రామోజీ – బాబోజీ అండ్‌ కో...

Eenadu Ramoji Rao TDP Chandrababu Cheated Many People - Sakshi

జనతంత్రం

షాపూర్‌జీ – పల్లోంజీ అనేది దేశంలో ఒక పెద్ద రియల్‌ ఎస్టేట్‌ గ్రూప్‌. ఇలా జంటశ్రీల పేర్లతో జాయింట్‌ వ్యాపార సంస్థలు దేశంలో చాలా ఉన్నాయి. వీటన్నింటిలోకీ అత్యంత సృజనాత్మక మైన గ్రూప్‌ రామోజీ – బాబోజీ గ్రూప్‌! వారు తెలుగువారు కావడం తెలుగు వారందరూ ఫేస్‌ టర్నింగ్‌ ఇచ్చుకోవలసిన విషయం. అందరికీ మల్లేనే వీరికీ విడివిడిగా సంప్రదాయ వ్యాపారాలున్నాయి. పచ్చళ్లూ, పాలు, పెరుగు, పూటకూళ్ల హోటళ్లు, పత్రికలూ వగైరా! వేరువేరుగా ఇన్ని వ్యాపార పీస్‌లున్నప్పటికీ వారు మాత్రం నాట్‌ హ్యాపీస్‌!

బొంబాయి మాఫియా మీద వచ్చిన అన్ని సినిమాల్లోనూ ‘వుడ్‌ బీ డాన్‌’లు కామన్‌గా చెప్పే డైలాగ్‌ ఒకటి ఉంటుంది. ‘నేను బొంబాయిలో బతకడానికి రాలేదు, బొంబాయిని ఏలడానికి వచ్చాన’ని! రామోజీ, బాబోజీ హృదయాల్లో కూడా ఇటువంటి కోరికలే ఆరని అగ్నిజ్వాలలై భగభగ మండుతూ ఉండేవని వారి బయోగ్రఫీని తిరగేస్తే మనకు అర్థమవుతుంది. నువ్వాదరినీ, నేనీదరినీ అన్నట్టుగా వేరువేరు చోట్ల మండుతున్న ఈ రెండు కంచు కాగడాలను విధియాడిన వింత నాటకం ఒక చోటకు చేర్చింది. 

ఇంకేముంది! ప్రళయం రానే వచ్చింది. ఆకాశంలోని పక్షు లన్నీ భయంతో అరుస్తూ రెక్కలు అల్లాడిస్తూ నేలకు రాలి పడ్డాయి. అచ్చం అలాగే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిన్నచిన్న చిట్‌ఫండ్‌ కంపెనీలన్నీ రాలిపడ్డాయి. సూర్యుడు భగభగ మండుతూ అగ్నిగోళంలా దర్శనమిస్తాడు. ఫలితంగా భూమ్మీద ప్రజాస్వామ్యంలో దొంగలు పడ్డారు. చంద్రుడు బాబోజీ అనే అర్భకుడు రామోజీ సహకారంతో వెన్నుపోటు విద్యను ఉపయో గించుకొని దొడ్డిదారిన రాజ్యాధికారం చేపట్టాడు. చరిత్ర ఎరుగని వింతలు – విడ్డూరాలు ఒకదాని వెంట మరొకటి తరుముకుంటూ పరిణమించాయి.

బిజినెస్‌ మ్యాన్‌ బాబోజీ అలియాస్‌ పొలిటికల్‌ చంద్ర బాబుకు సంబంధించిన రాజకీయ ప్రస్థానం తెలుగు ్రçపజలకు చర్వితచర్వణమే. అతనిలోని నివురుగప్పిన బిజినెస్‌ నిప్పును రాజేయగల పెట్టుబడికి స్వయంగా స్థోమత లేదు. రెండెకరాల పేద రైతు కుటుంబం. అందుకని రాజకీయ రూట్‌లో నరుక్కు రావాలని సంకల్పించారు. ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్‌ టిక్కెట్‌ కావాలనే పేరున్న నాయకుడు ఎవరూ మిగల్లేదు. ఏదో ఒక పార్టీ టిక్కెట్‌ పాలి టిక్స్‌కు పాస్‌పోర్టుగా పనికొస్తుందని చంద్రబాబు చంద్రగిరి నుంచి దరఖాస్తు చేసుకున్నారు.

