సాక్షి, రాజమహేంద్రవరం: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ పాలనకు తెర పడింది. సుదీర్ఘ చరిత్రకు తెర దించుతూ కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉమ్మడి ‘తూర్పు’లోని 12, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 9 కలిపి మొత్తం 21 మండలాలతో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఇకపై ప్రత్యేకంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పరిపాలనా ఏర్పాట్లు పూర్తి కావడంతో శుక్రవారం నుంచి సిబ్బంది కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. సంక్షేమ పథకాల పర్యవేక్షణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన జిల్లా పరిషత్ పరిపాలన ఇకపై కొత్త జిల్లా ప్రాతిపదికనే సాగనుంది.
తాత్కాలికంగా రూరల్
ఎంపీడీఓ కార్యాలయంలో..
కొత్త జెడ్పీకి శాశ్వత కార్యాలయ భవనం ఇంకా సిద్ధం కాలేదు. ప్రస్తుతానికి హుకుంపేటలోని రాజమహేంద్రవరం రూరల్ ఎంపీడీఓ కార్యాలయాన్ని తాత్కాలిక కార్యాలయంగా కేటాయించారు. అక్కడి నుంచే జెడ్పీకి సంబంధించిన పరిపాలనా కార్యకలాపాలను సిబ్బంది నిర్వహిస్తారు. అవసరమైన ఫర్నిచర్, రికార్డులు, కార్యాలయ సామగ్రి తదితర ఏర్పాట్లు కూడా చేపట్టనున్నారు. కొత్త జెడ్పీ ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బంది విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఉమ్మడి జెడ్పీ పరిధిలో పని చేస్తున్న సిబ్బందిని కొత్త జిల్లాల వారీగా విభజించి విధులు కేటాయించారు. దీంతో, కొత్త కార్యాలయంలో ఎవరు ఏ బాధ్యతలు నిర్వహించాలనే దానిపై స్పష్టత వచ్చింది. ఉమ్మడి జెడ్పీ సీఈఓగా ఉన్న లక్ష్మణ్ ఇక్కడ ఆ బాధ్యతలు నిర్వహిస్తారు. తూర్పు గోదావరి జెడ్పీకి ఇద్దరు పరిపాలనా అధికారులు, ఐదుగురు సీనియర్ అసిస్టెంట్లు, ఎనిమిది మంది జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు టైపిస్టులు, ముగ్గురు ఆఫీస్ సబార్డినేట్లను కేటాయించారు. అలాగే, డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్లు, క్లాస్–4 సిబ్బందిని కూడా నియమించారు. అయితే, యూడీ స్టెనో, ఎల్‌డీ స్టెనో, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
కలెక్టరేట్ సమీపాన కొత్త భవనం
తాత్కాలిక కార్యాలయంతో కార్యకలాపాలు ప్రారంభమైనప్పటికీ, భవిష్యత్తులో జెడ్పీకి శాశ్వత భవనం నిర్మించనున్నారు. బొమ్మూరులోని కలెక్టరేట్ సమీపంలో కొత్త జెడ్పీ కార్యాలయ భవనం నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్థలం, నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జిల్లాల పునర్విభజన తర్వాత పరిపాలనా వ్యవస్థను కొత్త జిల్లాల అవసరాలకు అనుగుణంగా మార్చే క్రమంలో.. జెడ్పీ విభజన కీలకమైన అడుగుగా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాగా కొనసాగిన కార్యకలాపాలు ఇకపై తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రత్యేకంగా సాగనున్నాయి.
తెరమరుగైన ఉమ్మడి జిల్లా పరిషత్
21 మండలాలతో తూర్పు గోదావరి జెడ్పీ ఏర్పాటు
నేటి నుంచి కార్యకలాపాలు
ఇప్పటికే ఉద్యోగులు,
సిబ్బంది విభజన పూర్తి


