అమలాపురం టౌన్: జిల్లాలోని సబ్ జైళ్లు సౌకర్యవంతంగా లేక ఒక్కొక్కటిగా మూతపడుతున్నా కూటమి ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదు. రిమాండ్ ఖైదీలను తరలించడానికి పోలీసులు అష్టకష్టాలు పడుతున్నా స్పందన లేదు. కోనసీమ జిల్లాలో ఆరు చోట్ల సబ్ జైళ్లు ఉండగా, ప్రస్తుతం రామచంద్రపురం మినహా మిగిలిన ఐదు జైళ్లూ మూతపడ్డాయి. అవి అక్కరకు రాకపోవడంతో రిమాండ్ ఖైదీలను జిల్లా పోలీసులు దూరాభారం, వ్యయప్రయాసలతో రాజమహేంద్రవరం సబ్ జైలుకు అతికష్టంగా తరలిస్తున్నారు.
ఒక్కటే మిగిలింది
జిల్లాలోని అమలాపురం, ఆలమూరు, రాజోలు, కొత్తపేట, ముమ్మిడివరం, రామచంద్రపురాల్లో సబ్ జైళ్లు ఉన్నాయి. వీటిలో రామచంద్రపురం జైలు ఒక్కటే పనిచేస్తోంది. ముమ్మిడివరం జైలు పదేళ్లుగా, రాజోలు జైలు దాదాపు 15 ఏళ్లుగా అందుబాటులో లేదు. కొత్తపేట జైలు ఆరు నెలలుగా మూత పడింది. ఆలమూరు సబ్ జైలు కొన్నేళ్లుగా పనిచేయడం లేదు. ఇవన్నీ దాదాపు శిథిలమై సౌకర్యవంతంగా లేవన్న కారణంతో ఒక్కొక్క సబ్ జైలును క్రమేపీ మూసేశారు. ఒక్కో సబ్ జైలులో 15 నుంచి 40 మంది వరకూ రిమాండ్ ఖైదీలను ఉంచే పరిస్థితి ఉండేది.
చిన్న కారణంతో?
అమలాపురంలోని సబ్ జైలుకు రక్షణ గోడ శిథిలమైందన్న కారణంగా పటిష్టంగా ఉన్న సబ్ జైలును మొత్తాన్ని మూసేశారు. 2014–19 మధ్య అప్పటి రాష్ట్ర డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలో కొత్త సబ్ జైలు నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ అది నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఆయన వేసిన శిలా ఫలకం మాత్రం నేటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం అమలాపురం సబ్ జైలు అడవిని తలపించేలా పిచ్చి మొక్కలు పెరిగిపోయి విష కీటకాలు, పురుగులకు నిలయంగా మారింది.
రిమాండ్ ఖైదీల తరలింపునకు అష్టకష్టాలు
జిల్లాలో పలు నేరాలకు పాల్పడిన నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరుస్తారు. వీరిలో కొందరి నిందితులకు నేర తీవ్రతను బట్టి కోర్టుల్లో న్యాయమూర్తులు రిమాండ్ విధిస్తారు. ఇలా రిమాండ్ విధించిన ఖైదీలను జిల్లాలో పైన పేర్కొన్న సబ్ జైళ్లు ఉన్నప్పుడు తక్షణమే వారిని అక్కడకు తరలించేవారు. ఇప్పుడు వాటిలో ఐదు పనిచేయకపోవడంతో రిమాండ్ ఖైదీలను పోలీస్ ఎస్కార్ట్‌తో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు అతి జాగ్రత్తగా, అప్రమత్తంగా పోలీసులు తరలించాల్సి వస్తోంది.
పాలకుల గొప్పలు
కూటమి ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్నింటా అభివృద్ధి సాధిస్తున్నామని పదే పదే గొప్పలు చెప్పుకోవడం తప్ప సబ్ జైళ్లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేయకపోవడం గమనార్హం. అమలాపురం జైలు రెండు అంతస్తులతో బాగానే ఉండి రిమాండ్ ఖైదీలను ఉంచే పరిస్థితి ఉంది. బ్రిటీషు కాలంలో అంటే 1904లో నిర్మించిన ఈ సబ్ జైలు నేటికి చెక్కు చెదరలేదు. ముఖ్యంగా రక్షణ గోడ బాగోలేదని మొత్తం జైలునే మూత వేయడం సరికాదని పోలీసులే చెబుతున్నారు.
కోనసీమ జిల్లాలో ఐదు సబ్ జైళ్ల మూసివేత
రామచంద్రపురంలో మాత్రమే
పనిచేస్తున్న వైనం
పట్టించుకోని పాలకులు
రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీల తరలింపు
అవస్థలు పడుతున్న పోలీసులు


