మత్తు పదార్థాలపై ఉక్కుపాదం | - | Sakshi
Sakshi News home page

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

అధికారులు

సమన్వయంతో చర్యలు చేపట్టాలి

కలెక్టర్‌ కీర్తి చేకూరి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని అధికారులను కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు సమాజంలో నేర ప్రవృత్తి పెరిగే అవకాశం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి అక్రమ రవాణా జరిగే కీలక మార్గాలను గుర్తించి పోలీస్‌, ఎకై ్సజ్‌, అటవీ, రవాణా శాఖల సమన్వయంతో సమగ్ర తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సీసీ కెమెరాల నిఘాను విస్తృతం చేయడంతో పాటు అనుమానిత వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, కళాశాలల ప్రిన్సిపాళ్లు ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్‌ తెలిపారు. అనుమానిత విద్యార్థులను గుర్తించిన వెంటనే వారిపై ప్రతికూలంగా వ్యవహరించకుండా కౌన్సిలింగ్‌, అవసరమైన వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్‌, ఉన్నత విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. గత పదేళ్లలో చదువును మధ్యలో నిలిపివేసిన విద్యార్థుల వివరాలను సేకరించి, వారి ప్రస్తుత పరిస్థితిపై అధ్యయనం చేసి అవసరమైన అవగాహన, కౌన్సిలింగ్‌, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ మాట్లాడుతూ డీ అడిక్షన్‌ కేంద్రాల సేవలను నగర ప్రాంతాలకే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారానికి ఒకసారి ప్రత్యేక కౌన్సెలింగ్‌, వైద్య శిబిరాలు నిర్వహిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ఇంజినీరింగ్‌ కళాశాలల బస్సు డ్రైవర్లతో పాటు ఆటో డ్రైవర్లకు నెలకోసారి లేదా రెండు నెలలకోసారి మత్తు పదార్థాలు, మద్యం వినియోగంపై పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విద్యాసంస్థల యాజమాన్యాలు ఈ పరీక్షలను నిర్వహించి సంబంధిత అధికారులకు నివేదికలు సమర్పించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement