కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో నిబంధనలు సడలించాలని, ఇన్ సర్వీస్ టీచర్లకు అర్హత మార్కులు తగ్గించాలని ఏపీ యూటీఎఫ్ జిల్లా శాఖ కోరింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) కె.వాసుదేవరావుకు ఆయన కార్యాలయంలో ఆ సంఘ నాయకులు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం సెక్షన్23(1)ను సవరించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఆఫ్‌లైన్‌లో టెట్ నిర్వహించాలన్నారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బుధవారం నుంచి 30వ తేదీ వరకూ బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు, సెప్టెంబర్ 3న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈవీవీఎస్‌ఎస్‌ఆర్ ప్రసాద్, కార్యదర్శి ఎ.షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


