సాక్షి, రాజమహేంద్రవరం: చిన్నారులపై వైరల్ జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతునొప్పి పంజా విసురుతున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు, తీవ్ర వేడిమి, వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రభావంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. జ్వరం, దగ్గు, ముక్కు కారడం, గొంతునొప్పితో పాటు కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతూ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
పెరుగుతున్న ఓపీ
రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి మూడు రోజులుగా రోజుకు వంద మందికి పైగా చిన్నారులు ఓపీకి వస్తుండటం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జీజీహెచ్‌లో ప్రస్తుతం 23 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నట్లు వైద్య వర్గాల సమాచారం. వీరిలో కొందరు జ్వరంతో బాధపడుతుండగా, మరికొందరికి జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు ఉన్నాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరుతున్న చిన్నారుల సంఖ్య కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల నుంచి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, జ్వరం తదితర సమస్యలతో చిన్నారులను తల్లిదండ్రులు జీజీహెచ్‌కు తీసుకొస్తున్నారు.
ఒకరి నుంచి మరొకరికి..
మూడు రోజులుగా చిన్నారుల ఓపీ విభాగానికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు వంద మందికి పైగా చిన్నారులు చికిత్స కోసం వస్తుండటంతో ఓపీ విభాగంలో రద్దీ నెలకొంటోంది. ఒకే కుటుంబంలో ఒకరికి జ్వరం వచ్చిన తర్వాత మరొకరికి కూడా లక్షణాలు కనిపిస్తున్న ఘటనలు ఉన్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. చిన్నారులకు జ్వరం తగ్గకపోవడం, రాత్రి వేళల్లో దగ్గు తీవ్రం కావడం, తినడానికి ఇబ్బంది పడటం వంటి సమస్యలతో ఆస్పత్రులకు తీసుకొస్తున్నారు. జలుబు, దగ్గుతోపాటు కొందరు చిన్నారుల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపిస్తుండటంతో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్కూళ్లలో ఒకరి నుంచి ఒకరికి దగ్గు ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ అవుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, శిశువుల్లో శ్వాస వేగంగా తీసుకోవడం, ఛాతీ లోపలకు లాగినట్లు కనిపించడం, నిరంతర దగ్గు, నీరసం, ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తీసుకురావాలని వైద్యులుసూచిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఇదే తరహాలో పిల్లలు జ్వరాలు, జలుబు, దగ్గు, గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్నారులను స్థానిక ఆస్పత్రులు, పట్టణాల్లోని ప్రైవేటు క్లినిక్‌లకు తీసుకెళ్తున్నారు. రాజమహేంద్రవరం, రంపచోడవరం, అనపర్తి, నిడదవోలు, కొవ్వూరు, తదితర ప్రాంతాల్లో జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితుల కారణంగా శ్వాసకోశ సమస్యలతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో చిన్నారుల ఓపీకి పెరుగుతున్న తాకిడి, ఇన్‌పేషెంట్లుగా చేరుతున్న పిల్లల సంఖ్యతో జిల్లాలో చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాఖ మరింత దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
చిన్నారుల ఉక్కిరిబిక్కిరి
జలుబు, దగ్గు, గొంతునొప్పి,
శ్వాసకోశ సమస్యలతో అవస్థలు
జీజీహెచ్‌లో రోజుకు వందకు పైగా పిల్లల ఓపీ
ప్రస్తుతం 23 మందికి చికిత్స
జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి
రంపచోడవరం ప్రాంత పిల్లలకు
శ్వాసకోశ సమస్యలు


