ఎస్సై పైకి దూసుకెళ్లిన కారు | - | Sakshi
Sakshi News home page

ఎస్సై పైకి దూసుకెళ్లిన కారు

Sep 25 2026 12:47 AM | Updated on Sep 25 2026 12:47 AM

● పోలీసు వాహనం కూడా ధ్వంసం

● రాంగ్‌ రూట్‌లో అతి వేగంగా డ్రైవింగ్‌

● కటకటాల్లోకి నిందితుడు

అమలాపురం టౌన్‌: నైట్‌ పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఓ ఎస్సై పైకే ఓ ప్రబుద్ధుడు కారుతో దూసుకెళ్లాడు. వివరాలివీ.. స్థానిక కొంకాపల్లికి చెందిన చల్లా ఫణికుమార్‌ (ఫణి) తన కారు(ఏపీ 04 ఆర్‌ 1111)తో అమలాపురం ఆర్టీసీ బస్‌ స్టేషన్‌ రోడ్డులో బుధవారం అర్ధరాత్రి రాంగ్‌ రూట్‌లో, అతి వేగంగా దూసుకొస్తున్నాడు. ఆ సమయంలో అక్కడ పట్టణ ఎస్సై ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు నైట్‌ పెట్రోలింగ్‌లో ఉన్నారు. ఫణి తన కారు నిర్లక్ష్యంగా నడుపుతూ ఆయన పైకి దూసుకొచ్చి ఢీకొట్టాడు. అక్కడితో ఆగకుండా అక్కడే ఆగి ఉన్న పోలీసు వాహనాన్ని కూడా ఢీకొని, అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కారు చక్రం మీద నుంచి దూసుకుపోవడంతో ఎస్సై కిషోర్‌బాబు ఎడమ పాదానికి తీవ్ర గాయమైంది. ఆయనను పోలీసు సిబ్బంది తక్షణం ఆస్పత్రికి తరలించారు. మరికొంత మంది పోలీసులు ఫణి కారును వెంబడించి, అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఫణి ఈదరపల్లి గ్రామం మీదుగా ఉన్న కొంకాపల్లి బైపాస్‌ రోడ్డులో కలెక్టర్‌ బంగ్లాకు వెళ్లే రోడ్డు వద్ద కారుతో పొదల్లోకి దూసుకుపోయాడు. అనంతరం, ఆ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ప్రభుత్వ అధికారిని గాయపరచడంతో పాటు పోలీసు వాహనంపై దాడికి విఫలయత్నం చేసిన ఫణి ఆచూకీ కోసం పోలీసులు గాలించి, గురువారం ఉదయం పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి, కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

కారు బీభత్సం

కొత్తపేట: స్థానిక సంత మార్కెట్‌ సెంటర్‌లోని వినాయకుడి ఆలయం ఎదురుగా బుధవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా షాపుల వైపు దూసుకొచ్చి, మెట్లను, అక్కడే ఉన్న ఐరన్‌ స్టాండ్లను ధ్వంసం చేసింది. కారు కూడా నుజ్జయ్యింది. కారులో డ్రైవర్‌తో పాటు మరొకరున్నారు. స్వల్ప గాయాలతో వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారని స్థానికులు తెలిపారు. టైరు పంక్చర్‌ కావడం వల్లే కారు అదుపు తప్పినట్లు డ్రైవర్‌ చెప్పారు. పోలీసుల జోక్యం లేకుండా ఇరు పక్షాలూ రాజీ పడినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement