల్యాబ్‌ రిపోర్టు పంపించింది. 

టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్‌ ఫ్యాట్స్‌ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్‌డీడీబీతో పాటే మైసూర్‌లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్స్‌ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.

ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్‌కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్‌డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్‌ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్‌ మీటింగ్‌లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్‌ ఫ్యాట్స్‌ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.

స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్‌కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. 

పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్‌ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్‌ సర్కార్‌ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!

తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్‌ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్‌ఈ సిలబస్‌ రద్దు చేయడం, ఇంగ్లీష్‌ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్‌ బాట పట్టారు. కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.

ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్‌ మేనిఫెస్టోలపై సోషల్‌ మీడి యాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.

వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్‌ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. 

ఈ మీడియా ప్రచారం వల్ల జగన్‌ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా  పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి.  


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement