ఇజ్రాయెల్‌ బాధ్యతారాహిత్యం | Israel attacks on Iran without any warning | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌ బాధ్యతారాహిత్యం

Jun 14 2025 3:24 AM | Updated on Jun 14 2025 3:24 AM

Israel attacks on Iran without any warning

గాజాలో నరమేధం కొనసాగిస్తూనే పశ్చిమాసియాలో ఇజ్రాయెల్‌ మరో కుంపటి రాజేసింది. ఎలాంటి కవ్వింపూ లేకుండానే శుక్రవారం ఇరాన్‌పై దాడులకు దిగి రాజధాని తెహ్రాన్‌తో సహా అనేకచోట్ల బాంబుల వర్షం కురిపించింది. 200 యుద్ధ విమానాలు ఏకబిగిన సాగించిన ఈ దాడుల్లో ఇరాన్‌ సైన్యంలో కీలక పాత్ర పోషిస్తున్న సైనిక దళాల చీఫ్, ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కమాండర్, ఇరాన్‌ ఎమర్జెన్సీ కమాండ్‌ చీఫ్‌ల ప్రాణాలు తీయటంతో పాటు అణు కార్యక్రమంలో చురుగ్గా ఉంటున్న ఆరుగురు శాస్త్రవేత్తలను హతమార్చింది. ఇరాన్‌ అణు స్థావరాలను కూడా లక్ష్యం చేసుకున్నట్టు సమాచారం. 

ఆ దేశంపై తమ యుద్ధం ఆగదని కూడా ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రతీకారంగా ఇరాన్‌ వంద డ్రోన్‌లతో సాగించిన దాడి పెద్దగా ఫలించిన వైనం కనబడట్లేదు. అమె రికా అధ్యక్ష ఎన్నికలప్పుడూ, అధికారం స్వీకరించాకా ట్రంప్‌ ఇరాన్‌తో అణు ఒప్పందం గురించి పదేపదే ప్రకటనలు చేశారు. కానీ ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్య చూస్తుంటే ఆ ప్రకటనల్లోని నిజా యతీ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అమెరికా లోపాయకారీ అనుమతి లేకుండా ఆ దేశం ఇలాంటి దాడులకు తెగించే అవకాశం లేదు. 

తాజా దాడుల్ని ఖండించకపోగా ఒప్పందం కోసం వస్తున్న అవకాశాలను ఇరాన్‌ కాలదన్నుకుంటున్నదని, ఇదే కొనసాగితే పరిస్థితి విషమం కావొచ్చని శుక్ర వారం ఆ దేశాన్ని ట్రంప్‌ హెచ్చరించిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. నిజాయతీ ఉంటే అణు ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగా ఈ దాడులేమిటని ఇజ్రాయెల్‌ను నిలదీసి ఉండాలి. చర్చలే అణు ఒప్పందానికి సంబంధించినవైనప్పుడు ఇరాన్‌ అణు శాస్త్రవేత్తల్ని హత్య చేయటం నేరపూరితమని చెప్పివుండాలి. ఆ పని చేయకపోగా ఇజ్రాయెల్‌ దాడుల్లో తమ ప్రమేయం లేదని, కనుక పశ్చిమాసియాలోని అమెరికన్‌ స్థావరాలపై ప్రతీకార దాడులకు దిగొద్దని ఇరాన్‌ను హెచ్చరించింది. 

ఇరాన్‌తో అణు ఒప్పందం గురించి తన దూతల ద్వారా చర్చలు మొదలెట్టాక వాటిని భగ్నం చేసే చర్యకు పాల్పడవద్దని ఆ మధ్య ఇజ్రాయెల్‌కు ట్రంప్‌ సూచించారు. అయితే అమెరికా విధిస్తున్న షరతులు తమకు సమ్మతం కాదని మూడు రోజుల క్రితం ఇరాన్‌ ప్రకటించాక పరిస్థితి మారింది. వాస్తవానికి వచ్చే ఆదివారం అమెరికా–ఇరాన్‌ల మధ్య మరో దఫా చర్చలు జరగాల్సి ఉంది. తాజా దాడుల తర్వాత వాటిని నిలిపివేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. 

అణుబాంబు వైపుగా అడుగులేస్తున్నదని ఇరాన్‌పై ఆరోపణలు చేసేవారు ఏ కవ్వింపూ లేకుండానే ఇజ్రాయెల్‌ దాడులు చేయటాన్ని ఏ రకంగా సమర్థిస్తారు? ఈ దాడులకు 24 గంటల ముందు పశ్చిమాసియా దేశాల్లోని తమ సైనికాధికారుల కుటుంబాలు వెనక్కి వచ్చేయాలంటూ పిలుపునివ్వటం, ఇరాక్‌ నుంచి దౌత్య వేత్తల్ని కూడా వెనుదిరగమని అమెరికా చెప్పటం గమనార్హం. వాస్తవానికి గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్‌కు విమానాలూ, క్షిపణులూ, ఇతర ఆయుధాలు పంపిస్తూ తాజా దాడులకు అమెరికాయే పూర్వరంగాన్ని సిద్ధం చేసిందా అనే అనుమానం కలుగుతోంది.

