ఫ కడియపులంక పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
ఫ రోజుల తరబడి విచారణ
ఫ ఇప్పటికీ బయటకు రాని నివేదిక
ఫ అక్రమార్కులను కాపాడేందుకేనని అనుమానాలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పరిపాలనలో పారదర్శకతతో పాటు, జవాబుదారీతనం ఉందంటూ డబ్బా కొట్టుకోవడంలో కూటమి నాయకులు ఎప్పుడూ ముందుంటారు. కానీ, ఓ గ్రామ పంచాయతీ నిధులు పక్కదారి పట్టాయంటూ అదే గ్రామానికి చెందిన వ్యక్తి నేరుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, దానిపై విచారణకే నెలలు గడిపేశారు. తీరా విచారణ పూర్తయ్యాక, అక్రమాలు నిగ్గు తేల్చడంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇదంతా కావాలనే కాలయాపన చేస్తున్నట్లుగా ఉందని గ్రామస్తులు బాహాటంగా విమర్శిస్తున్నారు.
ఏం జరిగిందంటే..
తూర్పు గోదావరి జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న కడియం మండలంలోని కడియపులంక పంచాయతీలో.. నిబంధనలకు విరుద్ధంగా 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు రూ.25 లక్షల వరకు ఖర్చు చేసినట్లు చూపారంటూ గత ఆగస్టులో ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే డీజిల్, బ్లీచింగ్, తాగునీరు, పన్నుల విధింపు వ్యవహారాల్లో సైతం భారీగా నిధులు పక్కదారి పట్టించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని ఆరోపించారు. ఒక్కో ఖర్చుకు రెండుసార్లు బిల్లులు చెల్లించడం, చేయని పనులకు చేసినట్లుగా బిల్లులు పెట్టడం, ఎం.బుక్‌లో నమోదు చేయకుండానే ఖర్చులు చూపడం.. ఇలా అనేక అక్రమాలు దాదాపు ఏడాదిన్నరగా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై డీఎల్‌పీఓ నాగలత ఆధ్వర్యాన నలుగురు పంచాయతీ కార్యదర్శులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశారు. వారు దాదాపు నెల రోజుల పాటు విచారణ జరిపి, ఉన్నతాధికారులకు పది రోజుల కిందట నివేదిక అందజేశారు. అయితే, అక్రమాలు జరిగాయా? లేదా? జరిగితే ఎంత సొమ్ము పక్కదారి పట్టింది? నిధుల దుర్వినియోగం జరిగితే పంచాయతీ కార్యదర్శిపై ఏం చర్యలు తీసుకుంటున్నారనే ప్రశ్నలకు అధికారులు ఇప్పటి వరకూ ఎటువంటి వివరాలూ వెల్లడించలేదు. అక్రమాలు నిజమని తేలితే సంబంధిత సిబ్బందిని సస్పెండో, బదిలీయో చేసి, మరింత లోతుగా విచారణ జరపడంతో పాటు, సదరు సొమ్ము రికవరీకి చర్యలు చేపట్టాలి. కానీ, కడియపులక పంచాయతీ వ్యవహారంలో అటువంటిదేమీ జరగకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. మండలంలోని పలు పంచాయతీల్లో కూడా బిల్లు కలెక్టర్లు వసూలు చేసిన పన్నులను పక్కదారి పట్టించిన ఘటనలున్నాయని, అయితే అవి బయటకు రాకుండా సంబంధిత అధికారులకు ‘తాయిలాలు’ అందజేసి మాఫీ చేసుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి.
దోచింది కొండంత.. వెలుగు చూసేది గోరంత
పన్ను వసూళ్ల వ్యవహారాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటాయన్నది బహిరంగ రహస్యం. ఇలా అక్రమాలకు పాల్పడే వారిని కొంత మంది ఉన్నతాధికారులతో సహా వాటాలు పంచుకుని కాపాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనికి తగినట్టుగానే అధికారుల తీరు కూడా ఉంటోందని పలువురు విమర్శిస్తున్నారు. ఎంత సొమ్ము పక్కదారి పట్టినప్పటికీ.. అధికారికంగా కొంత మాత్రమే చూపిస్తున్నారని, తద్వారా ఆ సొమ్ము వెనక్కు చెల్లించేసి, తరువాత కూడా ఆ ఉద్యోగిని అదే స్థానంలో కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. అందువల్లనే కొందరు కింది స్థాయి ఉద్యోగులు ఎటువంటి జంకూ లేకుండా నిధుల దుర్వినియోగానికి, అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. కడియపులంక పంచాయతీలో జరిగిన అవకతవకల ఆరోపణలపై విచారణ చేపట్టిన అధికారులు, డీఎల్‌పనోను సంప్రదించేందుకు ప్రయత్నించగా స్పందించలేదు.


