ఉమ్మడి తూరుపు.. కొత్త రేఖలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి తూరుపు.. కొత్త రేఖలు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

గోదావరి ఒడ్డున ఇటు అంతర్వేది నుంచి ఎగువన ఏజెన్సీలోని దేవీపట్నం వరకు.. సాగర తీరాన అదే అంతర్వేది నుంచి ఎగువన తుని వరకు.. చారిత్రక నగరం రాజమహేంద్రవరం నుంచి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన రాజవొమ్మంగి వరకు.. కాకినాడ నుంచి రావులపాలెం వరకు.. దట్టమైన రంపచోడవరం అడవుల నుంచి సువిశాల జలధి వరకు.. 62 మండలాల్లోని పల్లెలన్నింటినీ ఒకే గొడుగు కింద నిలిపిన పెద్ద ఇల్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌. ఆ పెద్ద ఇంటితో బంధం మరో 24 గంటల్లో

దూరం కానుంది.

సాక్షి, అమలాపురం: గోదావరి అప్పుడప్పుడు మాత్రమే పొంగుతుంది. కానీ, గోదావరి జిల్లాల వాసుల బంధాలు.. అనుబంధాలు ఎప్పుడూ పొంగుతూనే ఉంటాయి. పరిపాలనా సౌలభ్యం కోసం మ్యాపులో గీతలు గీసి జిల్లాలను భౌగోళికంగా విభజించారు. కానీ, మానసికంగా మాత్రం ఇక్కడి ప్రజల్లో ‘ఉమ్మడి’ అనే మూడు అక్షరాల సెంటిమెంట్‌ అలాగే ఉండిపోయింది. జిల్లాల పునర్విభజన అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చివరి గుర్తులుగా మిగిలినవి రెండే రెండు. ఒకటి డీసీసీబీ, రెండోది జిల్లా పరిషత్‌. అందులోనూ జిల్లా పరిషత్‌తో ఉన్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. పల్లె పల్లెకూ రోడ్లు వేసింది.. ప్రతి ఊరికీ బడి కట్టింది.. ఎన్నో కుటుంబాలకు ఉపాధి చూపింది జిల్లా పరిషత్తే.

శతాబ్దానికి పైబడిన ప్రస్థానం

పరిపాలన కోసం బ్రిటిష్‌ వాళ్లు 1917లో జిల్లా బోర్డును ఏర్పాటు చేసినప్పుడు మొదలైందీ ప్రయాణం. స్వాతంత్య్రం వచ్చాక జిల్లా పరిషత్‌గా మారి శాఖోపశాఖలుగా విస్తరించింది. 1987లో జిల్లా ప్రజా పరిషత్‌గా పేరు మార్చుకుని ప్రజాస్వామ్యానికి పట్టం కట్టింది. 109 వసంతాల మహావృక్షంగా ఎదిగిన ఈ వ్యవస్థ చరిత్రలో ఎన్నో మలుపులు చూసింది. రావు బహదూర్‌ బిరుదులు పొందిన జమీందార్ల నుంచి, పుష్కర కాలం పాటు జెడ్పీని ఏలిన ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు వరకు.. జెడ్పీ చైర్మన్‌గా మొదలై ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్‌ స్థాయికి ఎదిగిన కోనసీమ బిడ్డ దివంగత జీఎంసీ బాలయోగి వరకు.. తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించిన వంగా గీతా విశ్వనాథ్‌ నుంచి.. ఇరిగేషన్‌ శాఖలో ఏఈ నుంచి ఎస్‌ఈ వరకు విధులు నిర్వహించి, చివరి ఉమ్మడి జెడ్పీ చైర్మన్‌గా నిలిచిన విప్పర్తి వేణుగోపాలరావు వరకు.. మొత్తం 23 మంది ఎన్నికై న చైర్మన్లు ఈ వేదిక మీద నుంచే ప్రజలకు సేవలందించారు.

జెడ్పీ చైర్మన్‌ నుంచి ఉన్నత పదవులకు..

ఉమ్మడి జెడ్పీ చైర్మన్‌గా పని చేసిన వారు ఆ తరువాత రాజకీయంగా ఉన్నత స్థానాలకు వెళ్లడం ఆనవాయితీగా మారింది. ఒకరిద్దరు మినహా చాలా మంది ఉన్నత పదవులు పొందారు. పంతం పద్మనాభం రాష్ట్ర మంత్రిగా పని చేయగా, ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కేంద్ర మంత్రి అయ్యారు. బొడ్డు భాస్కర రామారావు రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌ చైర్మన్‌గా క్యాబినెట్‌ హోదాలో పని చేశారు. జీఎంసీ బాలయోగి రాష్ట్ర మంత్రిగానే కాకుండా ఏకంగా లోక్‌సభ స్పీకర్‌ సైతం అయ్యారు. వంగా గీతా విశ్వనాథ్‌ ఎమ్మెల్యేగా, లోక్‌సభ, రాజ్యసభ సభ్యురాలిగా సేవలందించారు. చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ రాష్ట్ర మంత్రిగా పని చేశారు.

