ఫ కూటమి నేతల మధ్య స్థల సర్వే వివాదం
ఫ సమిశ్రగూడెంలో పడగ విప్పిన ఆధిపత్య పోరు
ఫ మంత్రి దుర్గేష్‌కు పరస్పర ఫిర్యాదులు
ఫ చెరువు సుందరీకరణ పనులకు ఆటంకం
నిడదవోలు రూరల్: కూటమి నాయకుల మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరుతో నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో అభివృద్ధి పనులకు తీవ్ర ఆ టంకం ఏర్పడింది. స్వార్థ ప్రయోజనాల కోసం స్థానిక నేతలు ఒత్తిడి తేవడంతో.. అటు పనులు సాగించలేక, ఇటు నిర్ణయాలు తీసుకోలేక అధికారులు నలిగిపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వ భూమిని ఆక్రమించి, సొంత అవసరాలకు రోడ్డు వేసుకునేందుకు కూటమిలోని జనసేన నేత ఒకరు ప్రయత్నిస్తూంటే.. దానిని అడ్డుకుంటూ అదే కూటమిలోని టీడీపీ నాయకుడు ఒకరు ఏకంగా మంత్రి కందుల దుర్గేష్‌కు ఫిర్యాదు చేయడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. వివరాలివీ..
సమిశ్రగూడెంలో ప్రధాన చెరువును అభివృద్ధి చేయడంతో పాటు చుట్టూ వాకింగ్ ట్రాక్, చిల్ట్రన్ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటుకు రూ.50 లక్షలతో పనులు చేపట్టారు. చిల్ట్రన్ పార్కు ఏర్పాటు చేసే ప్రభుత్వ స్థలం జనసేన నాయకుడి స్థలం పక్కనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ స్థలాన్ని సర్వే చేయాలంటూ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రెవెన్యూ, గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీనిపై మంత్రి దుర్గేష్‌కు సైతం ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను జనసేన నేత అడ్డుకుని వెనక్కి పంపించేశాడు. అక్కడితో ఆగకుండా ప్రభుత్వాసుపత్రి వెనుక నుంచి తన కల్యాణ మండపానికి వెళ్లేందుకు సొంత స్థలంలో రోడ్డు నిర్మించాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది.
నలిగిపోతున్న అధికారులు
ఒకవైపు ఆక్రమణలు, చెరువు సుందరీకరణ పనులకు అడ్డంకులు, మరోవైపు కూటమి పార్టీల నేతల మధ్య ఫిర్యాదుల పర్వంతో స్థానిక పంచాయతీ, రెవెన్యూ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఆక్రమణలను నిర్ధారించడానికి, సరిహద్దులను గుర్తించడానికి సర్వేకు సిద్ధమైన అధికారులను జనసేన నాయకుడు తన రాజకీయ బలంతో అడ్డుకున్నారని, నిబంధనల ప్రకారం పని చేద్దామంటే అధికార కూటమి నేతలు బెదిరింపులకు దిగుతున్నారని, దీంతో ఎటు తేల్చుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వాపోతున్నారు. కూటమి నేతలు తక్షణం వర్గ పోరుకు స్వస్తి పలికి, చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పంచాయతీ స్థలాన్ని కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


