ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు
ఫ వెన్నుపోటు పార్టీ వంచనపై రేపు బీసీ గర్జన
ఫ 34 నియోజకవర్గాల ప్రతినిధులతో కాతేరులో నిర్వహణ
ఫ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి హాజరు కానున్న నేతలు
రాజమహేంద్రవరం రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు జరుగుతున్న ద్రోహంపై చర్చించేందుకు ఉమ్మడి తూర్పు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాలకు చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యాధికులతో ఆదివారం సమావేశం నిర్వహిస్తున్నారు. ‘వెన్నుపోటు పార్టీ వంచనపై బీసీ గర్జన’ పేరిట నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం రూరల్ కాతేరులోని వెంకటాద్రి గార్డెన్స్‌లో ఆ రోజు ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఈ వివరాలు తెలిపారు. గర్జన ఏర్పాట్లను ఆయన, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జోన్–2 కో ఆర్డినేటర్ నవుడు వెంకట రమణ, ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటీఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చందన నాగేశ్వర్ తదితరులు శుక్రవారం పరిశీలించారు.
బీసీలకు వెన్నుపోటు పార్టీ ద్రోహం
ఈ సందర్భంగా వేణు విలేకర్లతో మాట్లాడుతూ, బీసీలకు గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. కానీ, పదవులు, పథకాల్లో బీసీలకు వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం దారుణమైన ద్రోహం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రచారం తప్పతే బీసీలకు ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. దాదాపు రెండున్నరేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రతి బీసీ సామాజిక వర్గీయుడికీ అర్థమయ్యే రీతిలో కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఈ దిశగా కాతేరులో నిర్వహిస్తున్న గర్జన సమావేశానికి బీసీ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ పదవులు నిర్వహించిన నాయకులు, డాక్టర్లు, లాయర్లు తదితర విద్యాధికులు హాజరు కావాలని చేశారు. పార్టీ ప్రముఖులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, పిల్లి సుభాష్‌చంద్రబోస్, సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం, బూడి ముత్యాలనాయుడు, విడదల రజని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు తదితరులు ఈ సమావేశానికి హాజరవుతారని తెలిపారు. బీసీలు వెన్నెముక అని చెబుతూనే ఆ వర్గాలకు కూటమి ప్రభుత్వం ఏవిధంగా ద్రోహం చేస్తోందో ప్రపంచానికి తెలియజేయాలన్న అజెండాతోనే ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని వేణు చెప్పారు.
ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మాట్లాడుతూ, వెన్నుపోటు పార్టీ మోసాలపై జరిగే ఈ సమావేశం బీసీలకు అత్యంత కీలకమని అన్నారు. దీనికి అందరూ తరలివచ్చి బీసీలకు జరుగుతున్న మోసంపై గళమెత్తాలని కోరారు. వైఎస్సార్, వైఎస్ జగన్ చేసిన మేలును కూడా తెలియజేస్తామని చెప్పారు. నవుడు వెంకట రమణ మాట్లాడుతూ, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో జరిగే ఈ సభను విజయవంతం చేసేందుకు కార్యాచరణ రూపొందించామని, అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామని చెప్పారు. బీసీలందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు. చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ హయంలో బీసీలకు ఎంతో మేలు చేసారని, కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని అన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కాతేరు సదస్సు వేదికగా ప్రపంచం ముందుకు తీసుకెళ్లాలని కోరారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి దుర్గారావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బీసీలకు మనుగడ లేకుండా చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రుఖియా సయ్యద్, చాపా రాజా, యెజ్జు వాసు, ఆచంట కల్యాణ్, వాసంశెట్టి శ్రీనివాస్, కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.


