
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అంత సులభంగా అర్థం కారని ఆయన గల్ఫ్ దేశాల పర్యటన తీరుతెన్నులు చూస్తే తెలుస్తుంది. తాను అధికారంలోకొస్తే పశ్చిమాసియాలో సాగుతున్న ‘అంతూ దరీ లేని యుద్ధాలకు’ ముగింపు పలుకుతానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఆయన తరచు అనే వారు. ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు రోజుల గల్ఫ్ పర్యటనలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చదల్చుకున్నట్టు కనబడుతోంది.
తన రెండో దశ పాలనలో ట్రంప్ మొదలెట్టిన తొలి విస్తృత విదేశీ పర్యటన ఇది. ఈ ప్రాంతంలోనే ఉన్న ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లకపోవటం ఆయన తాజా వైఖరికి సంకేతం. ఇది ఎన్నాళ్లుంటుందన్నది తెలియక పోయినా చేస్తున్న ప్రకటనలైతే భిన్నంగా ఉన్నాయి. ఇరాన్‌తో అమెరికా 46 ఏళ్లుగా సాగిస్తున్న ‘అప్రకటిత యుద్ధం’ ఇక కొనసాగనీయరాదన్న అభిప్రాయం ఉందని మంగళవారం సౌదీ అరే బియాలోని రియాద్‌లో ఆయన ప్రకటించారు. బుధవారం సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్– షారాతో భేటీ అయ్యారు. ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలు నెలకొల్పుకొనాలని సలహా ఇచ్చారు.
అల్–షారాకు గతంలో అల్ కాయిదాతో, ఐఎస్‌తో సంబంధాలుండేవి. ఈ భేటీకి ముందే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ) సదస్సులో సిరియాపై ఆంక్షలు ఎత్తేస్తున్నట్టు తెలియజేశారు. ఈ నిర్ణయాలపై ఇజ్రాయెల్ అలిగినా, మరొకరు అభ్యంతర పెట్టినా ఆయన ఖాతరు చేయదల్చుకున్నట్టు లేరు. గత నెలలో ట్రంప్‌ను కలిసి సిరియాపై ఆంక్షలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ వేడుకున్నారు. ఇరాన్ విషయంలో అయితే చాలా చెప్పివుంటారు. సిరియాపై ఆంక్షలు ఎత్తేయటం, ఇరాన్‌తో చెలిమికి సిద్ధపడటం నెతన్యాహూకు ససేమిరా ఇష్టం లేదు.
కానీ లీకుల ద్వారా తప్ప నేరుగా తన అసమ్మతిని ఇంతవరకూ తెలియజేయలేదు. ఆ మధ్య ట్రంప్ ఇందుకు భిన్నంగా మాట్లాడారు. అణు ఒప్పందాన్ని అంగీకరించి, శాంతికి సిద్ధపడకపోతే ఇరాన్ భారీ స్థాయి ఒత్తిడులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. కానీ ట్రంప్ తాజా ధోరణి అందుకు భిన్నంగా ఉంది. ఇరాన్‌తో చెలిమి గురించి ఆయన ఏదో మాటవరసకు అనలేదు.
‘ప్రస్తుతం అమెరికాకు అత్యంత సన్నిహిత దేశాలు కొన్ని తరాల కిందట మాపై శత్రుత్వంతో చెలరేగినవే’ అని గుర్తుచేశారు. సిరియా, ఇరాన్‌ల విషయంలో తన వైఖరి మారటానికి సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కారణమని ఆయన జీసీసీ వేదికపైనే ప్రకటించారు కూడా. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదార్లు ఇజ్రాయెల్‌పై విరుచుకుపడుతూనే ఉన్నా ఈనెల 5న వారితో అవగాహనకొచ్చారు.
స్నేహంలోనైనా, శత్రుత్వంలోనైనా ట్రంప్ తీరే వేరని ఆయన నిర్ణయాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లనాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సౌదీ వచ్చినప్పుడు దేశంలో మానవహక్కులు అడుగంటుతున్న వైనంపై సౌదీ యువరాజును నేరుగా ప్రశ్నించారు. 2018లో జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి ప్రాణం తీయించడాన్ని ప్రస్తావించారు. ఈ మాదిరి హత్యలు తమకు సమ్మతంకావని చెప్పారు. అందుకే కావొచ్చు... ఇప్పుడు ట్రంప్‌కు ఎదురైన స్వాగతసత్కారాల వంటివి బైడెన్‌కు లభించలేదు.
