● మౌలిక వసతులు లేకుండానే జెడ్పీ కార్యాలయం ఏర్పాటు
రాజమహేంద్రవరం రూరల్: సాధారణంగా జిల్లాకు ముఖ్య కార్యాలయం ఏర్పాటు చేస్తున్నప్పుడు అక్కడ అవసరమైన మౌలిక వసతులను ముందుగానే కల్పించడం పరిపాటి. కానీ, శుక్రవారం ప్రారంభమైన తూర్పు గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో అటువంటి ఏర్పాట్లేవీ కానరాకపోవడంతో, విధుల్లో చేరేందుకు వచ్చిన సిబ్బంది దిక్కులు చూడాల్సి వచ్చింది. హుకుంపేటలోని రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన జెడ్పీ కార్యాలయం వద్దకు వివిధ స్థాయిల సిబ్బంది 13 మంది వచ్చారు. అప్పటికే ముంపు నీటితో నిండిపోయిన కార్యాలయం ఆవరణ వారికి స్వాగతం పలికింది. ఏదో ఒక విధంగా కార్యాలయం లోపలికి చేరుకోగా.. ఒక హాలులో రెండు టేబుల్స్ దగ్గరగా వేసి, దానికి ఇరువైపులా కుర్చీలు మాత్రమే వేసి ఉంచారు. వచ్చిన వారందరూ ఆ టేబుల్‌కు ఇరువైపులా కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుని కార్యాలయం సమయం ముగిసిన తరువాత సాయంత్రం వెళ్లిపోయారు. ఇతర జెడ్పీ కార్యాలయాలకు మౌలిక వసతులు ముందుగానే కల్పించారు. ఇక్కడ మాత్రం ఎటువంటి సదుపాయం లేకపోవడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఉద్యోగులకు సరిపడా కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు తదితర వసతులు కూడా లేకుండానే జెడ్పీ కార్యాలయాన్ని ప్రకటించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. జెడ్పీ కార్యాలయానికి మొత్తం 44 మంది ఉద్యోగులను వివిధ ప్రాంతాల నుంచి కేటాయించారు. వీరందరూ విధులు నిర్వహించేందుకు అవసరమైన గదులు కానీ, ఇతర సదుపాయాలు కానీ అక్కడ లేకపోవడం గమనార్హం.


