నేడు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సెలవు | - | Sakshi
Sakshi News home page

నేడు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సెలవు

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

రాజమహేంద్రవరం సిటీ: వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు గురువారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్‌ కీర్తి చేకూరి తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు వెళ్లవద్దని, జిల్లా యంత్రాంగం చేసే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ బదులు ప్రస్తుతం తాత్కాలికంగా 91771 43999 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు. భారీ వర్షాలు, వరదలు, ఇతర అత్యవసర పరిస్థితులకు సంబంధించి కాల్‌ చేయాలని కోరారు.

రోడ్డు ప్రమాదాల

నివారణకు పటిష్ట చర్యలు

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో పాటు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ప్రమాదాల నివారణ, లైటింగ్‌ ఏర్పాట్లు, బ్లాక్‌ స్పాట్లలో చేపట్టిన పనులు తదితర అంశాలపై సమీక్షించారు. రహదారి ప్రమాదాలు, పోలీస్‌ స్టేషన్ల వారీగా నమోదైన కేసులు, రహదారి భద్రత చర్యలు, ఐరాడ్‌ దరఖాస్తులో ప్రమాదాల వివరాల నమోదు, హిట్‌ అండ్‌ రన్‌ కేసులు, బ్లాక్‌ స్పాట్లను అధికారులు ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు.

జిల్లాలో 31 బ్లాక్‌ స్పాట్లు

కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో 31 బ్లాక్‌ స్పాట్లు, 12 అధిక ప్రమాద ప్రాంతాలను గుర్తించామన్నారు. అక్కడ ప్రమాదాలకు దారి తీస్తున్న కారణాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించి, అవసరమైన భద్రతా చర్యలను తక్షణమే చేపట్టాలన్నారు. ఏడీబీ రోడ్డు జంక్షన్‌లో రాత్రి వేళ తగినంత వెలుతురు లేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ తక్షణమే తాత్కాలిక లైటింగ్‌ ఏర్పాటు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. గామన్‌ బ్రిడ్జి నుంచి కేశవరం, జీరో పాయింట్‌ వరకు ఉన్న బ్లాక్‌ స్పాట్లలో లైటింగ్‌, రహదారి గుర్తుల ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని సూచించారు. లాలాచెరువు, బొమ్మూరు, వేమగిరి వంటి కీలక ప్రాంతాల్లో లైటింగ్‌ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్‌ మాట్లాడుతూ జాతీయ రహదారులపై బొమ్మూరు, రాజానగరం, దేవరపల్లి, కడి యం, నల్లజర్ల, రంగంపేట మండలాల పరిధిలో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. లైటింగ్‌ లోపం, సూచిక బోర్డుల కొరత, అప్రోచ్‌ రోడ్ల వద్ద వేగ నియంత్రణ ఏర్పాట్లు లేకపోవడం, హెల్మెట్‌ వినియోగించకపోవడం వంటి అంశా లు ప్రమాదాలకు కారణమవుతున్నాయన్నారు.

గోదావరి పుష్కరాల

ప్రత్యేకాధికారిగా గంగాధర్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక అధికారిగా సీఐడీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రెడ్డి గంగాధర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ సమర్పించిన నివేదికను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నియామకాన్ని చేపట్టింది. పుష్కరాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను ప్రత్యేక అధికారిగా రెడ్డి గంగాధర్‌ పర్యవేక్షించి, సమన్వయం చేసి, నిరంతరం పర్యవేక్షించనున్నారు. పుష్కరాలు సురక్షితంగా, సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కల్పించాల్సి ఉంటుంది. భద్రతా ఏర్పాట్లు, జనసమూహ నియంత్రణ, సీసీ కెమెరాల నిఘా, అత్యవసర సేవలు తదితర అంశాలపై సంబంధిత శాఖలు, పోలీసు అధికారులతో ప్రత్యేక అధికారి సమన్వయం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

సీఆర్పీఎఫ్‌ సిబ్బంది రక్తదానం

వై.రామవరం: స్థానిక సీహెచ్‌సీలో బుధవారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో స్థానిక పోలీసుస్టేషన్‌లో ఉన్న సీఆర్పీఎఫ్‌ జీ42 బెటాలియన్‌ అదనపు బలగాలు 16 మంది సిబ్బంది రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. రక్తదాతలకు పాలు, పండ్లు అందించి, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వాడ్కర్‌, ఎస్సై ఏసుపాదం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement