సాంకేతిక లోపాలతోనే..
సదరం సర్టిఫికెట్లలో అర్హులకు అనర్హత వస్తోందనే విషయంలో కొంత నిజం ఉంది. దీనిని సాంకేతిక లోపంగా గుర్తించాం. ఈవిధంగా ఇటీవల నా వద్దకు ఇద్దరు వచ్చారు. అర్హులైనప్పటికీ అనర్హులుగా వైకల్యం శాతం రావడంతో.. సంబంధిత వైద్యునితో మాట్లాడి, సదరం సర్టిఫికెట్‌లో వచ్చిన శాతాన్ని పోల్చి, తిరిగి వారికి అర్హులుగా ధ్రువపత్రం ఇచ్చాం. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడతాను. ఈవిధంగా ఎవరికై నా జరిగితే.. మా వద్దకు వస్తే రికార్డులు సరిచూసి, సమస్య పరిష్కరిస్తాం. సదరం సర్టిఫికెట్ల జారీలో వైకల్యం శాతాన్ని సరిగ్గా చూడకుండా, సొమ్ముకు కక్కుర్తి పడి ఇష్టారాజ్యంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటాం. దీనిపై సమాచారం ఉంటే వెంటనే మాకు ఫిర్యాదు చేయండి.
– డాక్టర్ సోఫియా, సూపరిండెంటెంట్, జిల్లా ప్రభుత్వాసుపత్రి, రాజమహేంద్రవరం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): దివ్యాంగుల జీవితాలకు భరోసా అందించేందుకు సదరం సర్టిఫికెట్ అత్యంత కీలకం. ప్రభుత్వం అందించే పింఛన్, వివిధ సంక్షేమ పథకాలు, విద్య, ఉపాధి, రాయితీలు తదితర ప్రయోజనాలకు సదరం సర్టిఫికెట్‌లో పేర్కొన్న వైకల్యం శాతం ఆధారంగానే అర్హత నిర్ణయిస్తారు. అలాంటి కీలక ధ్రువపత్రం కోసం వచ్చే దివ్యాంగులకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి(జీజీహెచ్)లో విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇక్కడ ప్రతి మంగళవారం సదరం శిబిరం నిర్వహిస్తారు. దీనికి అధిక సంఖ్యలో దివ్యాంగులు వస్తూంటారు. అయితే, వీరికి అక్కడి వైద్యులు ఇస్తున్న ధ్రువపత్రంలో పేర్కొంటున్న వైకల్యం శాతానికి, నిజజీవితంలో వారికున్న వైకల్యానికి పొంతన ఉండటం లేదు.
శాతం ఎక్కడ మారుతోంది?
సదరం ప్రక్రియలో వైద్యులు, సంబంధిత నిపుణులు నిర్వహించే పరీక్షలే ప్రాథమిక ఆధారం కావాలి. పరీక్షల సమయంలో ఒక స్థాయి వైకల్యం నమోదవుతున్నా.. తుది సర్టిఫికెట్ ఇచ్చేసరికి ఆ శాతం తగ్గిపోతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ తొలిసారి నిర్వహించిన పరీక్షా ఫలితాలకు, తుది ధ్రువపత్రంలోని శాతానికి తేడా ఉంటే దానికి కారణాలేమిటి, ఏదైనా నిర్ణీత ఫార్ములా ప్రకారం లెక్కిస్తున్నారా, ఏదైనా ఇతర వైద్య పరీక్షను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారా వంటి విషయాలను అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది.
బాధితుడికి వివరించే వ్యవస్థ ఏదీ?
సదరం ధ్రువీకరణకు ఆసుపత్రికి వస్తున్న దివ్యాంగులు గంటల తరబడి వేచి ఉంటారు. వివిధ విభాగాల్లో పరీక్షలు చేయించుకుంటారు. అవసరమైన పత్రాలన్నీ సమర్పిస్తారు. చివరకు వారికిచ్చే ధ్రువపత్రంలో తన వైకల్య శాతం ఎంత, ఎందుకు అలా నిర్ధారించారనే విషయాలు మాత్రమే కాకుండా ఆ శాతం ఎలా వచ్చిందో తెలుసుకునే హక్కు కూడా ఉండాలి. ఈ ప్రక్రియలో స్పష్టత లేకపోతే బాధితుడు ఎవరిని ఆశ్రయించాలి, తన పరీక్షా నివేదికపై అభ్యంతరం ఉంటే ఎవరికి ఎలా అప్పీల్ చేయాలి, వైకల్య శాతం తప్పుగా నమోదైందని భావిస్తే పునఃపరీక్షకు అవకాశం ఉందా, దీనంతటికీ ఎవరు బాధ్యత వహిస్తారనే విషయాలను అధికార యంత్రాంగం స్పష్టం చేయాలి.
దళారుల దందా
సదరం ధ్రువీకరణకు వస్తున్న దివ్యాంగుల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని ఆసుపత్రి పరిసరాల్లో కొందరు దళారులు సహాయం పేరుతో దందా సాగిస్తున్నారు. పరీక్షలు త్వరగా పూర్తి చేయిస్తామని, ఈ మొత్తం ప్రక్రియలో సహకరిస్తామని దివ్యాంగులను నమ్మిస్తున్నారు. సర్టిఫికెట్ విషయంలో హామీలు ఇస్తున్నారని, ధ్రువపత్రం జారీ చేసే వైద్యులతో మంతనాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు దృష్టి పెట్టాల్సి ఉంది.
పాపం వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఎలుబండి మోహన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి ఎడమ చెవి పూర్తిగా వినిపించదు. కుడి చెవి చాలా కొద్దిగా మాత్రమే, అదీ చాలా గట్టిగా అరిస్తేనే వినిపిస్తుంది. వినికిడికి సంబంధించి అతని వైకల్యం 70 శాతం పైగా ఉంటుంది. కానీ, సదరం శిబిరంలో వైద్యులు జారీ చేసిన ధ్రువపత్రంలో కేవలం 17 శాతమే వైకల్యమున్నట్లు పేర్కొన్నారు. అయితే, అదే వెంకటేశ్వరరావుకు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో అంతకుముందు ఓ ఆడియాలజీ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష నివేదిక ప్రకారం అతడి కుడి చెవికి ప్యూర్ టోన్ యావరేజ్ (పీటీఏ) 91 డెసిబుల్స్, ఎడమ చెవికి పీటీఏ 56 డెసిబుల్స్‌గా నమోదు చేశారు. కుడి చెవికి హియరింగ్ లాస్, ఎడమ చెవికి కాస్త తీవ్రంగాను వినికిడి లోపం ఉన్నట్లు నమోదు చేశారు. ఎడమ చెవికి హియరింగ్ ఎయిడ్ ఉపయోగించాలని కూడా సిఫారసు చేశారు. కానీ, చివరకు సదరం ధ్రువపత్రంలో మాత్రం వైకల్యం 17 శాతమే ఉన్నట్లు ఏవిధంగా నిర్ధారించారో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. ఒక్క వెంకటేశ్వరరావుకే కాదు.. ఇదే సమస్యను పలువురు దివ్యాంగులు ఎదుర్కొంటున్నారు. కొంత మంది వైద్యులు లేదా సిబ్బంది కాసులకు కక్కుర్తి పడి సదరం శిబిరంలో ఈవిధంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. దీనివలన ఎంతో మంది దివ్యాంగులు అర్హులైనప్పటికీ అనర్హులుగానే మిగిలిపోతూ, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు.
దివ్యాంగుల బతుకులతో చెలగాటం
సర్టిఫికెట్ల జారీలో వింతలు
అసలు వైకల్యానికి..
వైద్యుల ధ్రువీకరణకు ఆమడ దూరం
ప్రభుత్వాసుపత్రిలో అర్హులకు అన్యాయం!


