కొంచెం ఇష్టం.. ఎంతో కష్టం | - | Sakshi
Sakshi News home page

కొంచెం ఇష్టం.. ఎంతో కష్టం

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

సాక్షి, రాజమహేంద్రవరం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇన్నాళ్లూ ఎండ వేడిమితో ఉక్కిరిబిక్కిరైన ప్రజలకు ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి. పంట పొలాలకు సైతం వర్షపు నీరు ఊపిరి పోసినట్లయింది. అయితే ఒక్కసారిగా కురిసిన వర్షాలతోనే వర్షాభావ పరిస్థితులు పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదని రైతులు పేర్కొంటున్నా రు. అలాగే వర్షం కారణంగా రాజమహేంద్రవరంతో పాటు పలు ప్రాంతాల జలమయ మయ్యాయి. రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

రోడ్లు జలమయం

రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యాన్ని వర్షం ఎత్తి చూపింది. కొద్దిపాటి వర్షానికే పలు ప్రాంతాలు జలమయం కావడం, డ్రెనేజీ నీరు రోడ్లపైకి రావడం, తవ్వేసి సరిగా పూడ్చని రోడ్లు బురదమయంగా మారడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 49 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. గోపాలపురం, నల్లజర్ల, దేవరాపల్లి, అనపర్తి, సీతానగరం, కడియం, చాగల్లు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌, రంగంపేటలో 50 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. తాళ్లపూడి, గోకవరం, కొవ్వూరు, బిక్కవోలులో మోస్తారు వర్షాలు కురిశాయి.

నగర వాసులకు నరక యాతనే

వర్షం కురిస్తే రాజమహేంద్రవరం నగరవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. అభివృద్ధి పనుల పేరుతో రోడ్లకు ఇరువైపులా తవ్వకాలు చేపట్టి, పనులు పూర్తయిన తర్వాత సక్రమంగా మట్టితో పూడ్చకపోవడంతో పలుచోట్ల వర్షపు నీరు నిలిచిపోయింది. రోడ్లపై గుంతలు, బురదతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే తవ్వకాల కారణంగా ఇరుకుగా మారిన రహదారులు వర్షంతో మరింత ప్రమాదకరంగా మారాయి. గుంతలు నీటితో నిండిపోవడంతో అవి ఎక్కడున్నాయో వాహనదారులకు కనిపించని పరిస్థితి నెలకొంది. ద్విచక్రవాహనదారులు జారిపడిపోతుండగా... పాదచారులు కూడా రోడ్లపై నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

● ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులో తవ్వేసి సరిగ్గా పూడ్చని గుంతలో బుధవారం ఉదయమే ఓ కారు దిగబడిపోయింది.

● నారాయణపురం వాటర్‌ ట్యాంక్‌ నుంచి సెంట్రల్‌ జైలు, వై జంక్షన్‌, నందం గన్నిరాజు జంక్షన్‌, జాంపేట, ఆజాద్‌చౌక్‌, జెండా పంజా రోడ్డు, కందకం రోడ్డు, పుష్కరాల రేవు వరకూ అమృత్‌ – 2లో భాగంగా వాటర్‌ పైప్‌లైన్‌ కోసం తవ్వేసిన తర్వాత మట్టితో సరిగ్గా పూడ్చలేదు.

● కోటిలింగాలపేట టింబర్‌ మర్చంట్‌ వీధి మొదలు కోటిలింగాలపేట, ఈఎస్‌ఐ ఆస్పత్రి రోడ్డు, లలితా నగర్‌, కోరుకొండ రోడ్‌ జంక్షన్‌, విద్యానగర్‌ వరకూ కూడా రోడ్డు పక్కన తవ్వేసి ౖపైపెన మట్టితో కప్పేసి వదిలేశారు. దీంతో ఆయా ప్రాంతాలన్నీ బురదమయంగా మారిపోయాయి.

● గౌతమి ఘాట్‌ నుంచి గోదావరి బండ్‌ రోడ్డు, పుష్కరాల రేవు, కోటిలింగాలపేట చింతాలమ్మ ఘాట్‌ రోడ్డు వరకూ గోదావరి గట్టుపై అండర్‌గ్రౌండ్‌ విద్యుత్‌ కేబుళ్ల పనుల పేరుతో పలుచోట్ల తవ్వకాలు చేపట్టినప్పటికీ, వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో వర్షం కురిసిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. తవ్విన ప్రాంతాల్లో నీరు చేరి బురదగా మారడంతో ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు.

● మరోవైపు పలు ప్రాంతాల్లో డ్రెయినేజీ వ్యవస్థ కూడా వర్షాన్ని తట్టుకోలేకపోయింది. డ్రెయినేజీల నుంచి మురుగునీరు రోడ్లపైకి ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడ్డారు. రహదారులపై వర్షపు నీరు, మురుగునీరు కలిసిపోవడంతో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది.

వర్షం కురిసిన ప్రతిసారీ ఇదే పరిస్థితి పునరావృతమవుతున్నా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు తవ్వకాలు చేపట్టడం.. మరోవైపు రోడ్డు పునరుద్ధరణ సరిగా జరగకపోవడం.. చివరకు వర్షం కురిసినప్పుడు ప్రజలు ఇబ్బందులు పడటం పరిపాటిగా మారిందని నగరవాసులు వాపోతున్నారు.

దేవరపల్లి–పల్లంట్ల మధ్య పోలవరం కాలువ వద్ద జలమయమైన రోడ్డు

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెంలో షెడ్డుపై ఎగిరిపోయిన రేకులు

వాయుగుండం ప్రభావంతో

జిల్లా వ్యాప్తంగా వర్షాలు

ఎండలతో అల్లాడిన జనానికి

కొంత ఊరట

పంట పొలాలకు జీవం..

కానీ కరువు తీరే పరిస్థితి లేదు

పలు ప్రాంతాల్లో

రోడ్లపైకి చేరిన డ్రైనేజీ నీరు

రాజమహేంద్రవరంలో

తవ్వి వదిలేసిన గోతులతో అవస్థలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement