నైరుతి రుతుపవనాలు ప్రవేశించింది మొదలు.. ఎల్‌నినో ధాటికి తల వంచిన
వరుణుడు దాదాపు ముఖం చాటేశాడు. మూడున్నర నెలలుగా కరువుతీరా వాన కురిసిందే లేదు. అటువంటిది.. ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తోడుగా.. వరుణ దేవుడు కొత్త శక్తిని పుంజుకున్నట్టున్నాడు. ఇన్నాళ్లుగా కురిపించని వానను ఒక్కసారిగా కుండపోతగా కుమ్మరిస్తున్నాడు. ఆకాశానికి చిల్లు పడినట్టు.. మంగళవారం సాయంత్రం నుంచి ఒక్క క్షణం కూడా తెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది.
● ఆకాశానికి చిల్లు పడినట్టు
ఏకధాటిగా వర్షం
● వాయుగుండం ప్రభావంతో
రెండు రోజులుగా తెరిపివ్వని వాన
● పొంగి పొర్లుతున్న వాగులు
● ఏరుల్లా మారిన రహదారులు
● లోతట్టు ప్రాంతాలు జలమయం
● జనజీవనం అస్తవ్యస్తం
● నీట మునిగిన పంట చేలు
● జిల్లావ్యాప్తంగా
121 మిల్లీమీటర్ల వర్షపాతం
కంట్రోల్ రూముల ఏర్పాటు
అధిక వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లాలోని రెవెన్యూ డివిజన్, మండల స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములను 24 గంటలూ అందుబాటులో ఉంచాలని గురువారం ఒక ప్రకటనలో ఆమె స్పష్టం చేశారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల ఫోన్ నంబర్లు...
కలెక్టరేట్ 0883–2944455
రాజమహేంద్రవరం ఆర్‌డీఓ 0883–2442344
రాజమహేంద్రవరం నగరం 63030 24240
రాజమహేంద్రవరం గ్రామీణం 99660 58666
కడియం 94908 84561
రాజానగరం 90301 02674
సీతానగరం 70323 10130
కోరుకొండ 91544 74851
అనపర్తి 94413 86920
బిక్కవోలు 77020 66689
గోకవరం 94913 85060
మండపేట 99896 26869
కపిలేశ్వరపురం 88552 25457
రాయవరం 96180 06344
కొవ్వూరు ఆర్‌డీఓ 08813–231488
కొవ్వూరు 94910 41468
చాగల్లు 94412 93856
తాళ్లపూడి 94910 41469
దేవరపల్లి 94910 41478
గోపాలపురం 94910 41484
నల్లజర్ల 94910 41451
నిడదవోలు 94910 41470
పెరవలి 94910 41473
ఉండ్రాజవరం 94910 41474
సాక్షి, రాజమహేంద్రవరం: తీవ్ర వాయుగుండం ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా దంచి కొడుతున్న వర్షాలతో జిల్లా తడిసి ముద్దయ్యింది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ వాన నీరు ఏరుల్లా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పంట చేలు ముంపునకు గురయ్యాయి. తెరిపివ్వకుండా వర్షం కురుస్తూండటంతో ప్రజలు నిత్యావసరాలకు సైతం బయటకు రావడానికి వెనుకంజ వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో రహదారులపై వాన నీరు ఏరులా ప్రవహించడంతో ద్విచక్ర వాహన చోదకులు నానా అవస్థలూ పడ్డారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చారిత్రక నగరం రాజమహేంద్రవరం జలమయమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు చేరింది. కాలువలు, డ్రెయిన్లు రోడ్ల పైకి పొంగి ప్రవహించడంతో ప్రజలు అనేక అగచాట్లు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కంబాల చెరువు హైటెక్ బస్టాండ్ ప్రాంతం, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో పరవళ్లు తొక్కుతూ ప్రవహించిన వాన నీటితో రహదారులు గోదారిని తలపించాయి. ఆర్యాపురం, వీరభద్రపురం, సీతంపేట, కోటిలింగాలపేట తదితర లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అభివృద్ధి పనుల పేరుతో నగరంలోని రోడ్లను అధికారులు ఇరువైపులా తవ్వేసి, ఆ గోతులను సరిగ్గా పూడ్చకపోవడంతో అవి బురదమయమై, ప్రజలు నరకయాతన అనుభవించారు. వరుణుడు తెరిపివ్వకపోవడంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు.