సౌదీ గడ్డపై గతకాలపు అమెరికా అధ్యక్షుల్ని నిశితంగా విమర్శించటానికి ట్రంప్ వెన కాడలేదు. అమెరికన్ సమాజం గురించి కాస్తయినా తెలియనివారు ఎంతో జటిలమైన గల్ఫ్ సమా జాల్లో జోక్యం చేసుకోవటానికి ఎగబడ్డారని వ్యాఖ్యానించటం చిన్న విషయం కాదు. పశ్చిమాసియా దేశాలతో ఎన్ని వేల కోట్ల డాలర్ల ఒప్పందాలు కుదుర్చుకోగలమన్నదే ఆయన ఆరాటంగా కనబడు తోంది. దానికి తగ్గట్టే మంగళవారం సౌదీతో 14,200 కోట్ల డాలర్ల మేర ఆయుధ ఒప్పందంపై సంతకాలయ్యాయి.
ఇదిగాక అమెరికాలో 60,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు యువరాజు ప్రకటించారు. ట్రంప్ దీంతో సంతృప్తిపడలేదు. దీన్ని లక్ష కోట్ల డాలర్లకు పెంచాలని ఆ వేదికపైనుంచే కోరారు. సౌదీతో అమెరికాకు ఎప్పుడూ మంచి స్నేహసంబంధాలేవున్నా ఈ స్థాయి ఒప్పందాలెప్పుడూ లేవు. ఒక పరిశోధక సంస్థ నివేదిక ప్రకారం 2010–20 మధ్య అమెరికాకు సౌదీతో 10,000 కోట్ల డాలర్ల విలువైన ఆయుధ ఒప్పందాలు మాత్రమే కుదిరాయి.
స్నేహం పేరుతో అమెరికాను దోచుకుంటున్నారని నాటో భాగస్వామ్య దేశాలైన పాశ్చాత్య మిత్రులపై తరచూ విరుచుకుపడే ట్రంప్...పశ్చిమాసియా దేశాలకు ఏ కష్టమొచ్చినా అమెరికా దృఢంగా నిలబడుతుందని హామీ ఇవ్వటం గమనార్హం. ఇంధన అవసరాల్లోనూ, రక్షణరంగంలోనూ పనికొచ్చే అత్యంత విలువైన లిథియం, కోబాల్ట్‌లతోపాటు థోరియం వంటి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అన్వేషించి అమెరికా చేర్చటానికి సౌదీ–అమెరికా ఖనిజ సంస్థల మధ్య ఈ పర్యటనలో 900 కోట్ల డాలర్ల ఒప్పందం కుదరటంతో ట్రంప్ సంతోషానికి పట్టపగ్గాల్లేవు. అందువల్లే పశ్చిమాసియాకు శక్తి మంతమైన సెమీ కండక్టర్ చిప్స్, ఏఐ డేటా సెంటర్లకు పనికొచ్చే కీలక విడిభాగాల ఎగుమతులకు ఆయన పచ్చజెండా ఊపారు. ఇది సంప్రదాయ అమెరికా విదేశాంగ విధానానికి భిన్నం.
ఈ పర్యటనలో ట్రంప్ స్వకార్యమూ నెరవేర్చుకుంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దేశ ప్రయోజనాలకూ, అధ్యక్షుడిగా ఆయన నిర్ణయాలకూ చుక్కెదురన్నది విమర్శకుల వాదన. ట్రంప్ సొంత సంస్థకు సారథ్యం వహిస్తున్న ఆయన కుమారులు గత కొన్నివారాలుగా గల్ఫ్‌లో తిష్ఠ వేసి తమ సంస్థ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనీ, కుదిరిన ఒప్పందాలన్నీ వారికి మేలు కలిగించేవేననీ అంటున్నారు. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి మళ్లీ మారేలోగా పశ్చిమాసియా చక్కబడితే ప్రపంచానికి అంతకన్నా కావాల్సిందేమీ లేదు.