కంబాలచెరువు (రాజమహేంద్రవరం): భారీ వర్షాల కారణంగా అన్ని పాఠశాలలకూ శుక్రవారం కూడా సెలవు ప్రకటించారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు.
గోదావరికి వరద పోటు
ధవళేశ్వరం: పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి బుధవారం 85,019 క్యూసెక్కుల మిగులు జలాలను మాత్రమే సముద్రంలోకి విడిచిపెట్టగా.. గురువారం అది 2,40,464 క్యూసెక్కులకు పెరిగింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం గోదావరి నీటిమట్టం 16.80 అడుగులుగా నమో దైంది. గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ధవళేశ్వరం వద్ద ఇరిగేషన్ యంత్రాంగం అప్రమత్తమైంది.
8, 9 తేదీల్లో అంతరిక్ష
అవగాహన కార్యక్రమాలు
రాజమహేంద్రవరం సిటీ: ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆధ్వర్యాన వచ్చే నెల 8, 9 తేదీల్లో నగరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాను ఆయన చాంబర్‌లో ఇస్రో సివిల్ డివిజన్ హెడ్ వి.లక్ష్మణ సతీష్, సీనియర్ శాస్త్రవేత్త కె.అశ్విని గురువారం కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఇస్రో ప్రయోగాల రాకెట్ నమూనాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. ఆరో తరగతి నుంచి డిగ్రీ వరకూ విద్యార్థులకు క్విజ్, డ్రాయింగ్, స్పాట్ క్విజ్, స్పాట్ ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తారని వివరించారు. ఈ కార్యక్రమాలకు సంబంధించిన టీజర్‌ను కమిషనర్ ఆవిష్కరించారు.
పట్టుదలతో చదివి,
ఉన్నత లక్ష్యాలు సాధించాలి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): పట్టుదలతో చదివి, ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యాన స్పాన్సర్‌షిప్, పీఎం కేర్స్ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న పిల్లలు, వారి సంరక్షకులతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ముఖాముఖిలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక దశలో కష్టాలు, ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయని, చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోవడం వంటి పరిస్థితులను ధైర్యంగా అధిగమించాలని సూచించారు. మొత్తం 660 మంది పీఎం కేర్స్, స్పాన్సర్‌షిప్ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని జిల్లా బాలల పరిరక్షణ విభాగం సీడీపీఓ శ్రీదేవి తెలిపారు.
2 ఇసుక ర్యాంపులకు అనుమతి
పెరవలి: మండలంలోని తీపర్రు వద్ద వశిష్ట గోదావరిలో రెండు ఓపెన్ ఇసుక ర్యాంపుల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కొవ్వూరు ఆర్‌డీఓ కె.ఆనందరావు తెలిపారు. తీపర్రు సచివాలయలంలో గురువారం నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. ఒక ర్యాంపులో 8.888 హెక్టార్లు, మరో ర్యాంపులో 16.286 హెక్టార్లలో తవ్వకాలకు పర్యావరణ అనుమతులు వచ్చాయన్నారు. గ్రామానికి దూరంగా ర్యాంపులు ఏర్పాటు చేసి, నిబంధనలకు అనుగుణంగా తవ్వకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
4 మద్యం షాపులకు
దరఖాస్తుల ఆహ్వానం
రాజమహేంద్రవరం రూరల్: బిక్కవోలు, కడియం, కొవ్వూరు, మండపేట రూరల్ మండలాల్లో 2026–27 సంవత్సరానికి గాను ఒక్కో మద్యం షాపు లైసెన్సు మంజూరుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్, ఎౖక్సై జ్ అధికారి వై.శ్రీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు రుసుం రూ.3 లక్షలు(తిరిగి చెల్లించరు), ప్రాసెసింగ్ ఫీజు రూ.1,000 చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వచ్చే నెల ఒకటో తేదీ రాత్రి 12 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీలత పేర్కొన్నారు.


