సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గురజాడ ఆశయాలు నేటితరానికి స్ఫూర్తిదాయకమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ హాల్‌లో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. తొలుత గురజాడ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావు తన సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం, సంస్కరణలకు విశేష కృషి చేశారన్నారు. కన్యాశుల్కం వంటి రచనల ద్వారా సామాజిక దురాచారాలను ప్రశ్నించారని, ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అనే సందేశంతో మానవతా విలువలు చాటారని అన్నారు. యువత గురజాడ జీవితాన్ని, రచనలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్ మాట్లాడుతూ సమాజంలోని లోపాలను ప్రశ్నించి, మార్పు కోసం తన కలాన్ని ఆయుధంగా మలిచిన గొప్ప సంఘ సంస్కర్త గురజాడ అని కొనియాడారు. కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడి, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.భాస్కర్‌రెడ్డి, ఆర్డీఓలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు, డీఎస్పీ ఎ.శివప్రియ తదితరులు పాల్గొన్నారు.
131 మద్యం షాపుల
లైసెన్స్ రెన్యువల్
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): జిల్లాలోని 138 మద్యం షాపులకు గాను సోమవారం రాత్రి 8 గంటల వరకు 131 షాపులకు యజమానులు ఏడాది కాలానికి లైసెన్స్‌లను రెన్యువల్ చేయించుకున్నారు. మిగిలిన ఏడు షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు సమయం ఉంది. ఒకవేళ లైసెన్స్ రెన్యువల్ చేయించుకోని పక్షంలో ఆ షాపులకు ఆక్షన్ నిర్వహిస్తామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వై.శ్రీలత తెలిపారు. ఈ మద్యం షాపులకు అక్టోబర్ ఒకటి నుంచి 2027 సెప్టెంబరు 30 వరకు లైసెన్సు చెల్లుబాటు అవుతుందన్నారు.
25న నులిపురుగుల
నిర్మూలన కార్యక్రమం
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25న జిల్లాలోని 1–19 సంవత్సరాల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నట్లు కలెక్టర్ చేకూరి కీర్తి తెలిపారు. సోమవారం స్థానిక పీజీఆర్‌ఎస్ హాల్‌లో ఈ పోస్టర్‌ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవడం ద్వారా నులిపురుగుల వల్ల కలిగే ఇబ్బందులను నివారించడంతో పాటు పిల్లల్లో రక్తహీనతను తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.కోమల మాట్లాడుతూ 4,46,865 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