నేడు ఆత్మీయ వీడ్కోలు

ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ చరిత్రకు గురువారంతో తెర పడనుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఆ రోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా కాకినాడలోని జెడ్పీ కార్యాలయంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు, సిబ్బంది చివరిసారిగా బుధవారం ఆత్మీయంగా కలుసుకోనున్నారు. ఒకరినొకరు పలకరించుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉమ్మడి జెడ్పీకి ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.

నాలుగు పరిషత్తులుగా..

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌ ఈ నెల 25న నాలుగింటిగా విడిపోనుంది. జీఓ నంబర్లు 115, 116 ప్రకారం 21 మండలాలతో తూర్పు గోదావరి, 20 మండలాలతో కాకినాడ, 19 మండలాలతో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, 12 మండలాలతో పోలవరం జిల్లాలకు కొత్తగా పరిషత్‌లు ఏర్పడనున్నాయి.

ఇప్పటి వరకు ఎన్నికై న చైర్మన్లు వీరే..

జిల్లా బోర్డు ఉన్న కాలంలో 10 మంది అధ్యక్షులుగా పని చేశారు. 1959లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్‌, 1987లో జిల్లా ప్రజా పరిషత్‌గా ఉన్న కాలంలో 13 మంది చైర్మన్లుగా సేవలందించారు.

జెడ్పీ చైర్మన్‌ పదవీ కాలం

తోట రామస్వామి 1959–64

ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు 1964–76

పంతం పద్మనాభం 1981–83

బొడ్డు భాస్కర రామారావు 1983–86

జీఎంసీ బాలయోగి 1987–91

గారపాటి గంగాధర రామారావు చౌదరి 1991–92

వంగా గీతా విశ్వనాథ్‌ 1995–2000

గుత్తుల బులిరాజు 2000

దున్నా జనార్దనరావు 2001

చెల్లుబోయిన

శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2006–11

నామన రాంబాబు 2014–17

జ్యోతుల నవీన్‌ కుమార్‌ 2017–19

విప్పర్తి వేణుగోపాలరావు 2021–26

సెప్టెంబర్‌ 24 వరకు

సిబ్బంది విభజన

కొత్త జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు సమయం దగ్గర పడుతూండటంతో విభజన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. జెడ్పీ పరిధిలోని 62 మండలాలకు చెందిన ఉద్యోగులను కొత్తగా పునర్వ్యవస్థీకరించిన నాలుగు జిల్లాలకు తాత్కాలికంగా కేటాయిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఉమ్మడి జిల్లా నుంచి ఏర్పడిన కొత్త జిల్లాలకు మండలాల వారీగా ఉద్యోగులను విభజించారు. మొత్తం 106 మంది సిబ్బంది ఉండగా, వారిని మండలాల నిష్పత్తి ప్రకారం విభజించారు. జిల్లా హెడ్‌ కాకుండా మిగిలిన సిబ్బంది కేటాయింపులు ఇలా..

ఫ ఉమ్మడి జెడ్పీకి మరో 24 గంటల్లో తెర

ఫ 109 ఏళ్ల ప్రస్థానానికి ముగింపు

ఫ ప్రస్తుత పాలకవర్గం గడువు

రేపటితో పూర్తి

ఫ 25 నుంచి నాలుగు కొత్త జిల్లా పరిషత్‌లు

హోదా మొత్తం జిల్లాల వారీగా కేటాయించిన సిబ్బంది

పోస్టులు తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ పోలవరం

అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ 11 2 4 3 2

సీనియర్‌ అసిస్టెంట్‌ 24 5 8 7 4

జూనియర్‌ అసిస్టెంట్‌ 42 8 14 13 7

టైపిస్ట్‌ 7 2 2 2 1

ఆఫీస్‌ సబార్డినేట్‌ 18 3 6 6 3

ఫ డ్రైవర్లు ముగ్గురు, రికార్డు అసిస్టెంట్లు ఇద్దరు, క్లాస్‌–4 సిబ్బంది నలుగురిని కూడా నిష్పత్తి వారీగా విభజించారు. యూడీ స్టెనో, ఎల్‌డీ స్టెనో, దఫేదార్‌/ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement