రాయవరం: ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇన్ సర్వీస్ టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. సాధారణ టెట్‌కు ప్రత్యేక టెట్‌కు మధ్య ఎటువంటి మినహాయింపులూ లేకపోవడంతో వారితో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పోరాటానికి ఉద్యమ బాట పడుతున్నాయి. ఒకవైపు డీఏల పెండింగ్, మరోవైపు పీఆర్‌సీపై ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు.. ప్రత్యేక టెట్‌లోనూ ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోవడంతో ఆగ్రహోదగ్రులవుతున్నారు.
అడిగినదొకటి.. అయ్యిందొక్కటి
సాధారణ డిగ్రీలతో వృత్తిపరమైన డీఎడ్, బీఎడ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించే ముందు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు సైతం టెట్ ఉత్తీర్ణులు కావాల్సిందేనని పేర్కొంది. ఐదేళ్లలో ఉద్యోగ విరమణ చేసేవారికి మాత్రం మినహాయింపునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. విద్యాహక్కు చట్టం–2009 ప్రకారం దేశంలో టెట్ విధానం తెర పైకి వచ్చింది. రాష్ట్రంలో 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. 2011కి ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు ఒకటో తేదీ లోపు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో, ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
ఇవీ డిమాండ్లు
● విద్యాహక్కు చట్టం–2009 సెక్షన్ 23(1)ను సవరించేలా కేంద్రంపై చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. తమకు టెట్ లేకుండా చేయాలి.
● సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్‌లో సామాజిక వర్గం, కేటగిరీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులు ప్రకటించాలి.
● సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం లేనందున ఆఫ్‌లైన్‌లో పరీక్ష నిర్వహించాలి.
● ఏ సబ్జెక్టు టీచర్‌కు అదే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష నిర్వహించాలి.
ఇదెక్కడి చోద్యం!
ఉపాధ్యాయుల డిమాండ్ల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్ టెట్ నిర్వహిస్తామంటూ చెప్పుకొచ్చింది. వాస్తవానికి ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకూ సాధారణ టెట్ నిర్వహించారు. ఈ ఫలితాలు సెప్టెంబర్ 15న ప్రకటించాల్సి ఉంది. కానీ, ఆ పని పూర్తి కాకుండానే స్పెషల్ టెట్ పేరుతో ప్రభుత్వం మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో, ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు మళ్లీ టెట్‌కు దరఖాస్తు చేయాలా, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాలా, టెట్ ఫలితం వచ్చే వరకూ వేచి ఉండాలా అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి. టెట్ వెయిటేజీ, పరీక్ష విధానంలో కూడా ఎటువంటి మార్పులూ లేవు. మరోవైపు స్పెషల్ నెట్ నోటిఫికేషన్‌లో సైతం సాధారణ టెట్‌లో ఉన్న అంశాలే ఉండటంతో వారు అవాక్కవుతున్నారు. ఆన్‌లైన్‌లోనే టెస్ట్‌కు హాజరు కావాలని నోటిఫికేషన్‌లో పేర్కొనగా.. ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని, పరీక్ష విధానంలో మార్పులు తేవాలని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయులను ప్రభుత్వం మోసగించింది.
– చింతాడ ప్రదీప్ కుమార్,
పీఆర్‌టీయూ కాకినాడ జిల్లా అధ్యక్షుడు
స్పెషల్ టెట్ నోటిఫికేషన్‌పై
ఇన్ సర్వీస్ టీచర్ల ఆగ్రహం
పోరాటానికి ఉపాధ్యాయ
సంఘాల కార్యాచరణ
ఉమ్మడి జిల్లాలో 18 వేల మంది ఉపాధ్యాయులు