జాక్‌పాట్‌ తగిలినట్లయింది. ఇందిరమ్మ ప్రభంజనం రాష్ట్రాన్ని కమ్మేసింది. అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి అంజయ్యను ప్రసన్నం చేసుకోగలిగారు. మంత్రిపదవి లభించింది. బిజినెస్‌ మ్యాన్‌కు పెట్టుబడి దొరికింది. పెళ్లికాని యువకుడు, తమ సామాజికవర్గం వాడు మంత్రిపదవిలో ఉండడంతో ఎన్టీఆర్‌ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశారు. బిజినెస్‌ మొదలైంది. తొలిమెట్టుగా తిరుపతి పుణ్యక్షేత్రంలోనే సొంత స్నేహితుల్ని మోసం చేసి ఒక హోటల్‌ను సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇటువంటి మోసపు మెట్లనే ఒక్కొ క్కటిగా పేర్చుకుంటూ హెరిటేజ్‌ భవంతిని నిర్మించుకున్నారు.

హెరిటేజ్‌ వ్యవహారంలో బాబు తనను మోసం చేశాడని మోహన్‌బాబు వంటి సెలబ్రిటీయే వాపోయిన సంగతి తెలిసిందే. కాలక్రమంలో చంద్రబాబుకు రామోజీతో ఒక సహకార ఒప్పందం కుదిరింది. ‘నీకిది – నాకది’ అనే సూత్రంపై కుదిరిన సహకార ఒప్పందం ఫలితంగా బాబు ముఖ్యమంత్రి అయ్యారు. రాజకీయం ఆయన బిజినెస్‌గా మారింది. బిజినెస్‌లు బినామీ పేర్లతో ఖండాంతరాల్లో ప్రవర్ధమానమవుతున్నాయన్న వార్తలు వచ్చాయి. 

అడ్డగోలుగా సంపాదించాలనుకునే చాలామందికి రామోజీ కథ చాలా ఉత్తేజభరితమైనది. అనుసరించిన మార్గం ఏదయితే నేమి ఆయనొక వ్యాపార మహాసామ్రాజ్యాన్ని నిర్మించగలిగారని ఈ బ్యాచ్‌వారు కీర్తిస్తుంటారు. ఆరంభంలో చేరదీసిన జేజే రెడ్డి అనే శ్రేయోభిలాషికి రామోజీ శఠగోపం పెట్టారనే ఆరోపణలు వచ్చాయి. ఆ తరువాతనే ఆయన ప్రస్థానం వేగం పుంజు కున్నదట! ‘ఈనాడు’ పత్రిక కోసం విశాఖలో స్థలాన్ని అద్దెకు ఇచ్చిన రాజుగారిని మానసిక హింసకు గురిచేశారు. అదే రాజుగారు హైదరాబాద్‌ స్థలాన్ని కూడా లీజుకిచ్చారు. అక్కడ కూడా ఆయనకు చుక్కల్ని చూపించారట! విజయవాడ స్థలాన్ని చ్చిన సొంత తోడల్లుడు కూడా తర్వాత ఘొల్లుమనడం అందరికీ తెలిసిన విషయమే! ‘ఒకటా రెండా? ఎన్నని చెప్పను మా బాబాయి లీలలు’ అంటూ రామోజీ సోదరుని కుమారుడు చంద్రమౌళి ఏకంగా ఒక పుస్తకాన్నే రచించి జనంలోకి వదిలారు.

మూడు మోసాలు – ఆరు వంచనలతో ఇలా సాగుతున్న రామోజీ వ్యాపార ప్రస్థానం చంద్రబాబుతో కుదిరిన సహకార ఒప్పందం తర్వాత మరో మలుపు తిరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థ మూడు ప్రధానాంగాలపై ఆధారపడి పనిచేస్తుంది. శాసన, కార్యనిర్వాహక, న్యాయ విభాగాలు ఈ ప్రధానాంగాలు. వాటితోపాటు ఆరోగ్యకరమైన మీడియా కూడా ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేస్తుందన్న విశ్వాసంతో దాన్ని ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’గా పిలిచి గౌరవించారు. అధికారంలో ఉన్నప్పుడు శాసన, కార్యనిర్వాహక విభాగాలను వారి వ్యాపార ప్రయోజ నాలకే వాడుకున్నారు. వారి ప్రయోజనాలనే లోకకల్యాణంగా ప్రచారం చేసుకోవడానికి ఫోర్త్‌ ఎస్టేట్‌ మీద వారు సాధించిన ఆధిపత్యం తోడ్పడింది. లిటిగెంట్‌ వ్యూహాలతో, నాట్‌ బిఫోర్, బెంచ్‌ హంటింగ్‌ వంటి ఎత్తుగడలతో అనుకూల తీర్పులు వచ్చేలా చేసుకోవడంలో ప్రావీణ్యం సాధించారు.

ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజల చేతిలో ఉండ వలసిన రాజదండాన్నీ ఈ ముఠా చేజిక్కించుకున్నది. వ్యవస్థల మీద పట్టుతో, మ్యానిపులేషన్లతో సకల వనరుల మీద కూడా వ్యాపార భాగస్వాములు అదుపు సాధించారు. చెరువుల్ని, గుట్టల్ని, రహదారుల్ని యథేచ్ఛగా ఆక్రమించి, చట్టాన్ని చట్టుబండగా మార్చి రామోజీ ఫిలింసిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. చట్టవిరుద్ధంగా వేలకోట్ల రూపాయలు డిపాజిట్లుగా సేకరించి సొంత వ్యాపారాలకు మదుపు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పునాది వేసిన ఐటీ టవర్స్‌ విషయాన్ని మూడేళ్లపాటు తొక్కిపెట్టి తమ బినామీలు, ముఠా సభ్యులతో దానిచుట్టూ రియల్‌ ఎస్టేట్‌ బేరాలు చేసిన అనంతరమే నిర్మాణాన్ని ప్రకటించారు. ఈ వ్యవహారంతో వేల కోట్ల రూపాయల లాభాన్ని వీరి ముఠా కళ్లచూడగలిగింది.

మాదాపూర్‌ ఐటీ ప్రాంతంలో జరిగిన వ్యాపారాన్ని సూక్ష్మరూపంగా భావిస్తే అమరావతి రాజధాని ప్రాంతం విశ్వరూపంగా పేర్కొనవచ్చు. ఈ ముఠా వేల కోట్లలో ఇక్కడ పెట్టుబడి పెట్టి ఉండవచ్చని అంచనాలున్నాయి. లక్షల కోట్లలో లాభాలు పిండుకోవాలని తహతహలాడారు. ఎన్నికల్లో చంద్రబాబు ఓటమితో కథ అడ్డం తిరిగింది. ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌ భిన్నమైన పాలనా విధానాన్ని ఎంచుకోవడం ఈ వ్యాపార ముఠాకు మింగుడు పడలేదు. జగన్‌ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ మార్గాన్ని ఎంచుకున్నది. అధికార యంత్రాంగం ప్రజలకు చేరువగా వెళ్లడం వలన పారదర్శకత పెరుగుతుందనీ, తద్వారా అవినీతికి అవకాశం చిక్కదనీ ఈ ప్రభుత్వ ఆలోచన. దీనికితోడు టెక్నాలజీ వినియోగం ద్వారా ఒక్క పైసా వృథా కాకుండా నేరుగా లబ్ధిదారులకు చేర్చేవిధంగా కార్యక్రమాలను తయారు చేసుకున్నది.

మరోపక్క ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కాలం చేసిన గాయాలను గమనంలోకి తీసుకొని, మరోసారి గాయపడితే మనుగడే ప్రశ్నార్థకమవుతుందన్న నిర్ధారణతో మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇదొక వినూత్న ఆలోచన. విస్తృతస్థాయిలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే ప్రతిపాదన. కానీ బాబోజీ – రామోజీ కంపెనీతోపాటు దాని అనుబంధ కంపెనీ లకూ గుండెల్లో అణుబాంబు పేలినట్లయింది. ఈ ప్రభుత్వాన్ని తక్షణం గద్దె దింపవలసిన అగత్యం ఈ వ్యాపార ముఠాకు ఏర్పడింది. లక్షల కోట్ల కల గాలిలో దీపంలా మారడంతో ప్రభుత్వం మీద ఈ ముఠా యుద్ధాన్ని ప్రకటించింది.

ఉచ్చమూ – నీచమూ అన్న ఇంగితం లేదు. న్యాయమూ – అన్యాయమన్న విచికిత్స లేదు. ధర్మమూ – అధర్మమన్న విచక్షణ లేదు. ప్రభుత్వం మీద బండలేయడమే ఏకైక కర్తవ్యంగా మారింది. ఈ కర్తవ్యంలో భాగమే ప్రతిరోజూ జరుగుతున్న విష ప్రచారం. రామోజీ పత్రిక ఛీనాడులో ప్రతిరోజూ శాపనార్థాలే బ్యానర్లు. ప్రజలకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ముఖ్యమంత్రి స్వయంగా శంకుస్థాపన చేస్తే అది లోపల పేజీ వార్తగా మారింది. ఒక గ్రామంలో రోడ్డు విస్తరణ కోసం ఇళ్ల ప్రహరీ గోడలను కూల్చేస్తే అది ప్రభుత్వ కక్ష అనే బ్యానర్‌ వార్తగా మారింది.