అసలే ప్రపంచం పలు సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కరోనా మహమ్మారి కాటేయటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తీవ్రంగా దెబ్బతిని ఉన్నాయి. అయిదేళ్లు కావస్తున్నా ఏ దేశమూ పూర్తిగా కోలుకున్న దాఖలా కనబడటం లేదు. అంతక్రితమే 1991లో కువైట్‌పై ఇరాక్‌ సాగించిన యుద్ధం మొదలుకొని ఇరాన్, సౌదీ అరేబియాల మధ్య టర్కీ, సిరియాల మధ్య తీవ్ర ఘర్షణలు సాగాయి. 

ఉగ్రవాదాన్ని అంతమొందించే పేరిట ఇరాక్‌పై అమెరికా, పాశ్చాత్య దేశాలు కొనసాగించిన యుద్ధం, లిబియాలో కల్లోలం సృష్టించి గడాఫీని అంతం చేయటం వంటి పరిణామాల నుంచి పశ్చిమాసియా ఇంకా కోలుకోలేదు. అక్కడ చాలా దేశాల్లో సాయుధ ముఠాలు పరస్పరం తలపడు తున్నాయి. ఇజ్రాయెల్‌–పాలస్తీనా వైరం సరేసరి.

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యా బయట కొచ్చే మార్గం తెలియక కొట్టుమిట్టాడుతోంది. దాన్నుంచి సాయం అందే దారులు మూసుకు పోవటంతో సిరియా అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ మిలిటెంట్ల దాడుల తర్వాత దేశం విడిచి పరార య్యారు. ఇప్పుడక్కడ అమెరికా మద్దతుతో ఒకప్పటి అంతర్జాతీయ ఉగ్రవాది మహమ్మద్‌ అల్‌– షారా దేశాధ్యక్షుడయ్యాడు. సరిగ్గా నెలరోజుల క్రితం గల్ఫ్‌ సహకార మండలి (జీసీసీ) సదస్సుకెళ్లిన ట్రంప్‌ ఆయనపై పొగడ్తల వర్షం కురిపించారు. 

ఇలా పశ్చిమాసియా రకరకాల క్లేశాలతో ఇప్పటికీ నెత్తురోడుతూ ఉండగా దాన్ని మరింత ఊబిలోకి నెట్టేలా తాజా పరిణామాలున్నాయి. ఇరాన్‌పై దాడి జరిగితే తాము మౌనంగా ఉండ బోమని ఆ మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్‌ హెచ్చరించారు. అదే జరిగితే ఇజ్రాయెల్‌ తరఫున అమెరికా నేరుగా రంగంలోకి దిగుతుంది. సారాంశంలో ఇజ్రాయెల్‌ దుందుడుకు చేష్టలు, అమెరికా గుడ్లప్పగించి చూడటం ఒక్క పశ్చిమాసియాను మాత్రమే కాదు... ప్రపంచాన్నే యుద్ధం అంచుల్లోకి నెడుతున్నాయి. 

తాను అధికారంలోకొచ్చాక ఇరాన్‌తో 46 ఏళ్లుగా కొనసాగుతున్న వైరానికి స్వస్తి పలుకుతానని, ప్రపంచంలో ఏ మూలనా అమెరికా సైన్యం ఉండాల్సిన అవసరం లేకుండా చేస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలు ట్రంప్‌ మరిచారా? ఈ యుద్ధం కొనసాగితే తక్షణం హార్మూజ్‌ జలసంధి మూతబడి ప్రపంచ దేశాలకు పోయే 25 శాతం ముడిచమురు, సహజ వాయు రవాణా నిలిచిపోతుంది. 

పర్యవసానంగా అంతంతమాత్రంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలుమరింత కుంగుతాయి. ఇక అమెరికా, రష్యా, చైనాలు నేరుగా దిగితే జరిగే పరిణామాలు ఊహకందని ఉత్పాతాన్ని సృష్టిస్తాయి. అగ్రరాజ్యాలు... ముఖ్యంగా అమెరికా తమ మూర్ఖత్వాన్ని విడనాడి ఇజ్రాయెల్‌ను దారికి తేవాలి. లేనట్టయితే భవిష్యత్తరాలు క్షమించవు.

Advertisement
 
Advertisement
Advertisement