రాజమహేంద్రవరం రూరల్ రాజవోలులో రెండు చెరువులు పొంగి పొర్లడంతో పంటచేలు ముంపు బారిన పడుతున్నాయి. నగర పాలక సంస్థ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు, శ్యామలా సెంటర్ ప్రాంతాలు మూడు రోజులుగా ముంపులోనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు రోజూ మాదిరిగా ధవళేశ్వరం వైపు కాకుండా మోరంపూడి జాతీయ రహదారిపై నుంచి వేమగిరికి వెళ్తున్నాయి.
కడియం మండలం వేమగిరి, దేవి జనార్దన్ నగర్, కోకాకోలా ఫ్యాక్టరీ వెనుక వైపు ఉన్న రోడ్లన్నీ నీట మునగడంతో జనం రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది.
అనపర్తి మండలంలో దుప్పలపూడి గ్రామం నీట మునిగింది. పలు ఎస్సీ, బీసీ కాలనీల్లోని పేదల ఇళ్లల్లోకి మోకాలి లోతుకు పైగా నీరు చేరింది. మధ్యాహ్నం నుంచి వరద నీరు ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు వంట వండుకోవడానికి కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాత ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయోనని ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణం స్పందించి, పునరావాసం కల్పించి ఆహారం, ఇతర సహాయక చర్యలు అందించాలని కోరుతున్నారు. అనపర్తి ఎర్ర కాలువ వంతెన వద్ద భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
ఎగువనున్న రాజానగరం నియోజకవర్గం ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతూండటంతో మండపేట మండలం కేశవరంలోని పోతురాజు చెరువు పొంగి పొర్లుతోంది. 130 ఎకరాల విస్తీర్ణంగల ఈ చెరువు నిండిపోయి కాజ్‌వేపై నుంచి నీరు ప్రవహిస్తూండటంతో కేశవరం – రాజమహేంద్రవరం రహదారి నీట మునిగింది. ఈ రహదారి నుంచి ప్రవహిస్తున్న నీరు ధవళేశ్వరం – సామర్లకోట కాలువలో కలుస్తుంది. మండపేట పట్టణంతో పాటు మండపేట రూరల్, రాయవరం, కపిలేశ్వరపురం మండలాల్లోని పలు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు కూడా ముంపుబారిన పడ్డాయి.
రాయవరం మండలంలో తుల్యభాగ, టేకి వంటి మేజర్ డ్రైన్లతో పాటుగా కాలేరు, అనపాలమ్మ, చెల్లూరు తదితర మైనర్ డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే పల్లపు ప్రాంతాలు, డ్రైన్ల వెంబడి ఉన్న పంట పొలాలు పూర్తిగా నీట మునిగే అవకాశం ఉంది.
పెదపూడి మండలంలో 14 విద్యుత్ స్తంభాలు, 10 చెట్లు కూలిపోయాయి. పిడుగులు పడటంతో మూడు, స్తంభాలు, కాలువలోకి జారిపోవడంతో రెండు ట్రాన్స్‌ఫార్మర్లు పాడయ్యాయి. పశ్చిమ ఏలేరు కాలువ ఉధృతి పెరిగింది.
సీతానగరం శెట్టిబలిజపేట, పురుషోత్తపట్నం కొత్త కాలనీ, ఇనుగంటివారిపేటలోని ఎస్సీ పేటతో పాటు కూనవరంలో లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి.
నిడదవోలు మండలంలో ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో కంసాలిపాలెం – మాధవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తాళ్లపాలెం రైల్వే అండర్ పాస్ వద్ద నీరు నిలిచిపోవడంతో నిడదవోలు – తాడేపల్లిగూడెం మధ్య రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మరాజుపాలెంలో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. ఇక్కడి కోటసత్తెమ్మ ఆలయ ప్రాంగణంలోకి వాన నీరు చేరడంతో దర్శనాలను నిలిపివేశారు.
తాళ్లపూడి మండలం కొవ్వాడ కాలువ ఉధృతంగా ప్రవహిస్తూండటంతో పోచవరం పరిధిలోని రాగోలపల్లి నుంచి తాడిపూడి, గూటాల వెళ్లే రోడ్డుతో పాటు, అన్నదేవరపేట నుంచి వేగేశ్వరపురం, వెంకటాయపాలెం వెళ్లే రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది
పెరవలి మండలంలో 450 ఎకరాల్లో వరి చేలు ముంపునకు గురయ్యాయి. 150 ఎకరాల్లో ఉద్యాన పంటలు, కూరగాయల పంటలు కూడా ముంపు బారిన పడ్డాయి.