అప్పటికే ఆ వరసలో యాభై ఇళ్ల ప్రహరీ గోడలు కూల్చారనీ, అందుకు ఆ ఇళ్ల యజమానులు సమ్మతించారనే వాస్తవాన్ని మాత్రం ఈ యెల్లో మీడియా విస్మరించింది. అంగీకరించని ముగ్గురు జనసేన కార్యకర్తల ఇళ్ల దగ్గరే ‘కక్ష’ సాధింపు రంగంలోకి వచ్చింది. పత్రికలో బ్యానర్‌ వార్త మాత్రమే సరిపోదని పాలిటిక్స్‌లో జూనియర్‌ ఆర్టిస్టుగా ఉన్న పవన్‌ కల్యాణ్‌ను రంగంలోకి దించారు. ఆయన తన శాయశక్తుల ఓవరాక్టింగ్‌ చేసి వెళ్లారు. అయ్యన్నపాత్రుడు అనే సీనియర్‌ రాజకీయవేత్త అమ్మనాబూతులు మాట్లాడుతుంటే ఛీనాడుకు కమ్మగా తోచింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే, అందుకోసం ఒక రెవెన్యూ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేస్తే అయ్యన్నలో ఛీనాడుకు చిలిపితనం కనిపించింది. చేసింది తప్పు కనుక ప్రభుత్వం అరెస్ట్‌ చేస్తే ఛీనాడుకు కక్షసాధింపుగా కనిపించింది.

వ్యక్తిగత ఫిర్యాదుతో సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర ఒక మహిళ చేతికి గాయం చేసుకున్నది. ఇది ఛీనాడుకు బ్యానర్‌ శీర్షిక ‘నేను వినను, నేను కనను’! అంటే ముఖ్యమంత్రి ప్రజల సమస్యలను అస్సలు పట్టించుకోవడం లేదని దాని భావన. అంతకు ముందురోజే అధికారులతో స్పందన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్పందన కార్యక్రమాన్ని మరింత క్రియాశీలకంగా చేయాలని సూచించారు. ప్రజల వ్యక్తిగత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడం కోసం మరింత మెరుగైన వ్యవస్థను తయారుచేయాలని నిర్దేశించారు. ఈ సంగతిని మాత్రం ఛీనాడు రాయలేదు.

అధికార యంత్రాంగాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు చేర్చడంలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన కృషి యావత్తు భారతదేశ చరిత్రలో సాటిలేనిది. ఒకటో తేదీ తెల్లవారుజామున వెలుగు రేకలు విచ్చుకోకమునుపే పెన్షన్‌ డబ్బులు చేతికందిస్తున్న రెండున్నర లక్షలమంది వలంటీర్ల మోముల్లో అవ్వాతాతలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిరూపాన్ని చూసుకుంటున్నారు. ప్రతి పల్లెలో, ప్రతి వీధిలో సేవకు సిద్ధంగా నిలబడిన సచివాలయాల సిబ్బందిలో ప్రజలకు జగన్‌ ప్రభుత్వం రోజూ కనిపిస్తూనే ఉన్నది. ఉద్యోగులే కాదు, ఎమ్మెల్యేలూ, మంత్రులు సైతం ‘గడప గడపకూ జగన్‌ ప్రభుత్వం’ పేరుతో నిత్యం జనంలోనే తిరుగుతున్నారు. వారంతా జగన్‌ పంపితే వస్తున్నారని ప్రజలకు తెలియదా? ‘ఫ్యామిలీ డాక్టర్‌’ ట్రయల్‌ రన్‌ జరుగుతున్నది. ఎవరికి సుస్తీ చేసినా వారింటికే డాక్టర్‌ రాబోతున్నాడు. ఇక మీదట జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటి ఫ్యామిలీ డాక్టర్‌ కూడా! ఇంతకంటే ప్రజలకు చేరువైన నాయకుడు ఈ దేశంలో ఇంకెవరున్నారో చెప్పమంటే ఏం చెబుతారు? అటువంటి జగన్‌మోహన్‌రెడ్డి ‘నేను వినను – నేను కనను’ అంటున్నాడని శీర్షిక పెడతారా? ఇది సిగ్గులేనితనం కాదా! ఇది బరితెగింపు కాదా? 

ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్యావ్యవస్థ అత్యున్నత ప్రమాణాలనందుకున్నదని కేంద్ర ప్రభుత్వ సంస్థ విడుదల చేసిన పీజీఐ నివేదిక చాటిచెప్పింది. పైగా నాలుగేళ్ల కిందటి ఇదే నివేదికలో రాష్ట్రం అట్టడుగు పొరల్లో ఉంది. రెండేళ్లు కరోనా వెంటాడిన నేపథ్యంలో ఈ పురోగతి ఒక వండర్‌! కానీ ఛీనాడు మాత్రం పాఠశాల విద్య పతనమైందని తెంపరితనంతో కూడిన వంట కథలను వండి వార్చింది. రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ రంగంలో విప్లవాత్మక పరిణామంగా దేశవిదేశాల్లోని వ్యవసాయ రంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. ఛీనాడు, దాని అనుబంధ మీడియా మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం పడ కేసిందని కథలు అల్లుతారు. ఒక విషయం స్పష్టం.

ప్రజల చేతికి అధికారాన్ని ఇచ్చే జగన్‌ ప్రభుత్వ విధానంపై వ్యాపార – రాజకీయ వర్గం యుద్ధం ప్రకటించింది. ప్రజల ప్రయోజనాలకూ, స్వార్థశక్తుల ప్రయోజనాలకూ మధ్యన జరుగుతున్న యుద్ధం ఇది. బాబోజీ – రామోజీ కంపెనీ నేతృ త్వంలో ప్రభుత్వం మీద ప్రత్యక్షంగా, ప్రజల మీద పరోక్షంగా నిత్యం బాంబులు కురిపిస్తున్నారు. విషపూరితమైన రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నారు. యుద్ధం ప్రకటించినవాడు ఎంతటి శక్తిమంతుడైనా, ఎంతటి ధనాఢ్యుడైనా ప్రజలు చైతన్య వంతులైతే తోక ముడవక తప్పదు. అమెరికా మీద వియత్నాం ప్రజల విజయం చాటిచెప్పిన పరమ సత్యమిదే!
ఠ్చిటఛీజ్ఛి  జీ1959ఃజఝ్చజీ .ఛిౌఝ

మోసాల గురూజీ ఛీనాడు రామోజీ!
ఎవరీ రామోజీరావు? ఒక వ్యాపారవేత్త. ఈనాడు సంస్థల అధినేత. ఫిలిం సిటీ ఓనర్‌. సినిమా నిర్మాత. కొంతమందికి గురుపుంగవుడు. అంతేనా?
ఇంకా వుంది. స్వార్థంకోసం సొంత చుట్టాలను కూడా మోసం చేయడానికి వెనుకాడని కపటి. వ్యవస్థలను మేనేజ్‌ చేయగల ప్రావీణ్యంతో బంధువులను కూడా కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ల భూముల్ని కారుచౌకగా కొట్టేసిన తిమింగలం. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలను రచించిన ఘనుడు.

విలువైన భూములపై ఆయన కన్ను పడితే చాలు హస్తగతం చేసుకునేంతవరకూ ఎన్ని కుట్రలైనా చేస్తాడని ఒక సన్నిహిత బంధువు స్వయంగా చెప్పాడు. తన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకునే క్రమంలో వేసిన ప్రతి అడుగులో బంధువుల కన్నీటి మడుగులు, బడుగుల నెత్తుటి జాడలు కనిపిస్తాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిగో మచ్చుకు కొన్ని అడుగులు...

విజయవాడ బెంజ్‌సర్కిల్‌ సమీపంలో ‘ఈనాడు’ కార్యాలయం ఉన్న రెండెకరాల స్థలం రామోజీది కాదు. బంధువు, భాగస్వామి, తోడల్లుడైన ముసునూరు అప్పారావు, వల్లూరి వెంకటేశ్వరరావుల నుంచి రూ. 725 అద్దెతో 33 ఏళ్ళకు లీజు తీసుకున్నది. అక్కడ ‘ఈనాడు’ బిల్డింగ్‌ కట్టిన రామోజీకి స్థలం కాజేయాలనే దుర్బుద్ధి పుట్టింది. లీజు ముగిసిపోతున్న వేళ మరో 33 ఏళ్ళ లీజు కావాలంటూ కోర్టుకెక్కారు. అప్పారావుకు ఆ స్థలం అప్పగించాలని ఆదేశిస్తూ, 2013లో కోర్టు మందలించినా లాభం లేకపోయింది. 2017లో జిల్లా కోర్టు చెప్పినా, మళ్ళీ కోర్టుకెక్కారు. తాత్సారం చేస్తున్నారు. లీజు ముగిసినా ఖాళీ చేయకపోగా, ఇవ్వాల్సిన అద్దెకు అతీగతీ లేదు. 1970 లెక్కల ప్రకారం చూసినా లక్షల్లో అద్దె బాకీ. సొంత బంధువు స్థలానికే శఠగోపం పెట్టాలని రామోజీ మార్కు విశ్వప్రయత్నం సాగుతూనే ఉంది.

వైజాగ్‌లో డాల్ఫిన్‌ హోటల్‌ కథా ఇలాంటిదే. భూ యజమానుల్ని మాయమాటలతో బెదిరించి, కారుచౌకగా స్థలం కొట్టేశారు. మొదట విశాఖలోని అల్లిపురం దగ్గర 1970 ప్రాంతంలో 8210 చ. గజాల స్థలాన్ని 50 ఏళ్ళకు రామోజీ లీజుకు తీసుకున్నారు. స్థల యజమానుల డబ్బు అవసరాన్ని గ్రహించి, వాళ్ళను మభ్యపెట్టారు. లీజు గడువు ఇంకా 16 ఏళ్ళు ఉండగానే దాదాపు రూ. 150 కోట్ల విలువ చేసే ఆ స్థలాన్ని రూ. 2.5 కోట్లకే 2005లో తన పేర ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నారు. ఆ రూ. 2.5 కోట్లను కూడా మన నిరుపేద రామోజీ మూడు వాయిదాల్లో కానీ చెల్లించలేకపోయారట. మరో గమ్మత్తేమిటంటే – డాల్ఫిన్‌ హోటల్స్‌లో రామోజీతో సహా 172 మంది షేర్‌ హోల్డర్లు. రామోజీకి 95 శాతం, అంటే 3.82 లక్షల పైగా షేర్లున్నాయి. కానీ, విశాఖ, విజయవాడ, హైదరాబాద్, ఢిల్లీకి చెందిన మిగిలినవారికి లాభాల్లో కనీస వాటా కూడా చెల్లించడం లేదట.  

ప్రియా పచ్చళ్ళ కంపెనీ నిర్మాణ సమయంలోనూ రామోజీది ఇదే స్టైల్‌. విజయవాడ శివారు కానూరు సమీపంలో సొంత బావ నుంచి 2 ఎకరాల స్థలం లీజుకు తీసుకున్నారు. ఆ స్థలానికి వెనకే మరో 2 ఎకరాల స్థలం ఉంది. దానికి వెళ్ళాలంటే ప్రియా పచ్చళ్ళకిచ్చిన స్థలంలో నుంచే దారి. స్థలంలో నుంచి దారి ఇస్తామని మొదట ఒప్పుకున్న రామోజీ అలవాటుగా నాలుక మడత తిప్పారు. దారి ఇవ్వకుండా సొంతవాళ్ళనే ఇబ్బంది పెట్టారు. ఆ దారిలో వెళ్ళేందుకు ప్రయత్నించిన సొంత బంధువును తన పత్రికా బలంతో రాత్రి అంతా పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు. చివరకు ఆ బంధువు న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తన స్థలానికి తాను వెళ్ళేందుకు దారి చేసుకోవాల్సిన పరిస్థితి తెచ్చారు. 

...ప్రతిచోటా కోర్టు నుంచి చీవాట్లు తిన్నా, తాను లీజుకు తీసుకున్న భూముల్ని సామ దాన భేద దండోపాయాలతో, తన చేతిలోని పచ్చ పత్రిక బలంతో కాజెయ్యడమే రామోజీ మార్కు నీతి, నిజాయతీ. ఈనాడు, మార్గదర్శి, ప్రియా... ఇలా ఆయన స్థాపించిన సామ్రాజ్యాల్లో చాలా భాగం లీజు భూముల లీగల్‌ కబ్జా లీలలే. న్యాయవ్యవస్థలోని కొందరు వ్యక్తుల సహకారంతో ప్రతి విషయంలో తప్పుడు మార్గాల్ని అన్వేషించే రామోజీ తన పత్రికలో ఇతరుల భూకబ్జాల గురించి రాస్తారు. గురివింద గింజనే గుర్తుకుతెస్తారు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top